logo

నాడు ఊదరగొట్టారు.. నేడు ఉసురు తీస్తున్నారు

సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే.

Updated : 30 Apr 2024 07:05 IST

మండుటెండలో బ్యాంకులకు వెళ్లలేం
ఇంటికే పింఛను ఇవ్వాలంటున్న లబ్ధిదారులు

సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా బ్యాంకుల చుట్టూ తిప్పించేందుకు ప్రయత్నిస్త్తోంది. ఎన్నికల వేళ ఆలస్యం చేస్తూ, రకరకాల కుయుక్తులు పన్నుతోంది. సరిపడా సిబ్బంది ఉన్నా.. ప్రతిపక్షాలపై బురద జల్లుతూ ఓట్ల కోసం అభాగ్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.


‘‘ఒకటో తారీఖు వచ్చేసరికి.. పండగ దినమైనా సరే.. సెలవు దినమైనా సరే.. సూర్యోదయానికి ముందే చిక్కటి చిరునవ్వుతో ప్రతి అవ్వకు, తాతకు పింఛను అందిస్తున్నాం. అభాగ్యులకు, అవ్వా తాతలకు.. వితంతువులకు మంచిచేస్తూ.. సామాజిక పింఛన్లు రూ.3 వేలు చొప్పున ఇస్తున్నాం’

ఈ ఏడాది జనవరి 3న కాకినాడ సభలో ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలివి..


ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం, కొవ్వూరు: ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన రెండ్రోజుల్లో దాదాపు 95 శాతానికి పైగా అందించినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా యంత్రాంగం తలచుకుంటే అందుబాటులో ఉన్న సచివాలయ వ్యవస్థ సిబ్బంది ద్వారా రెండ్రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పంపిణీ పూర్తిచేయొచ్చు. అయినా కుంటి సాకులు చెబుతూ.. వృద్ధులను, అభాగ్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏప్రిల్‌ పింఛను కూడా ఉద్దేశపూర్వకంగా డబ్బు సర్దుబాటు చేయక, పంపిణీలో జాప్యంతో మండుటెండలో తీవ్ర నరకం చూడాల్సిన పరిస్థితి వైకాపా సర్కారు కల్పించింది.

ఏప్రిల్‌ మొదటి వారంలో సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ


వారికే సొమ్ముపడలేదు.. ఇప్పుడు వీరికట!

డీబీటీ(డైరెక్ట్‌ బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌) విధానంలో మే నెల పింఛన్లు విడుదల చేయనున్నారు. ఆ సొమ్ము లబ్ధిదారుల ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు జమకానుంది. ఇప్పటివరకు డీబీటీ విధానంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సొమ్ము అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛను సొమ్ముకు కూడా తమకు పాట్లు తప్పవా.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఒక్కరోజులో ఇవ్వొచ్చు..

తూర్పులోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 512 సచివాలయాలుండగా వీటిలో 4,297 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి అదనంగా పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది వందల్లో ఉన్నారు. వీరందర్నీ పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం చేస్తే ఒక్క రోజులోనే ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయవచ్చు.

  • సామాజిక భద్రత పింఛనుదారుల్లో అత్యధికంగా వృద్ధాప్య పింఛను పొందుతున్నవారు జిల్లాలో 1.21 లక్షల మంది ఉన్నారు. ఔషధాల కొనుగోలు కోసం ప్రతినెలా 1న అందే పింఛను డబ్బులపై ఆధారపడేవారు వీరిలో ఎక్కువ.

బ్యాంకులకు వెళ్లాలంటే ఇదీ ఇబ్బంది

  • వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలా మందికి ఏటీఎం కార్డులు లేవు.. ఒకటో తేదీ మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం.. రెండో తేదీన వెళ్లాలి. పలుచోట్ల గ్రామాల్లో బ్యాంకులు లేకపోవడంతో మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి.
  • మరికొందరికి బ్యాంకు ఖాతాలు మనుగడలో లేవు.
  • లబ్ధిదారులకు వేలిముద్రలు సరిగా పడటం లేదు. వీరు బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోవాలన్నా అక్కడ ముద్రలు పడకపోతే ఇబ్బందే. నిర్వహణలేని ఖాతాల్లో నగదు ఉపసంహరణ సమయంలో బ్యాంకులు ఛార్జీల పేరిట మినహాయించుకునే అవకాశం ఉంది.
  • జిల్లాలో అనేక గ్రామాల్లో బ్యాంకులు లేవు. కేవలం మండల కేంద్రాల్లో ఉన్నాయి.దీంతో పింఛనుదారులు తమ సొమ్ము కోసం మండల కేంద్రాలకు రావాల్సి ఉంటుంది.

74 శాతం మందికి అవస్థే

  • తూర్పులో సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 26 శాతం మందిని ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి వారికి మాత్రమే ఇళ్ల వద్ద ఇస్తామని, మిగతా 74 శాతం మందికి వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. నేరుగా బ్యాంకులకు వెళ్లి ఏటీఎం, బ్యాంకు కలెక్షన్‌ సెంటర్ల ద్వారాగాని నగదు ఉపసంహరించుకోవచ్చని చెబుతున్నారు.
  • వితంతు పింఛను లబ్ధిదారులు 64,939 మంది, ఒంటరి మహిళ పింఛనుదారులు 9,140 మంది ఉన్నారు. మిగతావారిలో నేత, కల్లుగీత, కుండల తయారీదారులు, కళాకారులు, చర్మకార తదితరులు ఉన్నారు. వీరిలో చాలామందికి బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోగా పూర్తిగా అవగాహన లేనివారూ ఉన్నారు. వీరంతా పింఛను సొమ్ము ఉపసంహరణకు ఇబ్బంది పడే పరిస్థితి.

సచివాలయ ఉద్యోగులున్నారుగా..

గత నెలలో సచివాలయానికి రమ్మని ఇచ్చారు. ఇబ్బందిపడినా కొంత ఉపశమనం. ఈసారి బ్యాంకు ఖాతాకు వేయడంలోని మర్మమేమిటో నాకు బోధపడడం లేదు. నేను వాడపల్లి వెళ్లాలి. ఎవరో ఒకరి సాయంతో ఆటోపై వెళ్లాలి. తీరా వెళ్లాకా నగదు వస్తుందో రాదో ఏమైనా కొర్రీలు పెడతారో తెలియదు. ఆ బ్యాంకుకు చాలామంది పింఛను కోసం వస్తారు. సచివాలయ కార్యదర్శులతో మాకు సొమ్ము ఇచ్చే అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదో..!

 పుసులూరి లక్ష్మి, మద్దూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని