logo

మాజీ సైనికుల భూముల్లో పాగా

ఓ సింగరేణి కార్మికునికి మాజీ సైనికుల ప్లాట్లలో ఒకటి విక్రయించేందుకు బ్రోకర్‌ అడ్వాన్స్‌ తీసుకున్నాడు. నాలుగు నెలలైనా రిజిస్ట్రేషన్‌ చేయకుండా తిప్పకుంటున్నాడు. మాజీ సైనికునికి సంబంధించిన భూమి వారి కుటుంబ సభ్యులు విక్రయిస్తారని

Published : 25 May 2022 02:39 IST

నకిలీ పత్రాలతో మోసాలు
రిజిస్ట్రేషన్లు చేయకుండానే డబ్బు వసూలు
న్యూస్‌టుడే, గోదావరిఖని

* ఓ సింగరేణి కార్మికునికి మాజీ సైనికుల ప్లాట్లలో ఒకటి విక్రయించేందుకు బ్రోకర్‌ అడ్వాన్స్‌ తీసుకున్నాడు. నాలుగు నెలలైనా రిజిస్ట్రేషన్‌ చేయకుండా తిప్పకుంటున్నాడు. మాజీ సైనికునికి సంబంధించిన భూమి వారి కుటుంబ సభ్యులు విక్రయిస్తారని నమ్మబలికి అడ్వాన్స్‌ కింద రూ.లక్షల్లో తీసుకున్నాడు. వారితో రిజిస్ట్రేషన్‌ చేయించలేదు. పోనీ డబ్బులు తిరిగి ఇవ్వమంటే వాయిదాలు పెడుతున్నాడు. మధ్యవర్తుల ద్వారా వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇచ్చిన డబ్బులు ఏవిధంగా తీసుకోవాలో తెలియక సింగరేణి కార్మికుడు ఆందోళనకు గురవుతున్నాడు.

మాజీ సైనికులకు కేటాయించిన భూముల్లో కొందరు బ్రోకర్లు పాగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సైనికులకు ఇళ్ల కోసం రామగుండం మండలం ఎఫ్‌సీఐ గౌతమినగర్‌ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మాజీ సైనికుల సొసైటీ పేరుతో కేటాయించిన స్థలంలో 284 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో చాలామంది సైనికేతరులే ఆక్రమించుకున్నారు. కొంత స్థలంలో ఓ ప్రార్థన మందిరం కబ్జా చేసినట్లు మాజీ సైనికులు జిల్లా పాలనాధికారికి చాలా క్రితం ఫిర్యాదు చేశారు. కొంతకాలం ఈ వివాదం నడిచింది. మాజీ సైనికులకు కేటాయించిన కొన్ని ప్లాట్లు కబ్జాకు గురయ్యాయి. మాజీ సైనికులు చాలా మంది స్థానికంగా లేకపోవడంతో కబ్జాదారులు అందులో పాగా వేశారు. వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. కొంతకాలం సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేశారు. ఇందులో రెండు వర్గాలు కావడంతో గతంలో చేసిన రిజిస్ట్రేషన్‌లను రద్దు చేయాలని ఒక వర్గం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ సభ్యులు దూరంగా ఉండటం.. ఉన్నవారు పెద్దగా పట్టించుకోకపోవడంతో మాజీ సైనికులకు కేటాయించిన ప్లాట్లలో సైనికేతరులే ఆక్రమించుకున్నారు. ఆ ప్లాట్లనే క్రయవిక్రయాల కింద ఇతరులకు అమ్ముతూ కొంతమంది బ్రోకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమందికి రిజిస్ట్రేషన్‌లు చేయకుండానే ప్లాట్లు కేటాయించారు. చాలాకాలం క్రితం కొనుగోలు చేసిన వారికి ఆయా ప్లాట్లకు సంబంధించిన మాజీ సైనికులు సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేయించారు. వారికి మాత్రమే ప్రస్తుతం పూర్తిహక్కు పత్రాలున్నాయి. 284 ప్లాట్లలో సగం మందికి పైగా కేవలం అనధికారికంగానే అందులో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

సైనికేతరుల దర్జా
మాజీ సైనికుల కోసం కేటాయించిన స్థలాల్లో సైనికేతరులే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది మాజీ సైనికుల వద్ద కొనుగోలు చేసి ఉండగా మరికొంత మంది ప్లాట్లను కబ్జా చేశారు. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన మాజీ సైనికులకు సొసైటీ ద్వారా ప్రభుత్వం గౌతమినగర్‌లో స్థలం కేటాయించింది. అప్పట్లో సొసైటీలో ఉన్న సభ్యుల ప్రకారం 284 ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన మాజీ సైనికులకు ఇందులో ప్లాట్లు కేటాయించారు. అయితే వారు ఇక్కడికి రాకపోవడం.. కొంత మందికి తమ ప్లాటు ఎక్కడ ఉందన్న విషయం కూడా తెలియకపోవడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని ఆసరగా తీసుకున్న కొంతమంది బ్రోకర్లు మాజీ సైనికుల ప్లాట్లను తమ ఆదీనంలోకి తీసుకుని వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మాజీ సైనికుల హౌజింగ్‌ సొసైటీ పేరుతో ఉన్న స్థలంలో సైనికేతరులు నివాసం ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆ ప్లాట్లకు సంబంధించిన మాజీ సైనికుల పత్రాలు లేక రిజిస్ట్రేషన్‌లు కావడం లేదు. అయినా కొంతమంది బ్రోకర్లు ప్లాట్లు విక్రయిస్తామని నమ్మబలుకుతూ అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.


కబ్జా చేస్తే చర్యలు
- రమేశ్‌, రామగుండం తహసీల్దార్‌

మాజీ సైనికుల స్థలాలను ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకుంటాం. బ్రోకర్‌ల మాయమాటలకు ఎవరూ మోసపోవద్దు. కేవలం మాజీ సైనికుల కోసం కేటాయించిన స్థలం. వారి నివాసానికి మాత్రమే ప్లాట్లు ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసినట్లు సొసైటీ సభ్యులు మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. కొంతమంది తప్పుడు పత్రాలతో ఇంటి నెంబర్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని