logo

మేము సైతం..

అర్బన్‌ రక్తదానం అనగానే శరీరంలో శక్తి పోతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే శాష్ట్రసాంకేతికత అభివృద్ధి చెందిన కారణంగా సేవా సంస్థల ప్రచారాలతో రక్తదానం ప్రాణదానమని విశ్వసిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే చాలు రక్తం ఇవ్వవచ్చన్న భావన పెరుగుతోంది. విద్యార్థినులు సైతం రక్తదానం చేయాలని ముందుకు

Published : 17 Jan 2022 02:33 IST

రక్తదానం చేసిన విద్యార్థినులు


రక్తదానం చేయడానికి పేర్లు నమోదు చేయించుకుంటున్న విద్యార్థినులు

న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌ రక్తదానం అనగానే శరీరంలో శక్తి పోతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే శాష్ట్రసాంకేతికత అభివృద్ధి చెందిన కారణంగా సేవా సంస్థల ప్రచారాలతో రక్తదానం ప్రాణదానమని విశ్వసిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే చాలు రక్తం ఇవ్వవచ్చన్న భావన పెరుగుతోంది. విద్యార్థినులు సైతం రక్తదానం చేయాలని ముందుకు రావడం శుభపరిణామం. మహిళలకు ప్రతినెలా సహజ సిద్ధంగానే కొంత రక్తం పోతుంది. రక్తదానం చేయడం ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందన్న భావన ఉంటుంది. అందులోని నిజాలను తెలుసుకుని రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రతి శిబిరంలోనూ రక్తం ఇస్తున్న వారిలో దాదాపు 40 శాతం మహిళలే ఉంటున్నారని సేవాసంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

సేకరణ ఇలా : జిల్లాలో ఏటా 60వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. వ్యాధిగ్రస్థులు, బాధితుల బంధువుల ద్వారా కేవలం 20శాతం రక్తమే అందుబాటులో ఉంటుంది. మిగిలినది రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి కేంద్రాలు, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల నుంచి తీసుకోవాల్సిందే. పేదలు ఎక్కువగా రెడ్‌క్రాస్‌ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించే రక్తనిధి కేంద్రాలకే వస్తారు. ఈ క్రమంలోనే సొసైటీ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. కళాశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు, రోటరీక్లబ్‌ వంటి సేవా సంస్థల సహకారంతో శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరిస్తున్నారు. నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కళాశాలలో ఇటీవల 40 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వినుకొండలోనూ 50 యూనిట్లు సేకరించారు.

రక్తం దానం చేయడం ద్వారా ప్రాణ దాతలు కావచ్చన్న రెడ్‌క్రాస్‌ సొసైటీ, రోటరీక్లబ్‌ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రచారం కారణంగా యువత చైతన్యవంతమవుతోంది. జిల్లాలోని రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సేవా సంస్థలు ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాలకు విద్యార్థులు సహకరిస్తూ రక్తం దానం చేస్తున్నారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు నిలపటంతో పాటు కొత్త రక్తకణాల ఉత్పత్తి జరిగి శారీరక ఆరోగ్యాన్ని దక్కించుకోవచ్చని చెబుతున్నారు.

రక్తదానంతో నష్టం లేదు

రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడవచ్ఛు రక్తం కొరత ఉందని రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏర్పాటు చేసిన శిబిరంలో రక్తదానం చేశా. ఇది రెండోసారి. కొంతమందిలో ఒకరోజు నీరసంగా ఉంటుంది. దానం చేస్తే కొత్త రక్తకణాలు ఏర్పడతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది. - కొడేల జ్యోతిశ్రీ, జేఎన్‌టీయూ నరసరావుపేట తృతీయ బీటెక్‌

ప్రాణాంతక వ్యాధిగ్రస్థులకు అత్యవసరం

జిల్లాలో తలసీమియా, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులు ఔషదాలు, రక్తం అందిస్తేనే జీవించే పరిస్థితి ఉంది. తలసీమియా చిన్నారుల్లో ఎక్కువగా ఉంటుంది. వీరికి నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఇలా 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లు జిల్లాలో 1200 మంది ఉన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి తీవ్రతను బట్టి డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో విషతుల్యమైన రక్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇందుకు రక్తం అవసరం. ఇలా డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు పల్నాడు ప్రాంతంలోనే 1659 మంది ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కలిపి చూస్తే సుమారు 4వేల మంది ఉంటారన్న అంచనా ఉంది.

రెండోసారి రక్తం ఇచ్ఛా.

పాఠశాలలో చదువుతున్న సమయంలో మా బాబాయి రక్తదానం చేశాడు. పోతాయనుకున్న ప్రాణాలు నిలిచాయి. రక్తం ఇస్తే పోయేది ఏమి లేదు అని చెబుతుండేవాడు. రవాణా రంగంలో పని చేసే నాన్నకు కూడా రక్తదానం విలువ తెలుసు. కళాశాలలో రక్తదాన శిబిరం ద్వారా అవకాశం వచ్చింది. తొలిసారిగా రక్తదానం చేశా. సంతోషంగా ఉంది. - అమరాపు రమ్య, జేఎన్‌టీయూ నరసరావుపేట, ఈఈఈ తృతీయ సంవత్సరం

బాబాయి నుంచి స్ఫూర్తి పొందా

రెండోసారి రక్తదానం చేశా. రక్తదానం చేయడమే ఆరోగ్యకరం. అథ్లెట్‌గా నిత్యం సాధన చేస్తుంటా. దీంతో శారీరకంగా కూడా ఫిట్‌గా ఉంటా. రక్తం మరొకరికి ఉపయోగపడుతుంది. రోడ్డు ప్రమాదానికి గురైన వాళ్లు, ఆపరేషన్లు, గర్భిణులు, ఇలా చాలా మందికి అవసరమే. పైగా రక్తం ఇచ్చే వాళ్లు ఉన్నా రోగి గ్రూపుతో సరిపోవాలి. రక్తదానం ఎక్కువ మంది చేస్తే మేలు. - దివ్య, జేఎన్‌టీయూ నరసరావుపేట ఈసీఈ చివరి సంవత్సరం

జిల్లాలో పరిస్థితి

ఏటా అవసరమవుతున్న రక్తం యూనిట్లు: 60వేలు

రోజుకు కావాల్సిన రక్తం యూనిట్లు సుమారు: 165

బాధితుల బంధువుల ద్వారా లభ్యమయ్యేది రక్తం: 20 శాతం

తలసేమియా బాధితులు: 1200 మంది

డయాలసిస్‌ చేయించుకుంటున్న వ్యాధిగ్రస్థులు: సుమారు 4వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని