logo

మరనేత... ఆధునికత

రాష్ట్రంలోని తొలి వస్త్రోత్పత్తి కేంద్రం ఆధునికతవైపు అడుగులేస్తోంది. ఇక్కడ నిర్వహణ భారంతో ఇప్పటికీ కొందరు మరమగ్గాలను విక్రయించి పరిశ్రమలను మూసివేశారు. మరికొందరు పరిశ్రమలను ఆధునికీకరిస్తూ తమ నైపుణ్యాలకు వన్నెలద్ది నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు.

Published : 24 May 2022 04:30 IST

పరిశ్రమల నవీకరణతో ఉపాధి కొత్త పుంతలు

పార్కులో ఏర్పాటు చేసిన నూతన మరమగ్గాలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్రంలోని తొలి వస్త్రోత్పత్తి కేంద్రం ఆధునికతవైపు అడుగులేస్తోంది. ఇక్కడ నిర్వహణ భారంతో ఇప్పటికీ కొందరు మరమగ్గాలను విక్రయించి పరిశ్రమలను మూసివేశారు. మరికొందరు పరిశ్రమలను ఆధునికీకరిస్తూ తమ నైపుణ్యాలకు వన్నెలద్ది నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు.

తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని టెక్స్‌టైల్‌ పార్కులో ప్రస్తుతం 65 పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటన్నింటిలోనూ ర్యాపియర్‌ మరమగ్గాలున్నాయి. ఇవి నిమిషానికి 180 ఆర్పీఎంల వేగంతో వంద మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేస్తాయి. తొలుత నాలుగు పరిశ్రమల్లో 48 మరమగ్గాలు ఎయిర్‌, వాటర్‌ జెట్ మరమగ్గాలను అమర్చుకున్నారు. వీటి వేగం 600 ఆర్పీఎం. నిమిషానికి 300 మీటర్ల వస్త్రం 110 ఇంచుల వెడల్పుతో ఉత్పత్తి అవుతుంది. పాత మరమగ్గాల స్థానంలో కొత్తవాటికి సాంకేతిక నైపుణ్యాన్ని జత చేస్తే ఇక్కడి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం తెలుపు, రంగుల నూలుతో షూటింగ్‌, షర్టింగ్‌, బతుకమ్మ చీరలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి జకాట్‌ వంటి పరికరాలు అమర్చితే కంచి పట్టు చీరలు మొదలు డిజైనర్‌వేర్‌ వరకు.. చేతిరుమాల్ల నుంచి దుప్పట్ల వరకు అంతర్జాతీయ వస్త్రోత్పత్తులతో పోటీ పడే అవకాశం ఉంది. మరమగ్గాల నవీకరణతో కార్మికులపై పని భారం తగ్గుతోంది. ఉత్పత్తిలో వేగం పెరుగుతుంది. రోజు వారీ కూలి లాభదాయకంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

110 ఇంచుల వెడల్పుతో ఉత్పత్తి చేసే భారీ మరమగ్గం


25 శాతం రీయింబర్సుమెంటు

పరిశ్రమల స్థితిగతులు.. వస్త్రోత్పత్తులపై చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో గతేడాది ఒక కమిటీ అధ్యయనం చేసింది. టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభించిన నాటి నుంచి ఇందులోని రాపియర్‌, జెట్‌ మరమగ్గాలను నవీకరించలేదు. ఇక్కడి పురాతన మరమగ్గాలతో నూతన ఆవిష్కరణలు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వానికి తమ నివేదికలో వెల్లడించారు. ఇప్పుడున్న మరమగ్గాల్లో మార్పులు తీసుకురావాలని భావించారు. దీని కోసం టి-ట్యాప్‌ (తెలంగాణ టెక్స్‌టైల్‌ అపారెల్‌ పాలసీ)ని తీసుకొచ్చారు. ఆధునికీకరించిన పరిశ్రమలకు యజమానులు వెచ్చించే నిధుల్లో 25 శాతం రీయింబర్స్‌మెంటు పొందవచ్చు. పార్కులో ఇప్పటికీ 20 మంది పరిశ్రమ యజమానులు ముందుకొచ్చారు. దీనిలో 200 మరమగ్గాల ఆధునికీకరణకు అవకాశం ఉంది.


సీఎఫ్‌సీ ఏర్పాటు చేస్తే...

తరచూ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న టెక్స్‌టైల్‌ పార్కులో ఆధునికతను అందిపుచ్చుకోవడం మంచి పరిణామం. దీనితోపాటు ఉమ్మడి వసతుల కేంద్రం (సీఎఫ్‌సీ)ని ఏర్పాటు చేస్తే ఉత్పత్తి మొదలు మార్కెటింగ్‌ వరకు ఇక్కడి నుంచే జరిగే వీలుంది. పార్కులోని యజమానులు సమ్మెకు వెళ్లడంతో వారి సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అలాగే ఆధునికీకరణతో కొత్తరకం ఉత్పత్తులు ప్రారంభిస్తే పార్కులో నిరుద్యోగులు, విద్యావంతులైన యువత కొత్తగా పరిశ్రమలను స్థాపించి ఉపాధి అవకాశాలను విస్తరించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు