logo

వివాహేతర బంధం... మిగిల్చిన విషాదం...

ఇద్దరికీ వేర్వేరు పెళ్లిళ్లు అయ్యాయి. భర్తతో విడిపోయిన ఆమె అతనికి పరిచయమయ్యింది.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.. నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. శుక్రవారం జరిగిన గొడవతో మనస్తాపం చెందారు.. ఇద్దరూ ఉరి వేసుకుని

Published : 25 Jun 2022 05:35 IST

ఇద్దరి బలవన్మరణం...

మేడికొండూరు, న్యూస్‌టుడే: ఇద్దరికీ వేర్వేరు పెళ్లిళ్లు అయ్యాయి. భర్తతో విడిపోయిన ఆమె అతనికి పరిచయమయ్యింది.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.. నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. శుక్రవారం జరిగిన గొడవతో మనస్తాపం చెందారు.. ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చిన్నారులు తల్లి లేని వారవడం స్థానికులను కలచి వేసింది.. ఈ ఘటన మేడికొండూరు మండలం పేరేచర్లలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... నరసరావుపేట పట్టణం చంద్రబాబుకాలనీకి చెందిన మహిళ(25)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మనస్పర్థలు రావడంతో ఆమె భర్తకు దూరంగా ఉంటూ పేరేచర్లలోని బోస్‌బజారులో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మేడికొండూరుకు చెందిన షేక్‌ అస్సాన్‌వలి (40)తో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. అస్సాన్‌వలి పెళ్లిళ్లకు మండపాలు కట్టే వ్యాపారం చేస్తుంటాడు. శుక్రవారం మహిళ ఇంటికి అస్సాన్‌వలి వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అస్సాన్‌వలి తాడుతో ఉరి వేసుకుని మృతి చెందాడు. పక్కన మహిళ మృతి చెంది పడి ఉంది. వారు మృతి చెందడానికి ముందు ఇంటి తలుపు లోపల గడియ పెట్టడంతో ఇద్దరు చిన్న పిల్లలు లోపల ఉండిపోయారు. పిల్లలు ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ కనిపించారు. తల్లి మృతదేహంపై ఆమె చిన్న కుమారుడు బోర్లా పడుకుని తల్లిని పిలుస్తుండడం చూపరులను కంటతడి పెట్టించింది. మృతుల బంధువులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగా తలుపులు తీసి లోనికి వెళ్లారు. పంచనామా నిమిత్తం మృతదేహాలను గుంటూరుకు చెందిన అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌కు చెందిన వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అస్సాన్‌వలి, మహిళ ఉరి వేసుకుని మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని