logo

భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?

భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 May 2024 04:52 IST

ద్రాక్షారామ ఆలయంలో అడ్డగోలు వసూళ్లు

భీమేశ్వరాలయంలో వాహనాలు నిలిపే ప్రదేశం

ద్రాక్షారామ, న్యూస్‌టుడే : భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. వీరి సంఖ్య రోజుకు మూడు వేల నుంచి అయిదు వేల వరకు ఉంటుంది. పర్వదినాలు, వివాహ వేడుకల సమయంలో దాదాపు పది వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది. ఇంత ప్రాధాన్యమున్న క్షేత్రం వద్ద భక్తుల నుంచి వసూలు చేసే వివిధ రుసుముల విషయంలో నియంత్రణ కొరవడింది. ముఖ్యంగా వాహనాల పార్కింగు విషయంలో పర్యాటకులు దోపిడీకి గురవుతున్నారు. ఆలయ ప్రాంగణంలో వాహనాలు నిలిపే వారి నుంచి రుసుము వసూలు చేసుకొనేందుకు ఏడాదికి ఒకసారి వేలం నిర్వహిస్తారు. హెచ్చుకు పాడిన వారు దక్కించుకుంటున్నారు. కొంతమంది అత్యాశతో హెచ్చు మొత్తానికి పాట దక్కించుకొని భక్తుల నుంచి అధిక మొత్తంలో రుసుము వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. వాస్తవానికి దేవాదాయశాఖ నిర్ణయించిన ధరల ప్రకారం లారీ/బస్సుకు రూ.100, ట్రాక్టరు/ మినీ వ్యానుకు రూ.50, చిన్నకారు/వ్యానుకు రూ.20, ఆటోకు రూ.15, స్కూటరు/మోటారు సైకిల్‌కు రూ.10, సైకిల్‌కు రూ.5 వసూలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బస్సుకు రూ.200, ట్రాక్టరు/వ్యానుకు రూ.150, చిన్నకారుకు రూ.50, ఆటోకు రూ.30, మోటారు సైకిల్‌కు రూ.20 చొప్పున వసూలుచేస్తున్నారు. దీనిపై గతంలో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఇంత వరకు ఈవో స్పందించిన దాఖలాలు లేవు. ఆలయ ప్రాంగణంలో పార్కింగు రుసుము ఎంత వసూలు చేయాలో బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఆలయంలో వివాహాలు చేసుకోడానికి ఏర్పాటు చేసే కల్యాణ మండపాలు విషయంలో కూడా ఇదే విధంగా దోపిడీ సాగుతోందని భక్తులు వాపోతున్నారు. ఒక్కో వివాహానికి రెండు, మూడు వేలు రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా ఈవో అండదండలతో రూ.15 వేల నుంచి 20వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం పాటదారుల బాగోగుల కోసం ఈవో పని చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నారు. భక్తుల అవసరాలు తీర్చే విధంగా అధికారులు పనిచేయాలని స్ధానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని