logo

బైపాస్‌లో పారిశుద్ధ్యంపై నజర్‌

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌, సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో ర్యాంకులు సాధించడమే కాకుండా నగదు పురస్కారాలు దక్కించుకోవడంతో పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ

Published : 10 Aug 2022 04:55 IST

కార్మికుల కొరతతో సతమతం

ప్రత్యేక బృందంతోనే సాధ్యం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

రామగుండం బైపాసురోడ్డులో చెత్తను తీసుకెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులు

రీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌, సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో ర్యాంకులు సాధించడమే కాకుండా నగదు పురస్కారాలు దక్కించుకోవడంతో పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు నగర వీధులు..ప్రధాన, అంతర్గత రహదారులకే శానిటేషన్‌ పరిమితం చేయకుండా..నగర శివారులోని బైపాసు రోడ్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. రామగుండం, సిరిసిల్ల బైపాసు, హౌసింగ్‌బోర్డుకాలనీ క్యాన్సర్‌ ఆసుపత్రి రోడ్డు, సుభాష్‌నగర్‌ వైపు, రేకుర్తి శాతవాహన యూనివర్సిటీ రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారం లేకుండా చూడాలని పారిశుద్ధ్య విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆ రోడ్లపై చెత్త కుప్పలు
నగర శివారు ప్రాంతాల్లో ఉన్న బైపాసు రహదారులు చెత్త కుప్పలకు అడ్డాగా మారుతోంది. చికెన్‌ వ్యర్థాలు, చెత్తా చెదారం, శుభ కార్యాలు, వేడుకల సందర్భంగా వచ్చిన వ్యర్థాలన్నీ ఆటోల ద్వారా తీసుకొచ్చి రహదారులకు ఇరువైపులా పోస్తున్నారు. దాంతో అక్కడ పందులు, కుక్కలు చేరుకుని చెత్తంతా చిందర వందర చేస్తుండగా, రాకపోకలు సాగించే ప్రజలకు దుర్వాసన వెదజల్లుతోంది. ఇళ్ల ముందుకు రిక్షాలు, ట్రాక్టర్లు వస్తుండగా కార్మికులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడం, ఇష్టానుసారంగా ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు.

హౌసింగ్‌బోర్డుకాలనీ వైపు రోడ్డు ఊడుస్తున్న కార్మికులు

కార్మికులు ఎక్కడ?
కరీంనగర్‌లో 60 డివిజన్లు ఉండగా ప్రస్తుతం 1056 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో డ్రైవర్లు, లోడర్లు, స్వీపర్లు, మురుగునీటి కాల్వలు శుభ్రం చేసే వారున్నారు. ఒక డివిజన్‌కు 8 నుంచి 10మంది కార్మికులు, ఒక స్ప్రే వర్కర్‌ ఉండగా, రెండు డివిజన్లకు ఒక ట్రాక్టర్‌ పని చేస్తోంది. అంటే ఒక డివిజన్‌కు ఒక ట్రాక్టర్‌ మూడు రోజులు వస్తుండగా ఆ సమయంలో రహదారులకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారం, డ్రైనేజీల్లోంచి తీసిన పూడిక తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉండగా ప్రత్యేకంగా బైపాసుల వెంబడి పని చేసేందుకు కార్మికులు ఎక్కడ ఉన్నారనేదీ పెద్ద ప్రశ్నగా మారింది. డివిజన్లలో పని చేసే కార్మికులను అక్కడికి పంపిస్తే కార్పొరేటర్ల నుంచి లొల్లి ఉండగా, డివిజన్ల వారీగా చేపట్టే పనులపై ప్రభావం పడుతోంది. అక్కడ, ఇక్కడ పని చేయించాలంటే కత్తి మీద సాములాగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారీ వాహనాలతో భయం
బైపాసు రహదారుల వైపు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలంటే ఉన్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు చోట్ల ఏకకాలంలో పనులు చేయడం సాధ్యం కాకపోగా ఆ రోడ్లపై భారీ వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. వేగంగా వచ్చి కార్మికుల మీదికి దూసుకెళితే ప్రమాదాలు జరిగే అవకాశముంటుందని కార్మికులు అంటున్నారు. అన్ని బైపాసు రోడ్లపై పనులు చేసేలా ప్రత్యేకంగా ఒక వాహనం, కార్మికులను కేటాయించాలి. హెచ్చరికలతో కూడిన స్టాపర్లు ఏర్పాటు చేసుకునేలా చూడాల్సిన అవసరముంటుంది. ఆ విధంగా చేపడితే బైపాసు రోడ్లపై పారిశుద్ధ్య పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. ఈ విషయంలో నగర మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, పారిశుద్ధ్య విభాగం పర్యవేక్షకులు ఆ దిశగా ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని