logo

ప్రాణం తీసిన ఆధిపత్య పోరు

వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఆధిపత్యపోరు హత్యకు దారితీసింది. తెదేపాకు చెందిన తోట చంద్రయ్య(42) గురువారం హత్యకు గురవడం సంచలనం రేపింది. 2009 నుంచి గ్రామంలో ఆధిపత్య పోరు సాగుతోంది. అప్పట్లోనే చంద్రయ్యపై దాడికి

Published : 14 Jan 2022 02:29 IST

నడివీధిలో తెదేపా నేత హత్యతో ఉలిక్కిపడిన గుండ్లపాడు

న్యూస్‌టుడే, మాచర్ల

వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఆధిపత్యపోరు హత్యకు దారితీసింది. తెదేపాకు చెందిన తోట చంద్రయ్య(42) గురువారం హత్యకు గురవడం సంచలనం రేపింది. 2009 నుంచి గ్రామంలో ఆధిపత్య పోరు సాగుతోంది. అప్పట్లోనే చంద్రయ్యపై దాడికి విఫలయత్నం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత వివాదం కొంత సద్దుమనిగింది. తెదేపా నియోజకవర్గ బాధ్యుడిగా జూలకంటి బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత గతనెల 29న మాచర్లలో ర్యాలీ జరిగింది. చంద్రయ్య అనుచరులతో మాచర్లకు వెళ్లడం, గ్రామంలో తెదేపా తరఫున చురుగ్గా వ్యవహరించడంతో వైకాపా నాయకులు కన్నెర్ర చేశారు. గురువారం హత్య చేస్తూ కూడా తెదేపా జెండా పట్టుకుంటారా అంటూ కేకలు వేశారని చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు చెప్పారు. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అతను టీఎన్‌టీయూసీ నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత చాలాసేపటికి పోలీసులు రావడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రయ్య (పాత చిత్రం)

గుండ్లపాడుకు పక్కనే పిన్నెల్లి, జూలకంటి సొంతూర్లు

గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య సంచలనం రేకెత్తించింది. రాజకీయ ఆధిపత్యం ఎక్కువగా కనిపించే ఈ గ్రామంలో తాజా పరిస్థితులు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ప్రభుత్వవిప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండ్లకుంటకు పక్క గ్రామమే గుండ్లపాడు. ప్రస్తుతం తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తి. దీనికి ఈ గ్రామం ఆనుకోనే ఉంటుంది.

గుండ్లపాడు గ్రామం

గ్రామానికి 5.కి.మీ. దూరంలోనే పోలీస్‌స్టేషన్‌

గుండ్లపాడులో చంద్రయ్య హత్య గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగితే పోలీసులు 9.30 గంటల తరువాత వచ్చారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ గుండ్లపాడుకు 5 కి.మీ.దూరంలోనే ఉంటుంది. పోలీసులు రావడానికి అంత సమయం తీసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పోస్టు రెండునెలలకు పైగానే ఖాళీగా ఉంది.

చంద్రయ్య భార్య, కుటుంబ సభ్యుల రోదన

కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారయ్యా..

హత్యకు గురైన చంద్రయ్య మృతదేహాన్ని పంచనామా కోసం మాచర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో మిన్నంటింది. మాజీ మంత్రి పుల్లారావు, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, పార్టీ నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రయ్య భార్య కోటమ్మ నా భర్తను కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారయ్యా అంటూ విలపించింది. జనం అందరూ చూస్తుండగానే కత్తులతో చంపేశారయ్యా అంటూ కన్నీటి పర్యంతమైంది. ఏ రోజు గ్రామంలో నా భర్త ఎవరికీ అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదన్నారు. ఓర్వలేకనే చంపి రాక్షసానందం పొందుతున్నారని వాపోయింది. తన కళ్లముందే తండ్రిని చంపారని కుమారుడు వీరాంజనేయులు పేర్కొన్నారు. కర్రలతో కొట్టి, రాళ్లతో, కత్తులతో విచక్షణరహితంగా చంపారని విలపించాడు. హత్య చేసిన వారికి శిక్షలు పడాలని డిమాండ్‌ చేశారు. అడుగడుగునా పోలీసుల వైఫల్యాలపై తెదేపా నేతలు మండిపడుతున్నారు.

హత్యను రాజకీయం చేయడం తగదు

మాచర్ల: గుండ్లపాడులో తెదేపా నేత తోట చంద్రయ్య హత్యకు వైకాపాకు సంబంధం లేదని ప్రభుత్వవిప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రయ్య హత్యవెనుక కారణాలు ఏమిటన్నది తెదేపా నాయకులు తెలుసుకోవాలన్నారు. హత్యను రాజకీయం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నట్లు విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా ఫ్యాక్షనిజం ప్రోత్సహించలేదన్నారు.

చంద్రయ్య అంతిమ యాత్రలో జనసందోహం

బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న మాజీ

మంత్రి పుల్లారావు, జీవీ ఆంజనేయులు తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని