logo

ఎల్‌ఎఫ్‌ఎల్‌ ఉపాధ్యాయులకు పదోన్నతి కలే..!

పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో 117 ఉపాధ్యాయుల్లో గుబులు రేకెత్తిస్తోంది. అసలు స్కూళ్లు, ఉపాధ్యాయుల పోస్టుల్లో ఎన్నింటికి కోత పడుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద ఎల్‌ఎఫ్‌ఎల్‌ ఖాళీ పోస్టులకు కన్వర్షన్‌ పెడుతూ దస్త్రం పంపటంతో సంబంధిత ఉపాధ్యాయులు భవిష్యత్‌లో తమకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. 1998కు ముందు టీటీసీ, డీఎడ్‌ అర్హతలతో సెకండరీగ్రేడ్‌

Published : 30 Jun 2022 05:17 IST

వంద పోస్టుల కన్వర్షన్‌
డీఎడ్‌ అర్హతలతో ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న టీచర్లలో ఆందోళన
ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు
ఈనాడు-అమరావతి

పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో 117 ఉపాధ్యాయుల్లో గుబులు రేకెత్తిస్తోంది. అసలు స్కూళ్లు, ఉపాధ్యాయుల పోస్టుల్లో ఎన్నింటికి కోత పడుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద ఎల్‌ఎఫ్‌ఎల్‌ ఖాళీ పోస్టులకు కన్వర్షన్‌ పెడుతూ దస్త్రం పంపటంతో సంబంధిత ఉపాధ్యాయులు భవిష్యత్‌లో తమకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. 1998కు ముందు టీటీసీ, డీఎడ్‌ అర్హతలతో సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులుగా నియమితులైన వారు పదోన్నతిపై ప్రైమరీ పాఠశాలలకు హెచ్‌ఎంలుగా నియమితులయ్యేవారు.  ఉద్యోగంలో చేరిన తర్వాత కొందరు అర్హతలు పెంచుకుని మరికొందరు సీనియారిటీపై స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేవారు. ఇలా ఏ అర్హతలు లేని వారు భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీల్లో పదోన్నతులపై హెచ్‌ఎంలుగా నియమితులవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో క్లియర్‌ వెకెన్సీలుగా ఉన్న  100 పోస్టులను కన్వర్షన్‌ చేయాలని ప్రభుత్వపరమైన జీవో లేకపోయినా జిల్లాలోని విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా కన్వర్షన్‌కు పెట్టి ప్రభుత్వానికి ప్రతిపాదించటాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. జిల్లాలో వీరందరూ కలిపి 139 మంది ఉన్నారు. వారిలో 39 మంది ఇప్పటికే అర్హతలు పెంచుకుని స్కూల్‌ అసిస్టెంట్లుగా వెళ్లిపోయారు. ప్రస్తుతం 100 మంది పనిచేస్తున్నారు. ఈ వంద మందితో పాటు ఇప్పటికే క్లియర్‌ వెకెన్సీలు మరో 100 ఉన్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో కనుమరుగవుతాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

డీఈఓ పూల్‌ కోటాలో 19 మంది
గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో 19 మంది హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో వీరు పనిచేస్తున్న స్కూళ్లల్లో వర్క్‌లోడ్‌ లేదని పనిభారం బాగా ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసి వారి సేవలను వినియోగించుకున్నారు. వారికి నెలవారీ జీతాలు మాత్రం వారు గతంలో ఎక్కడైతే పనిచేశారో ఆ స్కూల్‌ నుంచే చెల్లింపులు చేస్తారు. ప్రస్తుతం వారందరిని గతంలో ఎక్కడి నుంచైతే వచ్చారో తిరిగి అక్కడకే పంపుతూ ఆదేశాలిచ్చారు. వారు ఆ పాఠశాలలో పనిలేకుండా ఉన్నారని గుర్తించి అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తే తిరిగి వారిని వెనక్కు పంపటాన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు వారి అవసరం ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పుబడుతున్నారు. గతేడాది ‘పది’ పబ్లిక్‌ పరీక్షల్లో చాలా స్కూళ్లల్లో హిందీ తప్పారు. దీనికి కారణం ఆ సబ్జెక్టు బోధించటానికి రెగ్యులర్‌ ఉపాద్యాయులు లేకపోవటమే కారణమని ఒక అంచనాకు వచ్చారు. అలాంటప్పుడు డీఈఓ పూల్‌కోటాలో ఉన్న 19 మంది హిందీ ఉపాధ్యాయులను తిరిగి వర్క్‌లోడ్‌ లేని పాఠశాలలకు పంపటంపై సంఘాల నాయకులు, ప్రధానోపాద్యాయులు విద్యాశాఖ తీరుపై మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని