logo

ప్రగతి ప్రసాద్‌ం లేనట్లేనా?

ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లాంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ పథకం ద్వారా అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశమున్నా, ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. ప్రధాన ఆలయాలపై శీతకన్నే ఉంటోంది.

Published : 28 Jan 2022 03:33 IST

వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలపై కేంద్రం శీతకన్ను


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

న్యూస్‌టుడే, ధర్మపురి: ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లాంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ పథకం ద్వారా అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశమున్నా, ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. ప్రధాన ఆలయాలపై శీతకన్నే ఉంటోంది. దేశంలోనే వారణాసి, గయ లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, ఆంధ్ర, తెలంగాణలోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రసాద్‌ పథకం కింద పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్టారు. ఆంధ్ర ప్రాంతంలోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2015లోనే రూ.55 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. తెలంగాణలోని శ్రీ జోగులాంబ శక్తిపీఠ ఆలయానికి రూ.36.73 కోట్ల నిధులు విడుదల చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ప్రసాద్‌ పథకంలో చేర్చారు. మొత్తం 92.04 కోట్లతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు, భక్తులకు వసతులు, క్రాఫ్ట్‌ విలేజ్‌ పనులు, రామాయణ థీమ్‌ పార్కు, పర్ణశాల, సీతావాగు, ఇతరత్రా పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు.

లక్ష్యం సమున్నతం..

తీర్థయాత్ర స్థలాలు, వారసత్వ సంపదకు సంబంధించిన స్థలాన్ని సమగ్ర అధ్యయనం చేసే అభివృద్ధి లక్ష్యంతో ప్రసాద్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి పుణ్యక్షేత్రాలను ఈ పథకం కింద అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని 2019లోనే తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఎలాంటి స్పందన లేదు. ప్రధానంగా వేములవాడకు ఏటా నికర ఆదాయం రూ.100 కోట్లు, కొండగట్టుకు రూ.50 కోట్లు, ధర్మపురికి రూ.6 కోట్ల వరకు వస్తోంది. భక్తుల కానుకలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మూడు పుణ్య క్షేత్రాలను ప్రసాద్‌ పథకంలో చేరిస్తే భక్తులకు వసతిగదులు, ఇతరత్రా పనులు చేపట్టే వీలుంటుంది. భక్తులు ఈ మూడు క్షేత్రాల్లో కనీస వసతులు కరవై నానా ఇబ్బంది పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని