logo

మొక్కల నిధులూ మెక్కారు!

మాచవరం మండలంలోని పిల్లుట్ల కేజీబీవీలో 100 మొక్కలు నాటితే 10 మొక్కలే బతికి ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. ఇదే మండలంలోని మోర్జంపాడు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులో 800 మొక్కల్ని నాటితే 150 మొక్కలే ఉన్నాయి.

Published : 01 Apr 2023 05:38 IST

నాటిన వాటిల్లో సగం కూడా బతకలేదు
రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
న్యూస్‌టుడే, సత్తెనపల్లి, పిడుగురాళ్ల 
 

ముప్పాళ్ల నుంచి తురకపాలెం వెళ్లే రోడ్డులో నాటిన మొక్క ఇలా..

మాచవరం మండలంలోని పిల్లుట్ల కేజీబీవీలో 100 మొక్కలు నాటితే 10 మొక్కలే బతికి ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. ఇదే మండలంలోని మోర్జంపాడు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డులో 800 మొక్కల్ని నాటితే 150 మొక్కలే ఉన్నాయి.

క్రోసూరు నుంచి అమరావతికి వెళ్లే మార్గంలో విప్పర్ల వద్ద రోడ్డు పక్కనే 310 మొక్కలు నాటారు. దీనికి రూ.52 వేలు ఖర్చయింది. వీటిలో సగం మొక్కలు లేవు. ఇదే మండలంలో 9,890 మొక్కలు నాటగా దీనికి రూ.8 లక్షలు ఖర్చు చేశారు. వీటిలో 30 శాతం మొక్కలే బతికి ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి.

ముప్పాళ్ల నుంచి తురకపాలెం వెళ్లే రోడ్డులో 200 మొక్కలు నాటితే 50 కూడా బతికి లేవు. ఇక్కడ రూ.26 వేల వరకు నిధులు ఖర్చు చేశారు. ఇదే మండలంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు పంచాయతీకి రూ.25 వేలు నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారు. చాలాచోట్ల 30 నుంచి 40 శాతం మొక్కలే బతికాయి.

గ్రామాల సుస్థిర అభివృద్ధిలో భాగంగా మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న మొక్కల పెంపకం దారి తప్పుతోంది. పర్యవేక్షణ.. సమన్వయ లోపంతో నాటిన కొన్ని రోజులకే మొక్కలు ఎండిపోయి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నాటినప్పుడు ఉన్న హడావిడి సంరక్షణపై చాలాచోట్ల ఉండట్లేదని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి.

వరుసగా రెండేళ్ల నిధులు నేలపాలు..

2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పెద్దఎత్తున ఉపాధి నిధులతో మొక్కల పెంపకం చేపట్టారు. జగనన్న తోరణంలో భాగంగా 709 పనుల రూపంలో 777 కిలోమీటర్ల మేరకు 3,10,939 మొక్కలు నాటారు. దీనికి రూ.2.93 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో సగానికి పైబడి మొక్కలు బతకలేదు. జిల్లాలోని 28 మండలాలకు సగం మండలాల్లో పర్యావరణ పరిరక్షణ సరిగ్గా జరగలేదు. సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 63 పనుల రూపంలో మరో 16,846 మొక్కలు నాటారు. వీటిలో 11,700 మొక్కలు బతికి ఉన్నట్లు డ్వామా వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. క్షేత్రస్థాయికి వెళ్తే ఇంతకంటే తక్కువగా మొక్కలు బతికి ఉన్నాయి. వీటికి చేసిన నిధుల ఖర్చులో సగానికి పైగా దుర్వినియోగమయ్యాయి. ఉద్యాన పంటల ప్రోత్సాహంలో భాగంగా రైతులకు అందజేసిన మొక్కలు సరైన యాజమాన్యంలేక పాడైపోయి రూ.లక్షల నష్టం వాటిల్లింది. ఒక్కో రైతుకు మూడేళ్లపాటు జామ, మామిడి, సపోటా తదితర మొక్కల నిర్వహణకు రూ.2 లక్షల వరకు నిధులిస్తారు. వీటిలో సగం మంది రైతులకు అందజేసిన సాయం నేలపాలైంది. మొక్కల పేరుతో మెక్కేయడంతోపాటు నిర్వహణ సరిగాలేక పాడైపోయిన మొక్కలకు పెట్టిన ఖర్చంతా కలిపితే రూ.కోటికి పైగా నిధులు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృంద బాధ్యులు చెబుతున్నారు.

నిధులున్నా నిర్లక్ష్యమే..

2022-23 ఆర్థిక సంవత్సరంలో మొక్కల పెంపకానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అంతకు ముందు ఏడాది నాటిన మొక్కల్ని పెంచితే అవి పెద్దవై వాతావరణంలో ఎంతో మార్పులు వచ్చేవి. మొక్కల సంరక్షణపరంగా నిధులున్నా నిర్లక్ష్యం చూపించడమే సమస్యగా మారింది. పంచాయతీలకు మొక్కల సంరక్షణ బాధ్యత అప్పగించారు. 200 మొక్కలుంటే వాటికి ట్యాంకర్ల ద్వారా నీరందిస్తే రూ.2 వేలు నుంచి రూ.2500 వరకు నగదు ఇచ్చారు. అయితే ఎప్పటికప్పుడు నిధులు రాకపోవడంతో రెండు, మూడు నెలలు నీరందించి పంచాయతీలు దాన్ని మరచిపోయాయి. పంచాయతీలు మొక్కల బాధ్యత చూస్తున్నాయని డ్వామా సిబ్బంది వాటిని పట్టించుకోకపోవడంతో అసలుకే మోసం జరిగింది.

మాచవరం కేజీబీవీలో   ఎండిన మొక్క


50 శాతం కంటే తక్కువ ఉంటే నాటిస్తున్నాం

2021-22లో ఆర్థిక సంవత్సరంలో నాటిన మొక్కల్లో 50శాతం కంటే తక్కువగా బతికి ఉంటే మిగిలిన మొక్కల్ని క్రమశిక్షణ చర్యల కింద బాధ్యులతో ప్రస్తుతం నాటిస్తున్నాం. 15 రోజుల్లోపు మొక్కల్ని వారు నాటి సంరక్షణ చర్యలు చేపడతారు. 60 నుంచి 80 శాతం మొక్కలు కనిపించకుండా ఉంటే బాధ్యుల నుంచి నగదు రికవరీ చేస్తున్నాం. మొక్కల పెంపకంలో పంచాయతీలు, డ్వామా క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించాం.

జోసఫ్‌కుమార్‌, పీడీ, డ్వామా, పల్నాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని