logo

వైరస్‌ వేగం.. పట్టణాలపై ప్రభావం

జిల్లాలో కరోనా వైరస్‌ మరింత వేగం పుంజుకుంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు సింగరేణి ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకున్న కరోనా నాలుగు రోజులుగా పెద్దపల్లి,

Published : 20 Jan 2022 02:27 IST

జిల్లాలో ఒక్క రోజే 579 కరోనా కేసులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే

పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఇరుకు వరండాలో

ఉపాధిహామీ రికార్డుల తనిఖీ

జిల్లాలో కరోనా వైరస్‌ మరింత వేగం పుంజుకుంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు సింగరేణి ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకున్న కరోనా నాలుగు రోజులుగా పెద్దపల్లి, మంథని పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతోంది. గడిచిన రెండు రోజుల వ్యవధిలో ఇక్కడ వందకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా పెద్దపల్లిలో 68, మంథనిలో 37 కేసులు నమోదు కావడం ఆయా ప్రాంతాల్లో వైరస్‌ ఉద్ధృతికి అద్దం పడుతోంది. జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో 496, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో 83 పాజిటివ్‌ కేసులతో మొత్తం 578 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఇక సింగరేణి ఆసుపత్రుల్లో 167, గోదావరిఖని ఆస్పత్రిలో 211 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఓదెల మండలంలో 6, కమాన్‌పూర్‌లో 2, సుల్తానాబాద్‌, శ్రీరాంపూర్‌, ముత్తారం, జూలపల్లిలలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లిలోని ఆంధ్రాబ్యాంకులో పలువురు సిబ్బంది కరోనా బారిన పడగా బుధవారం మధ్యాహ్నం బ్యాంకు మూసేశారు.

మరో 8 మందికి పాజిటివ్‌

గతంతో పోలిస్తే కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ అధికారులతో పాటు ఉద్యోగులు వైరస్‌ బారిన పడ్డారు. సామూహికంగా పని చేసే ప్రాంతాల్లోనే వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు కరోనా బారిన పడగా మరో 8 మంది వైద్యులకు వైరస్‌ సోకింది. ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, వైద్యం కోసం వచ్చే వారి తాకిడి పెరగడంతో పలువురు వైద్యులు, సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. పెద్దపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో ఇద్దరు అధికారులు వైరస్‌ బారిన పడటంతో కార్యాలయంలో పని చేసే ఇతర సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఇదే కార్యాలయంలో ఉపాధిహామీ రికార్డుల తనిఖీ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. కరోనా సమయంలో ఇరుకు గదుల్లో సమూహాల వారీగా నిర్వహిస్తున్న తనిఖీలు ఉద్యోగుల్లో భయాందోళన రేపుతోంది.

కట్టడికి యువకుడి ప్రచారం

పెద్దపల్లికి చెందిన భాషా అలియాస్‌ విజయ్‌సింగ్‌ కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజలు సహకరించాలంటూ పట్టణంలో స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన వీధులు, జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని, వైరస్‌ను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించాలని కోరుతూ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అతడి సామాజిక బాధ్యతకు ముగ్ధులైన పెద్దపల్లి ఫుడ్‌బ్యాంక్‌ సభ్యులు బుధవారం శాలువాతో సత్కరించి అభినందించారు.

రామగుండంలో 39.3 శాతం పాజిటివిటీ

గోదావరిఖని పట్టణం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం కరోనా నిర్ధారణ పరీక్షల్లో 39.3 శాతం మందికి పాజిటివ్‌గా వచ్చింది. కొద్ది రోజులుగా పరీక్షల్లో పాజిటివ్‌ల శాతం పెరుగుతూనే ఉంది. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్టీపీసీఆర్‌ కేంద్రం, ఆరు పట్టణ, మూడు ప్రాథమిక, రెండు సింగరేణి ఆస్పత్రుల్లో బుధవారం 1173 మందికి పరీక్షలు నిర్వహించగా 461 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. అత్యధికంగా సింగరేణి ఆర్జీ-1 ఆస్పత్రిలో 93 మందికి, ఆర్జీ-2 ఆస్పత్రిలో 73 మందికి, గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ర్యాపిడ్‌ పరీక్షల్లో 90 మందికి, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో 83 మందికి, అడ్డగుంటపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో 29, లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని