ప్రజారోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ
ఎపిడమిక్ సెల్ ఏర్పాటు
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ప్రమోద్‌కుమార్
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
వానాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు సంభవించి అంటువ్యాధులు ప్రబలుతాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. గోదావరి, మానేరు, హుసెన్‌మియా పరివాహక గ్రామాల్లో డెంగీ, మలేరియా వ్యాధులు గతంలో ప్రబలిన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించారు. కాలానుగుణ వ్యాధుల నివారణకు ఏఎన్‌ఎంలు, ఆశాసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్యాధికారులు, అన్ని విభాగాల వైద్య సిబ్బంది సాయంతో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నామని ‘ఈనాడు’ ముఖాముఖిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, సిబ్బంది, మందుల నిల్వలు, కరోనా నాలుగోదశ అప్రమత్తత చర్యలపై ఆయన వివరించారు.
ఈనాడు: అంటువ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు?
డీఎంహెచ్‌వో: వర్షాకాలంలో ఎక్కువగా కలుషిత నీటితో, కీటక జనితంగా సంభవించే డెంగీ, మలేరియా, మెదడువాపు, అతిసారం ప్రబలే అవకాశాలెక్కువ. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టడంతో దోమల వ్యాప్తి తక్కువగానే ఉంది. మిషన్‌భగీరథ నీటిని గ్రామాల్లో కుటుంబాల వారీగా సరఫరా చేస్తున్న క్రమంలో కలుషిత నీటి సమస్యలు ఉండవు. ప్రత్యేకంగా ఈ సీజన్‌లో పంచాయతీరాజ్ అధికారులతో కలిసి మురుగు కాల్వలు, నీటి నిల్వ ప్రదేశాలను గుర్తించి వాటిని పూడ్చివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి నీటిని కాచి చల్లార్చిన అనంతరం వడగట్టి తాగాలి. జ్వరం వచ్చిన వెంటనే సమీప పీహెచ్‌సీ, జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నాం.
ఈ : మందుల కొరతతో పాటు పాములు, విషకీటకాలు, శునకాల బెడద ఉంటుంది. వీటికి సంబంధించిన డోసులు అందుబాటులో ఉన్నాయా?
డీఎంహెచ్‌వో: ఎక్కడా మందుల కొరత, ఇంజెక్షన్లు, టీకాల కొరత లేదు. వచ్చే మూడు నెలలకు సరిపడేలా, 16 పీహెచ్‌సీల్లో ఒక్కో కేంద్రంలో 100 డోసుల చొప్పున యాంటీ స్నేక్ వినం(ఏఎన్‌వీ), యాంటీ రేబిస్ వినం(ఏఆర్‌వీ)టీకాలను అందుబాటులో ఉంచాం. డిమాండ్‌కు అనుగుణంగా అంచానాలు వేసి ప్రత్యేకంగా అందిస్తాం.
ఈ: వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నివారణకు సన్నద్ధత ఎలా ఉంది?
డీఎంహెచ్‌వో: జిల్లాలో 16 పీహెచ్‌సీలలో 34 మంది వైద్యసిబ్బంది, 12 పల్లె దవాఖానాలు, 6 యుపీహెచ్‌సీలలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా కార్యాలయంలో ఎపిడమిక్ సెల్ ఏర్పాటు చేశాం. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కమిటీ సమావేశం నిర్వహించాం. పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ప్రతి శుక్రవారం డ్రై డే, అంటువ్యాధులు ప్రబలిన ఇంటితో పాటు చుట్టుపక్కల సర్వే, రక్తనమునాలు, మెడికల్ కిట్లు ఇవ్వడం వంటివి చేపట్టాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయిలో ‘ఇండోర్ స్ప్రే’ చేపట్టి అంటువ్యాధులను నియంత్రించాలి. పంచాయతీలలో మలేరియా వైద్య సిబ్బందితో ఆయిల్‌బాల్స్, ఫాగింగ్ చేపడుతున్నాం. ఐదువేల మలేరియా ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచాం. ఏఎన్‌ఎంలకు ప్రతి నెల 30 శాంపిళ్లు లక్ష్యం విధించాం. వారు జ్వరం వచ్చిన, అనుమానిత బాధితులకు జ్వరపరీక్షలు, రక్తనమునాలు సేకరించి, నివారణ మందులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. జిల్లా వారీగా ఓ అధికారి, డివిజన్ల వారీగా అధికార, సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఏదేని సమస్యలుంటే ఎపిడమాలాజిస్ట్ నరేశ్-9885092257ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ: సమస్యాత్మక గ్రామాలు గుర్తించారా? డెంగీ నివారణకు చేపడుతున్న ప్రణాళిక?
డీఎంహెచ్‌వో: జిల్లాలో మలేరియా వ్యాప్తి లేదు. ముత్తారం, మల్లారం, కేశనపల్లి, అడవిశ్రీరాంపూర్, రాఘవాపూర్, బేగంపేట, మంథని, మల్లేపల్లి వంటి ప్రాంతాల్లో గతంలో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. రాఘవాపూర్‌లో సైతం ఒడిశా, బీహార్ ఇటుకబట్టీల కార్మికులు డెంగీ సోకిన తర్వాత జిల్లాకు రావడంతో ఇక్కడివారిలో వ్యాధి లక్షణాలు కనిపించాయి. సమస్యాత్మక గ్రామాల్లో తరచూ శిబిరాలు నిర్వహిస్తున్నాం. నిరుడు జిల్లావ్యాప్తంగా 330 డెంగీ కేసులు నమోదు కాగా మరణాలు సంభవించలేదు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 30 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ మందులు, పరీక్షలు, చికిత్సలు పూర్తి చేశాం. పంచాయతీల వారీగా ‘అబోట్’ ద్రావణాన్ని ఐదులీటర్ల చొప్పున సిబ్బందికి పంపిణీ చేసి పిచికారీ చేసేందుకు మంజూరు చేశాం. ‘డెంగీ’ తీవ్రమైతే ‘ఎలిసా’ పరీక్ష కోసం కరీంనగర్ సర్కారు ఆస్పత్రికి నమూనాలు పంపించి ఫలితాలు వెల్లడిస్తున్నాం.
ఈ: కొవిడ్ నాలుగోదశ ప్రభావం, వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ఎలా సాగుతోంది?
డీఎంహెచ్‌వో: కొవిడ్ నాలుగో దశలో ఇప్పటి వరకు నాలుగు పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటికే మొదటి డోసు 5,93,137 మందికి పంపిణీ చేయగా రెండోడోసు సైతం 5.93 లక్షల మందికి పంపిణీ చేశాం. 15-17 ఏళ్ల వారికి మొదటి డోసు 38,129 మందికి ఇస్తే, రెండో డోసు 37,166 మందికి అందించాం. 12-14 ఏళ్ల మధ్యవారికి మొదటి డోసు 23,548 మందికి ఇస్తే రెండో డోసు అంతే మందికి ఇచ్చాం. వ్యాక్సిన్‌ల కొరత ఎక్కడా లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
‘ఆ రెండూ ఉచితాలు కావు.. ఇంతకుమించి మాట్లాడను’: స్టాలిన్
-
Sports News
Virat Kohli : విరాట్‌లా సుదీర్ఘ ఫామ్‌లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్‌ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
-
General News
Telangana News: మహబూబ్‌నగర్‌లో ఫ్రీడం ఫర్ ర్యాలీ.. గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!