logo

అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్‌ది..

కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు.

Published : 23 Apr 2024 05:32 IST

వైకాపా మూలనపడేసిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యండి
జగ్గంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, పక్కన కాకినాడ ఎంపీ, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌, జ్యోతుల నెహ్రూ

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం, గోకవరం, గండేపల్లి: కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. ఏం తమ్ముళ్లూ హుషారుగా ఉన్నారా..? ఆడబిడ్డలూ యుద్ధానికి సిద్ధమా..? అంటూ చైతన్యాన్ని ప్రోదిచేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో పాడైన ఎత్తిపోతల పథకాలను మళ్లీ ప్రారంభించే బాధ్యత తమదని అన్నారు. ఇక్కడకు అన్ని విద్యాలయాలు తీసుకొస్తామని, మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఒకటో తేదీన వాలంటీరుతో కాకుండా సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
సమర్థ పాలన ఉంటే విద్యుత్తు ఛార్జీలు పెరగవు.. అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకుని త్వరలో మేనిఫెస్టో ఇస్తాం.

జగ్గంపేటలోని ప్రజాగళం బహిరంగ సభకు హాజరైన మహిళలు, అభిమానులు, శ్రేణులు... మాట్లాడుతున్న చంద్రబాబు


ఉత్సాహవంతుడు ఉదయ్‌.. యోధుడు నెహ్రూ..

4,500 టీ-టైం పాయింట్లు పెట్టి, 20 వేల మందికి ఉపాధి కల్పించిన కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌, 40 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నెహ్రూలను గెలిపించాలని చంద్రబాబు అన్నారు. ఉదయ్‌ శ్రీనివాస్‌కు గాజుగ్లాసు గుర్తుపై ఓటేసి పార్లమెంటుకు పంపాలని.. ఆయన గెలిస్తే మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తారన్నారు. నెహ్రూ తన వెంటపడి చాగల్నాడు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు ఆగకుండా పుష్కర వచ్చిదంటే ఆయనే చొరవేనన్నారు. పురుషోత్తపట్నం ఆధునికీకరణ కోసం తపించారన్నారు. పవన్‌కల్యాణ్‌ అభిమానులు నెహ్రూ కోసం సైకిల్‌ గుర్తుపైనా.. తెదేపా అభిమానులు, శ్రేణులు ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ కోసం గాజుగ్లాసు గుర్తుపై ఓటేయాలని కోరారు.
తెదేపా పాలనలో అభివృద్ధి.. వైకాపా పాలనలో విధ్వంసం చూశారు. ఈసారి ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యండి


మండుటెండలో.. ఉప్పొంగిన ఉత్సాహం..

రూ.4వేల పింఛనుపై ఫ్లకార్డుతో..

ప్రజాగళం బహిరంగ సభ మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగుతుందంటే 2 గంటలకే జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ కూడలిలో శ్రేణులు చేరాయి. ద్విచక్రవాహన ప్రదర్శనలతో, తెదేపా- జనసేన- భాజపా జెండాల రెపరెపలతో ఉత్సాహంగా తరలివచ్చారు. ఎండ తీవ్రతకు అసౌకర్యానికి గురవకుండా షామియానాలు, శీతల యంత్రాలు ఏర్పాటుచేశారు.
తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.


జైకొట్టి.. నినదించి

చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌కు అధికారం సేవ చేయమని ఇచ్చారా? లేదా..? సేవా భావంతో పనిచేశాడా..? అని ప్రశ్నించగా చేయలేదంటూ ప్రజలు స్పందించారు. సజ్జల లాంటి బ్రోకర్‌, పనికిరాని వ్యక్తి..సాక్షి ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని విమర్శించడం న్యాయమా.. మీకు రోషం రాదా..?అని చంద్రబాబు విమర్శించినప్పుడూ ఆహుతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జగన్‌ జే బ్రాండ్‌ నాసిరకం మద్యం అమ్ముతున్నాడు.. మీ మగాళ్ల ఆరోగ్యం బాగుందా..? అని మహిళలను ప్రశ్నించినప్పుడు బాగాలేదంటూ చేతులు ఊపారు. సీపీఎస్‌ రద్దుచేశాడా..? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని తొమ్మిదిసార్లు పెంచాడా లేదా..? అన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. * కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.వి.ఎస్‌.అప్పలరాజు, జనసేన ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్‌, భాజపా కన్వీనర్‌ దాట్ల కృష్ణవర్మ పాల్గొన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛను ఏప్రిల్‌ నుంచే ఇంటిదగ్గరికే ఇస్తాం. ఒకనెల తీసుకోకపోతే, రెండోనెల, మూడో నెల ఇంటికే తెచ్చి ఇస్తాం. పింఛను పెట్టింది తెదేపా.. రూ.200 పింఛనును రూ.2వేలు చేసింది కూడా మేమే.

జెండాలతో ఉత్సాహం, ఆకట్టుకున్న బోర్డు, పసుపు కండువాలతో మహిళల జోష్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని