logo

కుష్టు కబళిస్తోంది

పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్టు జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేసిన వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తూ రోగులను గుర్తిస్తున్నారు.

Published : 08 Aug 2022 05:34 IST

జిల్లాలో మూడున్నర ఏళ్లలో బాధితులు 444
కోలుకున్న వారు 228

సర్వేలో వివరాలు తెలుసుకుంటున్న వైద్య సిబ్బంది (పాతచిత్రం)

న్యూస్‌టుడే, మెట్‌పల్లి: పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్టు జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేసిన వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తూ రోగులను గుర్తిస్తున్నారు. వ్యాధిపై అవగాహన కల్పించి మందులు అందిస్తున్నారు. మరో వైపు అదే స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మూడున్నర సంవత్సరాల్లో 444 మంది వ్యాధిగ్రస్థులను గుర్తించారు. 228 మంది చికిత్స పొంది కోలుకున్నారు.

ముందుగా గుర్తిస్తే నయం

కుష్టు అంతగా అంటువ్యాధి కాదు. వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు సంక్రమిస్తుంది. పూర్తిగా నయం కాని జబ్బేమీ కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధిని త్వరగా గుర్తించి మందులు వాడితే పూర్తిగా కోలుకోవచ్చని అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే కబళించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి జీవించవచ్చు. కుష్టు లైంగికంగా సంక్రమించదు. గర్భం ద్వారా పుట్టబోయే బిడ్డకు వ్యాపించదు. వ్యాధి సోకిన వ్యక్తి ముక్కు ద్రవంతో దగ్గు లేదా స్పర్శ ద్వారా వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధక శక్తిని బట్టి 95 శాతం మందికి వ్యాధి సోకిన అభివృద్ధి చెందదు. రెండు రకాల వ్యాధులు ఉంటాయి. పాసిబాసిల్లరీ వ్యాధి ఉన్న వ్యక్తికి శరీరంపై ఐదు రకాల మచ్చలు ఉంటాయి. మల్టీబాసిల్లరీ వ్యాధి సోకిన వ్యక్తి శరీరంపై ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటాయి. స్పర్శ ఉండదు. చర్మం బయాప్సీలో యాసిడ్‌ ఫాస్ట్‌ బాసిల్లిని కనుగొనడం వల్ల రోగాన్ని నిర్ధారిస్తారు.

ఉచితంగా సేవలు, మందులు

మల్టీడ్రగ్‌ థెరపీతో కుష్టు వ్యాధిని నయం చేసుకోవచ్చు. పాసిబాసిల్లరీ కుష్టుకు ఆరు నెలల పాటు డాప్సోన్‌, రిఫాంపిసిన్‌, క్లోఫాజిమైన్‌ మందులతో మల్టీచికిత్స అందిస్తారు. ఇవే మందులతో మల్టీబాసిల్లరీ వ్యాధిగ్రస్థులకు 12 నెలల పాటు చికిత్స అందిస్తారు. కుష్టు వ్యాధితో బాధపడే వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మందులు ఉచితంగా అందిస్తారు. జిల్లా ఆసుపత్రితోపాటు జిల్లాలోని సీహెచ్‌సీలు, అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలతోపాటు మందులు అందిస్తారు. శస్త్రచికిత్స అవసరమైతే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి లేదా కూకట్పల్లిలోని శివానంద స్వచ్చంద సంస్థ ఆసుపత్రికి పంపిస్తారు. శస్త్రచికిత్సకు ప్రభుత్వం రూ.8వేల వంతున అందిస్తుంది.

చర్యలు తీసుకుంటున్నాం - డాక్టర్‌ శ్రీనివాస్‌, వ్యాధి నియంత్రణ జిల్లా అధికారి

సర్వేలు నిర్వహించి వ్యాధిగ్రస్థులను గుర్తించి చికిత్స అందిస్తున్నాం. సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. కుష్టును అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మొదటి దశలో ఉండగానే గుర్తిస్తే అంతే వేగంగా నయం చేసుకోవచ్చు. నియంత్రణకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. బాధితులు సహకరిస్తే నియంత్రణ మరింత సులువు అవుతుంది. కుష్టుపై భయం వీడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని