logo

ప్రమాదవశాత్తు 12 పూరిపాకలు దగ్ధం

మండల పరిధిలోని తోకలవారిపాలెం గ్రామంలో ఇటుక రాయి తయారీకి వచ్చిన వలస కూలీలు నివాసం ఉంటున్న 12 పూరి పాకలు ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి.

Published : 27 Jan 2023 04:47 IST

పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడడమే కారణం

కొల్లూరు: అర్ధరాత్రి సమయంలో దగ్ధమవుతున్న పూరి పాకలు

కొల్లూరు, న్యూస్‌టుడే : మండల పరిధిలోని తోకలవారిపాలెం గ్రామంలో ఇటుక రాయి తయారీకి వచ్చిన వలస కూలీలు నివాసం ఉంటున్న 12 పూరి పాకలు ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. ఇటుకరాయి తయారు చేయటానికి దూరప్రాంతాల నుంచి 40 మంది కూలీలు వలసవచ్చి పూరి పాకలు వేసుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇటుకరాయి వ్యాపారి చిన్నకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పనులు చేస్తున్నారు. వీరి కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో కూలీలంతా నిద్రిస్తుండగా, పాకలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పొలాల్లో కావడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాప్తి చెందలేదు. కూలీలు కట్టుబట్టలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కట్టెల పొయ్యిలో నిప్పు ఆర్పకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కూలీలకు ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటుచేసి దుస్తులు, ఆహారం అందించాలని వ్యాపారిని ఆదేశించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రేకులషెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శామ్యూల్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

కొల్లూరు: ప్రమాదంలో గాయపడిన మహిళ

జంపనిలో ఒకటి..

వేమూరు: ప్రమాదవశాత్తు ఓ పూరిల్లు దగ్ధమైన సంఘటన జంపనిలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎం.అబ్రహాం కుటుంబ సభ్యులు పొలం పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగొచ్చారు. స్నానం కోసం నీళ్లను కట్టెల పొయ్యిపై ఉంచి, సమీపంలో కుమారుడి ఇంటికి వెళ్లారు. ఇంతలో మంటలు ఇంటికి అంటుకుని ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో సామగ్రి, దుస్తులు కాలిబూడిదయ్యాయి. ఈ ఇంటికి విద్యుత్తు సదుపాయం కూడా లేదు. ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పక్కనే వేరొకరి పశువుల కొట్టానికి మంటలు అంటుకుని పాక్షికంగా దెబ్బతింది. తెనాలి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.50వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు.


తిమ్మాయపాలెంలో పొగాకు బ్యారన్‌కు అగ్నిప్రమాదం

కాలిపోతున్న పొగాకు బ్యారన్‌ను నీళ్లతో ఆర్పుతున్న సిబ్బంది

తిమ్మాయపాలెం(అద్దంకి), న్యూస్‌టుడే: మండలంలోని తిమ్మాయపాలెంలో పొగాకు బ్యారన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటనలో సుమారు రూ.మూడు లక్షల మేర నష్టం సంభవించినట్లు రైతు ఉప్పుటూరి రామాంజనేయులు తెలిపారు. గురువారం ఉదయం బ్యారన్‌లోని టైరు కర్ర పైనుంచి ఊడి కింద గొట్టాలపై పడటంతో అగ్నిప్రమాదం జరిగింది. ఎనిమిది క్వింటాళ్ల పొగాకుతో పాటు టైర్లు, కర్రలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు ఎంత ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపు కాలేదు. అద్దంకి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగినట్లు బాధిత రైతు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని