logo

సామాజిక మాధ్యమ సహకారం

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ప్రోత్సాహం అందిస్తూ ఇద్దరు ఆదర్శంగా నిలుస్తున్నారు. పుస్తకాల ప్రచురణతో పాటు ఎలాంటి అంశాలు చదవాలనే విషయమై ఒకరు అవగాహన కల్పిస్తుండగా..

Published : 28 Jun 2022 05:14 IST

న్యూస్‌టుడే, మేడిపల్లి(జగిత్యాల)

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ప్రోత్సాహం అందిస్తూ ఇద్దరు ఆదర్శంగా నిలుస్తున్నారు. పుస్తకాల ప్రచురణతో పాటు ఎలాంటి అంశాలు చదవాలనే విషయమై ఒకరు అవగాహన కల్పిస్తుండగా.. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి యూట్యూబ్‌ ద్వారా విలువైన సమాచారాన్ని చేరవేస్తూ మరొకరు చేదోడుగా ఉంటున్నారు. పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో వీరి ప్రోత్సాహం బాగుందని ఉద్యోగార్థులు పేర్కొంటున్నారు.


యువకులకు తోడ్పాటు

మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ఎనుగంటి సురేష్‌ హైదరాబాద్‌లో ప్రజ్ఞ పబ్లికేషన్స్‌ పేరిట పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈనాడు ప్రతిభ పేజీల్లో ఉద్యోగార్థుల కోసం పలు ఉపయోగకరమైన అంశాలను ఆయన రాశారు. ఆయన ప్రచురించిన పుస్తకాలు యువకులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. తన సంకల్పం నెరవేరేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో పలు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుత పోటీ పరీక్షల నేపథ్యంలో యువకులకు ఉపయోగకరంగా ఉండే అంశాలను ఉచితంగానే అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సురేష్‌ ప్రచురించిన అంశాలు యువకులు షేర్‌ చేసుకుంటున్నారు. గ్రూప్‌1 నుంచి గ్రూప్‌4 వరకు సిలబస్‌లో పలు అంశాలు అన్ని పరీక్షలకు ఉమ్మడిగా ఉపయోగపడతాయని సురేష్‌ పేర్కొన్నారు. తెలుగు అకాడమీ వారి ప్రచురణలు, సామాజిక మాధ్యమాల్లోని సమాచారాన్ని వీలైనంత మేర పునశ్చరణ చేయాలని కోరారు. పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని, తెలంగాణ అంశాలు, భారతదేశ చరిత్ర, ఇతర అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. కరెంట్‌ అఫైర్స్‌పై ప్రతిరోజూ దృష్టి పెట్టాలని, కష్టపడితే ఉద్యోగం తప్పకుండా వరిస్తుందని చెప్పారు.


ఆదర్శం.. ఆ అధికారి

కోరుట్ల మండలం జోగన్‌పల్లికి చెందిన పల్లికొండ నరేశ్‌ జిల్లా ఉపాధిహామీ ఏపీడీగా పనిచేస్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం వరకు జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్న ఆయన యూట్యూబ్‌ ద్వారా పలు అంశాలను వివరిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి ‘నరేశ్‌ కెరీర్‌ గైడ్‌’ పేరిట యూట్యూబ్‌లో వీడియోలు పొందుపరుస్తూ ఉద్యోగార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. గ్రూప్‌1 అధికారి అయిన నరేశ్‌ ఉద్యోగ ప్రకటనల్లో వచ్చిన మార్పులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధానం గురించి వివరిస్తున్నారు. వీటితో పాటు ప్రతిరోజూ కరెంట్‌ అఫైర్స్‌పై పాఠాల రూపంలో పోస్టులు పెడుతున్నారు. సివిల్స్‌లో టాప్‌ ర్యాంకర్ల అభిప్రాయాలు, ఇతర సమాచారాన్ని బోధిస్తున్నారు. ఇటీవల ముగిసిన టెట్‌ పరీక్షపై నరేశ్‌ రూపొందించిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వారి ప్రకటనపై సమగ్ర వివరణ కూడా యువకులకు ఉపయోగపడింది. ఏయే శాఖల కింద ఎన్ని పోస్టులను ప్రభుత్వం నియమించనుంది? ఆయా పోస్టుల కోసం ఎలా చదవాలి? అనే అంశాలను నరేశ్‌ సమగ్రంగా వివరించారు. స్వతహాగా అధికారి కావడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమకు మంచి సమాచారం అందుబాటులోకి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో యువకులకు అండగా ఉండాలనే తన సంకల్పం నెరవేరిందని నరేశ్‌ పేర్కొన్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని