logo

ఇంటింటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి

వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీపై

Published : 10 Aug 2022 04:55 IST

కలెక్టరేట్‌లో జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం గర్వించేలా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 3,08,754, కరీంనగర్‌  కార్పొరేషన్‌లో 79,953 ఇళ్లపై జెండా ఎగురవేసి, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఆగస్టు 16న దేశభక్తిని పెంపొందిచే విధంగా ఎక్కడి వారక్కడ ఏకకాలంలో జాతీయ గీతాలాపన చేయాలన్నారు. 75 సంవత్సరాల దేశాభివృద్ధిని, దేశ పురోగతి, దేశ భక్తిని భావితరానికి చాటిచెప్పేలా వేడుకలు నిర్వహించుకుందామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులకు జాతీయ జెండాలను అందజేశారు. జిల్లా పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జాతీయ జెండా ఎగురవేసిన చోట వివిధ పార్టీలకు సంబంధించిన జెండాలను ఎగుర వేయొద్దని పేర్కొన్నారు. అనంతరం మంత్రి, జిల్లా పాలనాధికారి, మేయర్‌ వై.సునీల్‌ రావు, సీపీ సత్యనారాయణలతో కలిసి భగత్‌నగర్‌లో ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ కనుమల్ల విజయ, గ్రంథాలయ ఛైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, అదనపు పాలనాధికారులు గరిమా అగ్రవాల్‌, శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, ఉప మేయర్‌ చల్ల స్వరూపరాణి, కమిషనర్‌సేవా ఇస్లావత్‌, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

పతాకాల పంపిణీ  ప్రారంభించిన మంత్రి
రాంపూర్‌(కరీంనగర్‌) : ప్రపంచ దేశాలు ఈర్ష్య పడేలా, దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.  మేయర్‌ సునీల్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న 32వ డివిజన్‌ భగత్‌నగర్‌లో ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం  మంగళవారం మంత్రి గంగుల ప్రారంభించారు. నగరంలో తలసేమియాతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా రక్తదానం, అనాథలు, వృద్ధులు, వికలాంగులకు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, అదనపు పాలనాధికారులు గరిమా అగ్రవాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, పలువురు తెరాస కార్పొరేటర్లు, నాయకులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రి, మేయర్‌ ఇంటింటికి వెళ్లి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని