logo

రూ. 3కోట్ల భూమి పక్కదారి

ప్రజాప్రయోజనాల నిమిత్తం దాతలు సమకూర్చిన భూమి పరాయి వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్లింది. ట్రస్టీల పరిధిలో ఉండాల్సిన భూమి నేటికీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనే కొనసాగుతుంది.

Published : 07 Jun 2023 04:32 IST

ముగ్గురు వ్యక్తులు చేతుల్లో దాతలిచ్చిన 15.79 ఎకరాలు
ట్రైబ్యునల్‌లో ఫిర్యాదుకు సిద్ధపడుతున్న దేవాదాయ శాఖ అధికారులు
రామాయపాలెం(అద్దంకి), న్యూస్‌టుడే

రామాయపాలెంలో గ్రామస్థుల సాగులో ఉన్న పొలం

ప్రజాప్రయోజనాల నిమిత్తం దాతలు సమకూర్చిన భూమి పరాయి వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్లింది. ట్రస్టీల పరిధిలో ఉండాల్సిన భూమి నేటికీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనే కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాలుగా అటు దేవాదాయ శాఖకు, ఇటు ట్రస్టీలకు ఎలాంటి కౌలు చెల్లించకుండానే సొంత భూములు మాదిరిగా ఆక్రమించుకుని పంటలు పండించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులను నమ్మబలుక్కుని దస్త్రాల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. మొత్తం 15.70 ఎకరాల భూమి పరాయి పంచన చేరింది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.20 లక్షల చొప్పున మొత్తం సుమారు రూ.3 కోట్ల విలువైన భూమి పక్కదారి పట్టినట్లు దేవాదాయశాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

బాపట్ల జిల్లా అద్దంకి మండలం రామాయపాలెం గ్రామంలో 22.75 ఎకరాల చెరువు ఉంది. దీన్ని గ్రామానికి చెందిన ‘పుల్లెల’ వంశస్తులు గ్రామస్థులకు చెరువు రూపంలో తవ్వి, చుట్టూ కట్టలు పోసి ఉంచారు. అన్ని వేళల్లో పశువులు, మేకలు, గొర్రెలు మంచినీరు తాగేందుకు ఉపయోగపడేలా చేశారు. ఈ చెరువులోని మట్టి పూడికతీసే పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా స్థానికులు అడ్డుకున్నారు. పట్టువదలని విక్రమార్కుడిగా మట్టి తవ్వకందారు గతనెల 29న తిరిగి తవ్వకాలు పునఃప్రారంభించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కదిలిన దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తవ్వకందారు మట్టి తరలింపు ఆపలేదు. చెరువులో పూడికమట్టి తరలించే క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు దస్త్రాలు పరిశీలించారు. చెరువు నిర్వహణ నిమిత్తం పక్కనే గల 15.70 ఎకరాల భూమిని కేటాయించినట్లుంది. నాలుగు దశాబ్దాల క్రితం వరకు ఈ చెరువు, మాన్యం భూములన్నీ పుల్లెల వంశస్తుల ట్రస్టీల ఆధ్వర్యంలో ఉన్నాయి. తదనంతరం ముగ్గురు వ్యక్తులు వాటిని స్వాధీనం చేసుకుని పంటలు పండిస్తున్నారు. చెరువు మాన్యం భూములకు దేవాదాయ శాఖకు ఎలాంటి రుసుం చెల్లించడం లేదు. ఎకరా భూమి విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఆమేరకు అటు చెరువులో మట్టి తవ్వకాల గురించి, ఇటు అన్యాక్రాంతమైన భూముల గురించి గ్రామస్థులు స్పందనలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.


ఒక్క రూపాయి జమకాలేదు

రామాయపాలెం గ్రామానికి చెందిన పుల్లెల వారి చెరువు, దాని నిర్వహణ కోసం కేటాయించిన భూమి పూర్తిగా ట్రస్టీల ఆధీనంలో ఉంది. ట్రస్టీలు ఎవరూ అందుబాటులో లేని కారణంగా గ్రామస్థుల ఆధీనంలో ఉంది. ట్రస్టీల అనంతరం ఆ భూమి దేవాదాయ శాఖకు చెందాలి. రెవెన్యూ పరంగా పొందిన పట్టాదారు పాస్‌పుస్తకాలను రద్దు చేసి, దేవాదాయ శాఖకు అప్పగించాలంటూ రెవెన్యూ అధికారులకు లేఖలు రాశాం. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేస్తాం.

ఎస్‌.కోటిరెడ్డి, ఈవో, దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి, అద్దంకి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని