logo

75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

మంత్రి కేటీఆర్‌ సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని

Published : 20 May 2022 03:24 IST

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రి కేటీఆర్‌ సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో 75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులు పండించిన మొత్తం ధాన్యంతో పాటు తడిసి వాటిని కొనుగోలు చేస్తామన్నారు. గురువారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో జడ్పీ అధ్యక్షురాలు అరుణ అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, మహిళా, శిశు సంక్షేమం, నిర్మాణ పనులు, ప్రణాళిక, ఆర్థిక అంశాలపై చర్చించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాఠశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలో మొదటి విడతగా 172 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. పదో తరగతి పరీక్షలు ఈనెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీరాజ్, ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న మిషన్‌ భగీరథ పనులను పూర్తిచేయాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన గుడ్లను అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి మహిళా ఆత్మరక్షణకు సఖీ కేంద్రాన్ని సద్వినియోగపరుచుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. వయోవృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నూతనంగా నిర్మించిన సిరిసిల్ల మార్కెట్‌యార్డులో సకల సౌకర్యాల కోసం మరో రూ. 12 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు.  సిరిసిల్లలో నిర్మించిన రైతు బజార్‌ నిర్వహణ బాధ్యతలు పురపాలక సంఘానికి  అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. త్వరలోనే అప్పగిస్తామన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. జూన్‌ 3 నుంచి నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ సిద్దం వేణు, జడ్పీటీసీ సభ్యులు గట్ల మీనయ్య, గుండం నర్సయ్య, నాగంకుమార్, కోఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాషా, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని