logo

Ysrcp: మీకో దండం.. మీతో రాలేం.. వైకాపా నేతలకు చెబుతున్న వాలంటీర్లు

‘‘మీకో దండం.. మమ్మల్ని వదిలేయండి.. ప్రశాంతంగా బతకనివ్వండి.. మాకు ఉద్యోగాలిచ్చింది ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడానికి మాత్రమే.

Updated : 30 Mar 2024 08:38 IST

ప్రచారాలకు రామంటూ తిరస్కరణలు

నరసరావుపేటలో వాలంటీర్ల గ్రూపులో ఓ వైకాపా నేత సందేశం

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: ‘‘మీకో దండం.. మమ్మల్ని వదిలేయండి.. ప్రశాంతంగా బతకనివ్వండి.. మాకు ఉద్యోగాలిచ్చింది ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడానికి మాత్రమే. మీ పార్టీ ప్రచారానికి కాదు.. మేం ప్రచారానికి రాం’’ అంటూ వాలంటీర్లు వైకాపా నాయకులకు నిర్మోహటంగా చెప్పి పంపేస్తున్న ఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. నాయకుల స్వార్థం కోసం తామెందుకు బలికావాలి? అంటూ తటస్థంగా ఉంటూ కొందరు ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు.

బలికావొద్దంటున్న తల్లిదండ్రులు..

కష్టపడి బీటెక్‌, డిగ్రీలు చదివిస్తే వాలంటీరుగా చేరారు.. నెలంతా గొడ్డు చాకిరీ చేస్తే రూ.5 వేలు ఇస్తున్నారు. మూడు నెలలుగా వైకాపా అభ్యర్థుల ప్రచారంలో వాడుకుంటున్నారు. కోడ్‌ వచ్చినా వెంట తిరగాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రచారానికి వెళ్తే కేసులు నమోదవుతాయన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కేసులు నమోదైతే వీళ్ల జీవితమే నాశనమైపోతుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కూడా రావు. ఏమైనా సరే.. ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టొద్దని వాలంటీర్ల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే కొలువు వదిలేయండని, అంతేకాని వైకాపా ప్రచార పిచ్చికి బలికావొద్దని వాలంటీర్లుగా చేరిన పలువురి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రధానంగా మహిళా వాలంటీర్లను బయటకు పంపేదుకు చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు.

కారంపూడి, అమరావతి, బెల్లంకొండ, గురజాల, దాచేపల్లి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది వాలంటీర్లను తొలగించారు. దీంతో మిగతా వాలంటీర్లలో భయం పట్టుకుంది. కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదని, భవిష్యత్తు నాశనమైపోతుందని యువ వాలంటీర్లలో అంతర్మథనం మొదలైంది. దీంతో వైకాపా ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసి రావాలంటూ ఎమ్మెల్యేలు, వైకాపా నాయకుల పిలుపులకు స్పందన కరవైంది. నరసరావుపేట నియోజకవర్గంలో ఓ పదిమంది మినహా ఎవరూ రాజీనామాలు చేయలేదు. వాలంటీర్లను పావులుగా వాడుకుని మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం జగన్‌ మొదలు వైకాపా అభ్యర్థుల వరకూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నియోజకవర్గాల్లో ఏ సమావేశం జరిగినా విందు, వినోదాలు నిర్వహించినా కొన్ని నెలలుగా వాలంటీర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మనమంతా ఒకటే.. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే అది మీపైనే ఆధారపడి ఉంది. ఇంటింటికీ వెళ్లి జగనన్న రాకపోతే పింఛన్లు ఆగిపోయతాని ప్రచారం చేయండి. ప్రతిపక్ష అభ్యర్థులపైనా విష ప్రచారం చేయండని వాలంటీర్లకు సమావేశాలు పెట్టి మరీ వైకాపా అభ్యర్థులు కొన్నాళ్లుగా నూరిపోస్తున్నారు. దీని ప్రభావంతో వాలంటీర్లు కూడా ఇంటింటికీ వెళ్లి ఇదే చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కోడ్‌ అమలుతో వాలంటీర్ల మెడపై కత్తి వేలాడుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న, వైకాపా అభ్యర్థులతో కలిసి తిరిగే వారిపై వేటు పడడంతో మిగతా వాలంటీర్లు వెనకడుగు వేస్తున్నారు.

రాజీనామా చేయకపోతే సస్పెండ్‌ చేస్తారంటూ తప్పుడు ప్రచారం..

నరసరావుపేటకు చెందిన ఓ వైకాపా నాయకుడు ఐదో వార్డు వాలంటీర్ల గ్రూపులో తప్పుడు ప్రచారాలు పోస్టు చేస్తున్నాడు. ‘ఐదో వార్డు సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లకు విజ్ఞప్తి. మనకు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లందరూ ఈరోజు నుంచి తమ రాజీనామా లేఖలను సచివాలయంలో అడ్మిన్‌కు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే కలెక్టర్‌ ఏక్షణమైనా మిమ్మల్ని సస్పెండ్‌ చేయొచ్చు’ అంటూ మొదటిసారి పోస్టు చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో మరో గంటలోపే మరోసారి అదే సందేశాన్ని పోస్టు చేశాడు. రాజకీయ సంబంధిత ప్రచారాల్లో పాల్గొంటేనే సస్పెండ్‌ చేస్తారు అంతేకానీ సాధారణంగా తటస్థంగా ఉంటే సస్పెండ్‌ చేయరు. కానీ ఈ వైకాపా నేత కావాలని వాలంటీర్లను తప్పుదోవ పట్టించేయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా తమ పార్టీ ప్రచారాలకు వాడుకోవాలనే ప్రయత్నాల్లో భాగమే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు వాలంటీర్లు కొందరు అప్రమత్తమవుతున్నారు. వరుసగా వాలంటీర్ల సస్పెండ్‌ వార్తలు ప్రచురితమవుతుంటే తాము ఎందుకీ బురదలోకి దిగడం అని మిగతా వారు ఆలోచనలో పడ్డారు. వైకాపా కుయుక్తులకు బలికావడం ఎందుకని మిగతావారిలో జ్ఞానోదయం కలిగి ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని