logo

కలవకపోతే.. తిరస్కరణలే

జీహెచ్‌ఎంసీ అమలు చేస్తోన్న జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ విధానం వసూళ్లకు అడ్డాగా మారింది. అన్ని రకాల పత్రాలతో ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారు.

Published : 27 Mar 2024 01:46 IST

‘మీసేవ’లో దరఖాస్తు చేసినా పత్రాలతో రావాల్సిందే
జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీలో చేతివాటం
ఈనాడు, హైదరాబాద్‌

జీహెచ్‌ఎంసీ అమలు చేస్తోన్న జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ విధానం వసూళ్లకు అడ్డాగా మారింది. అన్ని రకాల పత్రాలతో ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారు. దరఖాస్తుదారుకు ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన పత్రాలను నేరుగా తీసుకురావాలని ఆదేశమిస్తున్నారు. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ చివరకు లంచం తీసుకుని ధ్రువీకరణపత్రాలను అందజేస్తున్నారు. దాంతో ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానానికి అర్థం లేకుండాపోయిందనే విమర్శలొస్తున్నాయి.

తీరు మార్చుకోని అధికారులు..

జిల్లాల్లో నివసించేవారు పేట్లబురుజు, కోఠి, గాంధీ, వేర్వేరు ప్రాంతాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో కాన్పులకు హైదరాబాద్‌ వస్తుంటారు. అదే సమయంలో చికిత్స కోసం నగరానికి వచ్చిన వ్యక్తులు, ప్రమాదాలకు గురై నగరంలో మరణిస్తుంటారు. ఆయా జనన, మరణాలను జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం ధ్రువీకరించేందుకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని తెచ్చింది. తద్వారా ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తయినా సరే అక్కడి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని అక్కడే సర్టిఫికేట్‌ తీసుకోవచ్చు.
కొందరు అధికారులు డబ్బు కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన పత్రాలు సరిగా లేవని, ఫిజికల్‌ కాపీలతో ఆఫీసుకొచ్చి కలవాలనే కారణాలను చెబుతున్నారు.

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాల ధ్రువీకరణలు సరిగా జరగట్లేదు. ఆయా కుటుంబాల అమాయకత్వం, తొందరపాటు, ఆస్పత్రి ఉద్యోగుల నిర్లక్ష్యమే అందుకు కారణం. ఆస్పత్రిలో చేర్చుకునే సందర్భంలో కుటుంబసభ్యులు పేరును సరిగా నమోదు చేయించుకోకపోవడం, అలాంటి సర్టిఫికెట్లను సవరించాలంటూ వచ్చే దరఖాస్తులకు కనీసం రూ.5వేలు ఇస్తేగానీ ఆమోదం పొందట్లేదు.

కాళ్లరిగేలా తిప్పుతూ..

రఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుండటం, తిరిగి అర్జీ పెట్టుకున్న ప్రతిసారీ అఫిడవిట్‌కు రూ.500 ఖర్చు, ఒక రోజు వృథా అవడంతోపాటు ఇతరత్రా ఇబ్బందులను సామాన్యులు భరించలేకపోతున్నారు. దీంతో అధికారితో రూ.2వేల నుంచి రూ.5వేల బేరం మాట్లాడుకుని ధ్రువపత్రాన్ని తీసుకెళ్లడం ఉత్తమమని భావిస్తున్నారు. పాస్‌పోర్టు, విదేశీయానం విషయంలో, ఎన్‌ఆర్‌ఐలకు ఇచ్చే ధ్రువపత్రాలకైతే రూ.10వేల నుంచి రూ.50వేల వరకు లంచం డిమాండ్‌ చేస్తున్నారు. ముడుపుల కోసం అధికారులు సృష్టిస్తోన్న సమస్యలను కట్టడి చేసి, ఆన్‌లైన్‌ సేవలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని