logo

ఉల్లంఘనులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కంకర, గ్రానైట్‌, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, అనుమతి లేకుండా రవాణా, హద్దులు దాటి తవ్వకాలపై భూగర్భ గనులశాఖ నిఘా విభాగం పెద్దఎత్తున జరిమానాలు విధించింది.

Updated : 28 Mar 2023 06:34 IST

ఏడాదిలో అక్రమార్కులకు రూ.146 కోట్ల జరిమానా
కంకర, గ్రానైట్‌, మట్టి అక్రమ రవాణాపై కొరడా
ఈనాడు, అమరావతి

అధిక బరువు ఉండడంతో చేబ్రోలు పోలీసులు సీజ్‌ చేసిన మట్టి టిప్పర్లు (పాతచిత్రం)

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కంకర, గ్రానైట్‌, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, అనుమతి లేకుండా రవాణా, హద్దులు దాటి తవ్వకాలపై భూగర్భ గనులశాఖ నిఘా విభాగం పెద్దఎత్తున జరిమానాలు విధించింది. ఏడాది కాలంలో 839 కేసులు నమోదు చేసి రూ.146.34 కోట్ల మేర జరిమానా విధించారు. అధికార పార్టీ నేతలకు సహజ వనరులు కాసుల వర్షం కురిపించాయి. వీటిని కల్ప వృక్షంగా మార్చుకున్న నేతలు అక్రమార్జనే ధ్యేయంగా దందా చేశారు. జిల్లాలో మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేసి పెద్దఎత్తున సొమ్ము చేసుకున్నారు. నిఘా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదు చేసినా అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రానైట్‌కు రూ.కోట్ల పన్నులు చెల్లించకుండా రోజువారీగా జిల్లా సరిహద్దు దాటిపోతున్నాయి. ఇందులో ఆయా పరిధిలో ప్రజాప్రతినిధులు సహకారం అందించడంతో అడ్డే లేకుండా అక్రమ రవాణా కొనసాగుతోంది. నిఘా విభాగం అధికారులు దాడులు చేసినప్పుడు రెండు నుంచి మూడు రోజులు తాత్కాలికంగా రవాణా ఆపి మళ్లీ యథేచ్ఛగా చేస్తున్నారు.

* పల్నాడు జిల్లాలో కీలకమైన ఎమ్మెల్యే ఒకరు గ్రానైట్‌ అక్రమ రవాణాలో సహకారం అందించి రోజువారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పల్నాడు, బాపట్ల జిల్లాలు కొత్తగా ఏర్పడడంతో ఆయా పట్టణాల చుట్టూ స్థిరాస్తి వ్యాపారం పుంజుకుని వెంచర్లు వచ్చాయి. వీటిని చదును చేయడం, వెంచర్ల అభివృద్ధికి మట్టి పెద్దఎత్తున అవసరమైంది. నరసరావుపేట, నకరికల్లు, గురజాల, చేబ్రోలు, గుంటూరు గ్రామీణ, రొంపిచర్ల, నగరం, తాడికొండ, ఫిరంగిపురం తదితర మండలాల నుంచి గ్రావెల్‌ సరఫరా చేసి నేతలు జేబులో వేసుకుంటున్నారు. ఒంగోలు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి ఆయా మార్గాల్లో కంకర, గ్రావెల్‌, గ్రానైట్‌ తరలిస్తున్న వాహనాలను ఆకస్మిక తనిఖీల్లో భూగర్భ గనుల శాఖ నిఘా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 701 వాహనాలు పట్టుకుని రూ.3.26 కోట్లు జరిమానా వసూలు చేశారు. కంకర క్వారీల్లో అనుమతికి మించి తవ్వకాలు చేయడంతో రూ.102 కోట్ల జరిమానా విధించారు. మెటల్‌ క్రషర్లు, గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లలో 61 కేసులు నమోదు చేసి రూ.8.64 కోట్ల జరిమానా వేశారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేసిన వారిపై 32 కేసులు నమోదు చేసి రూ.22.47 కోట్లు జరిమానా విధించారు. ఇలా అనుమతి లేకుండా, పరిమితికి మించి, నిబంధనల ఉల్లంఘన, అక్రమ రవాణా తదితర అంశాలపై మొత్తం రూ.146.34 కోట్లు భూగర్భ గనుల శాఖ విభాగం జరిమానా విధించింది.

అనుమతులు కొంత... అక్రమాలు కొండంత

ఉమ్మడి గుంటూరు జిల్లా విభజనతో కొన్ని ఖనిజాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోయి అడ్డగోలుగా తవ్వకాలు చేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. మట్టి తవ్వకాలకు తాత్కాలిక పర్మిట్లు తీసుకుని కొండలను పిండిచేశారు. కోటప్పకొండలో అనుమతులకు మించి అవసరాలే ప్రాతిపదికగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేయడంతో కొండలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. తాత్కాలికంగా వందల ట్రక్కులకు అనుమతులు తీసుకుని వేల ట్రక్కుల మట్టి మాయం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నేతల అందడండలు అందించడంతో స్థానిక యంత్రాంగం కూడా అడ్డుకునే పరిస్థితి లేకపోయింది. డిమాండ్‌ను అనుసరించి రాత్రిపగలు తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించారు. ఈ క్రమంలో నిఘా విభాగం అధికారులు ఆకస్మిక దాడులు చేసి వాహనాలు స్వాధీనం చేసుకుని జరిమానా వసూలు చేశారు. నేతల నుంచి ఒత్తిడి ఉన్నా నిఘా విభాగం ముందడుగు వేయడంతో జరిమానాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. నిఘా విభాగం అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా మట్టి కాసుల వర్షం కురిపిస్తుండడంతో అక్రమార్కులు వృత్తిగా మార్చుకుని కొనసాగించారు. నకరికల్లు మండలం త్రిపురాపురంలో అయితే కొండ చుట్టూ తవ్వకాలు చేశారు. నాగార్జునసాగర్‌ కాలువ కట్టను సైతం అక్రమార్కులు వదిలిపెట్టకుండా తవ్వి తరలించారు. దాచేపల్లి భూగర్భ గనులశాఖ పరిధిలో ప్రభుత్వ భూముల్లో మట్టి కనిపిస్తే చాలు తవ్వేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. గురజాల మండలంలో దైద గ్రామంలో అక్రమ తవ్వకాలకు భారీ చెరువుల్లా గోతులు నిదర్శనంగా నిలిచాయి. నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల, గురజాలలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగినా అక్కడి యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించింది. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, గుంటూరు గ్రామీణ మండలంలో మట్టి అక్రమతవ్వకాలు జరిగాయి. బాపట్ల జిల్లాలో నగరం, పీవీపాలెం మండలాల్లో మురుగుకాల్వ కట్టలను సైతం వదలకుండా తవ్వేశారు. బాపట్ల జిల్లాలో బుసక పేరుతో పెద్దఎత్తున తవ్వకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని