logo

నలిగిపోతున్న నాలుగో సింహం

ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు.

Published : 19 Apr 2024 05:34 IST

వారాంతపు సెలవుల్లేక ఉక్కిరిబిక్కిరి
అందని భత్యాలు..పని ఒత్తిడి.. అరకొర వసతులు
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే

ఎండలో ట్రాఫిక్‌ విధులు

ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. ఇంత చేస్తున్నా.. వైకాపా ప్రభుత్వంలో అనేక రకాల భత్యాలు అందడం లేదని పోలీసు సిబ్బంది వాపోతున్నారు. పని ఒత్తిడి పెరగడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎడాపెడా బందోబస్తులతో అల్లాడిపోతున్నారు. సీఎం నివాసం, అసెంబ్లీ, సచివాలయం తదితర ప్రధాన విభాగాలు జిల్లాలో ఉండడంతో పోలీసులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. వారికి కనీస వసతులు లేకపోవడంతో రాజధాని ప్రాంతంలో బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసును పాముకాటు వేయడంతో మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయిదేళ్లలో పోలీసుల నియామకం ఊసేలేదు. దీంతో ఉన్న సిబ్బందే ఒక్కొక్కరోజు రెండు మూడు షిప్టుల్లో 12 నుంచి 18 గంటలు పనిచేయాల్సిన దుస్థితి నెలకొందంటూ ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలు ఆలకించే వారే లేరని ఖాకీలు మదన పడుతున్నారు.

పెరిగిన పనిభారం.. గత అయిదేళ్లుగా కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుళ్ల నియామకాలు లేవు. దీంతో స్టేషన్లలో సిబ్బంది కొరత నెలకొంది. ఉన్న సిబ్బంది పైనే పనిభారం పడుతోంది. ఉద్యోగోన్నతులకు అర్హత సాధించినా పట్టించుకునే వారే లేరు. సరండల్‌ లీవ్‌ బకాయిలు ఆగిపోయాయి.

పీఆర్సీ బకాయిలు రాలేదు :  పోలీసులకు ఆదివారం, పండగ రోజుల్లో పనిచేసినందుకు ఏటా రెండు దఫాలుగా సరండల్‌లీవులకు నగదు చెల్లించేవారు. వాటిని చెల్లించలేదు. పీఆర్సీ బకాయిలు ఇవ్వ లేదు. ఆ డబ్బులను పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు. బందోబస్తులు ఇతర ప్రాంతాల్లో విధులకు వెళ్లినప్పుడు ఇవ్వాల్సిన రవాణా భత్యం సుమారు ఏడాదిగా చెల్లించలేదు.


వారాంతపు సెలవుల ఊసేలేదు
-  ఓ ఏఎస్సై

పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని ప్రకటించారు. తొలుత ఒక వారం రోజులు తూతూ మంత్రంగా నడిపారు. ఆ తర్వాత ఆ ఊసేలేదు. వృద్ధులైన తల్లిదండ్రులను చూడడానికి, పిల్లలు, కుటుంబ సభ్యులతో గడపడానికి కనీసం ఒక్క రోజు సెలవు ఉంటే బాగుంటుంది. అయిదేళ్లుగా అమలు చేయడం లేదు. ఈ విషయం అధికారులను అడిగే పరిస్థితులు పోలీసుశాఖలో ఉండవు.


రోడ్లపైనే ఉద్యోగాలైపోయాయి
- కానిస్టేబుల్‌

ఉదయం ఉద్యోగానికి బయలుదేరినప్పటి నుంచి ర్యాలీలు, నిరసనలు, రాస్తారోకోలు, ఎస్కార్ట్‌, వీఐపీల బందోబస్తు ఇలా ఏదో ఒకటి రోజూ రోడ్లపైనే ఉద్యోగాలైపోతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలు చేయడంతో అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. అంత కష్టపడి పనిచేసినా పీఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని