logo

చేప పిల్లల పెంపకం లక్ష్యం 1.45 కోట్లు

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లలను వదులుతుంది. జిల్లాలో గత ఐదేళ్లలో 4.17 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడిచిపెట్టారు. వీటి ద్వారా 13,254 టన్నుల చేపల ఉత్పత్తి రాగా

Published : 26 May 2022 04:07 IST

ఐదేళ్లలో వదిలినవి 4.17 కోట్లు

జలాశయంలో విడిచిపెడుతున్న చేప పిల్లలు

న్యూస్‌టుడే, బోయినపల్లి: మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లలను వదులుతుంది. జిల్లాలో గత ఐదేళ్లలో 4.17 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడిచిపెట్టారు. వీటి ద్వారా 13,254 టన్నుల చేపల ఉత్పత్తి రాగా మత్స్యకారులకు, చేపల విక్రయాలపై ఆధారపడిన వ్యాపారులకు ఉపాధి బాగా లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.45 కోట్ల చేప పిల్లలను వదలడానికి అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో రాజరాజేశ్వర (మధ్యమానేరు), ఎగువ మానేరు, అన్నపూర్ణ జలాశయాలు ప్రధానంగా ఉన్నాయి. జిల్లాలో 96 మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉండగా సుమారు 6,500 మంది సభ్యులు ఉన్నారు. జలాశయాలు, చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఏటా చేప పిల్లలు విడుదల చేసి పెంచుతున్నారు. 2017-18లో 69 నీటి వనరుల్లో 21.81 లక్షల చేప పిల్లలను అధికారులు వదలగా 126 టన్నుల చేపల ఉత్పత్తి వచ్చింది. ఏటా లక్ష్యాన్ని పెట్టుకుని నీటి వనరుల్లో పెంచి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి చర్యలు చేపడుతున్నారు. జలాశయాల్లో 80 ఎంఎం నుంచి 100 ఎంఎం, చెరువుల్లో 35 ఎంఎం నుంచి 40 ఎంఎం బరువు ఉన్న చేప పిల్లలను వదులుతున్నారు. కట్ల, రాహు, మృగాల రకం నీటి వనరుల్లో వేస్తున్నారు. రాజరాజేశ్వర జలాశయం పరిధిలో పది నుంచి ఇరవై కిలోల బరువున్న చేపలు సైతం లభ్యమవుతున్నాయి. మత్స్యకారులతోపాటు చేపలు కొనుగోలు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. రాజరాజేశ్వర జలాశయంలో లభిస్తున్న చేపలను మత్స్యకారుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న స్థానిక వ్యాపారులు అక్కడే విక్రయించడంతోపాటు కరీంనగర్‌, సిరిసిల్ల, వేములవాడ, హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.


6 వేల టన్నుల ఉత్పత్తి వస్తుందని...

2021-22 ఆర్థిక సంవత్సరంలో 392 నీటి వనరుల్లో 1.22 కోట్ల చేప పిల్లలను అధికారులు వదిలారు. వీటి ద్వారా 6 వేల టన్నుల చేపల ఉత్పత్తి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల్లో చేపలు వదలడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వదిలిన 392 ట్యాంకులతోపాటు అదనంగా మరో 40 ట్యాంకుల్లో వదలడానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు 1.45 కోట్ల చేప పిల్లలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం గ్రామాల్లో ట్యాంకుల పరిశీలన పూర్తి చేశారు.


ఉపాధి లభిస్తుంది
-శ్రీనివాస్‌, చేపల దుకాణం నిర్వాహకుడు, కొదురుపాక

రాజరాజేశ్వర జలాశయంలో వదిలిన చేప పిల్లల వల్ల మత్స్యకారులతోపాటు వ్యాపారులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. నాలుగేళ్లుగా స్థానిక మత్స్యకారుల నుంచి చేపలు కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల దారిలో ప్రయాణించే వాహనదారులతోపాటు చుట్టు పక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి చేపలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పట్టణాల్లోని వ్యాపారులు టోకుగా కొనుగోలు చేస్తున్నారు.


ప్రణాళిక సిద్ధం చేశాం
- శివప్రసాద్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

జిల్లాలోని నీటి వనరుల్లో 2022-23లో 1.45 కోట్ల చేప పిల్లలను వదలడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. 2021-22లో లక్ష్యం మేరకు 1.22 కోట్ల చేప పిల్లలను వదిలాం. లక్ష్యం మేరకు చేప పిల్లలను వదులుతాం. దీనివల్ల మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని