logo
Published : 25 Jun 2022 05:35 IST

వెద పద్ధతికే మొగ్గు

ఏటికేడు పెరుగుతున్న సాగు విస్తీర్ణం

హెక్టారుకు రూ.18625 ఆదా

సాగు ఖర్చులు పెరిగిన మేరకు ధాన్యం ధరలు పెరగకపోవడంతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని అన్నదాతల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సాగు వ్యయం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పని దినాలు తగ్గడంతో పాటు కూలీలు అవసరం లేని వెదపద్ధతి విధానంలో సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. జూన్‌ నెలాఖరు అయినా గాని నారుమళ్లు వేయడానికి వెనకాడుతున్నారు. వర్షాలు కురిసిన వెంటనే భూములు సిద్ధం చేసుకుని వెదపద్ధతిలో వరి విత్తనాలు విత్తడానికి సిద్ధమవుతున్నారు. ఈ విధానంలో ప్రస్తుత సీజన్‌లోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్ష హెక్టార్లకుపైగా సాగులోకి వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా.

ఈనాడు, నరసరావుపేట, బాపట్ల

వరి నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే వెద విధానంలో కూలీల ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. పంట కాలం కూడా పది రోజులు తగ్గడంతో తుపాన్ల బారినపడకుండా పంటను రక్షించుకుంటున్నారు. ఆరుతడి విధానంలో సాగునీరు అందించడం వల్ల నీటిపొదుపు కూడా సాధ్యమవుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దేశంలోనే అధిక విస్తీర్ణంలో ఈ విధానంలో వరి

సాగవుతోంది. ఏటికేడు సాగు విస్తరిస్తుండటంతో పొరుగు రాష్ట్రాల వారు కూడా ఇక్కడి విధానంపై ఆసక్తి చూపుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఈ విధానం విజయవంతం కావడంతో సాగర్‌ కాలువల కింద కూడా రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విషయమై గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు ‘ఈనాడు’తో మాట్లాడుతూ రైతుల ఆమోదం పొందిన విధానం కావడంతో అందరూ ఇటువైపు వస్తున్నారన్నారు. డెల్టా, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ వెద విధానంసాగుపై దృష్టిసారించడంతో ఈవిధానం సాగు విస్తరిస్తోంది.

ఖర్చు తక్కువ.. పని సులభం

25 రోజులపాటు నారుమడి పెంచి నాటు వేయడం కంటే వెదపద్ధతిలో సాగుచేయడం సులభం. ఈ విధానంలో ఆరుతడులు సరిపోతాయి. దిగుబడులు బాగుంటున్నాయి. ఖర్చు తగ్గడంతో కూలీలతో సమస్య ఉండదు. దీంతో ఎక్కువ మంది రైతులు వెదసాగుకే వెళుతున్నాం. సొంత పొలంతో పాటు కౌలు పొలంతో కలిపి 30 ఎకరాల్లో వెదపద్ధతిలో సాగు చేయడానికి భూమి సిద్ధం చేశాను. జులై తొలివారంలో మంచి వర్షం వస్తే విత్తనాలు విత్తడం ప్రారంభిస్తాం. - యెండ్లూరి శ్రీనివాసరావు, రైతు, మూల్పూరు

నాటువేసే సంప్రదాయ విధానంతో పోల్చితే వెద పద్ధతిలో హెక్టారుకు రూ.18625 పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

వెదపద్ధతిలో సాగుచేయడం వల్ల హెక్టారుకు 113 పనిదినాలు తగ్గించవచ్చు

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని