logo

సొంత కార్లు... అద్దె బిల్లులు

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉపాధి హామీ, ఐకేపీ విభాగాలతోపాటు ఎంపీడీవోల వాహనాల వినియోగం, రవాణా నిధులు చాలా వరకు పక్కదారి పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాలను వినియోగించి,

Updated : 12 Aug 2022 05:50 IST

గ్రామీణాభివృద్ధిశాఖలో రవాణా నిధుల దుర్వినియోగం

సొంత వాహనానికి బిల్లు పొందిన ఉత్తర్వుల ప్రతి

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉపాధి హామీ, ఐకేపీ విభాగాలతోపాటు ఎంపీడీవోల వాహనాల వినియోగం, రవాణా నిధులు చాలా వరకు పక్కదారి పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాలను వినియోగించి, అద్దెకు వాహనాలు తీసుకున్నట్లు డబ్బులు డ్రా చేస్తున్నారు. జిల్లాలో ఈ శాఖ పరిధిలో మొత్తం 19 మంది కార్లు వినియోగిస్తున్నారు. ఇందులో నాలుగు మినహా మిగతావన్నీ సొంత కార్లే ఉన్నాయి. ఒక్కో వాహనం నెలకు సగటున 2,500 కిలోమీటర్లు తిరగాలి. ఇందుకు ప్రభుత్వం రూ.34,500 చెల్లిస్తుంది. సొంత కార్లను వాడుతూ అద్దె కార్లుగా పేర్కొంటూ నెలకు రూ.6.55 లక్షల వరకు బిల్లులు పొందుతున్నారు. తమ కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్‌తో ఉన్నవి తమ పర్యటనలకు అద్దెకు వాడుతున్నారు. కొందరు ఉద్యోగులైతే నిర్దేశించిన దూరం ప్రయాణించకుండానే పూర్తి బిల్లు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. అద్దె రిజిస్ట్రేషన్‌ ఉన్న కారు యజమానులు, డ్రైవర్ల సంతకాలతో బిల్లులు సృష్టించి సమర్పిస్తున్నారు.

కేంద్ర బృందం జులైలో జిల్లాలోని చందుర్తి, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటించింది. ఆయా మండలాల్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. వీరి వెంట ఉపాధి హామీలోని వివిధ విభాగాల అధికారులూ ఉన్నారు. మూడు రోజుల పర్యటనకుగాను వారి వాహనాలకు రూ.1.90 లక్షల బిల్లులను సమర్పించారు. వాస్తవానికి లక్ష రూపాయలు దాటితే కలెక్టర్‌ అనుమతి పొందాలి. కానీ అక్కడి వరకు వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఈ బిల్లులు మూడు భాగాలుగా చేశారు. విడతల వారీగా డ్రా చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు  అయిదేళ్ల లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కారును మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంది. కానీ తంగళ్లపల్లిలో ఓ అధికారి 2012లో రిజిస్ట్రేషన్‌ అయిన సొంత కారును వాడుతూ అద్దె బిల్లులు పొందుతున్నారు. ఇటీవల బిల్లుల చెల్లింపుల తీరుపై రాష్ట్ర అధికారుల తనిఖీ నివేదికలో ఈ విషయం బహిర్గతమైంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా వేరే అద్దెకారును సర్దుబాటు చేశారు. తర్వాత బిల్లులను ఈ కారుతో డ్రా చేసుకున్నట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధిలో విజిలెన్సు విభాగంలో పని చేసే ఓ అధికారి ప్రధానంగా సామాజిక తనిఖీలు జరిగినపుడు మాత్రం ఆయా మండలాల్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఈ విభాగంలో ఫారన్‌ సర్వీసుల్లో విశ్రాంత ఉద్యోగిని నియమించారు. నెలలో గరిష్ఠంగా పదిహేను రోజులకు మించి కార్యాలయానికి వచ్చిన దాఖలాల్లేవు. ఏపీడీలకు వాహనాలను గతంలోనే ప్రభుత్వం రద్దు చేసింది. కానీ జిల్లాలో నేటికీ సొంత వాహనాన్ని వాడుతూ బిల్లులు పొందుతున్నారు. ఐకేపీలోనూ ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోంది. ఇది ఆ శాఖ పరిధిలో జరిగే అంతర్గత వ్యవహారం. ఎవరైనా ఫిర్యాదు చేసినపుడు మాత్రం అక్కడికి మాత్రమే బిల్లులు సమర్పించిన తీరుపై మాత్రమే ఆడిటింగ్‌ జరుగుతుంది. వాహనాల వినియోగంపై భౌతిక విచారణ ఉండదు. ఈ కారణంతో ఏళ్ల తరబడి ఇదే తరహాలో సొంత కార్లను వినియోగిస్తూ నెలకు వేలల్లో డబ్బులు పొందుతున్నారు.

ఇలా చేస్తే మేలు...

దళిత బంధు పథకంలో లబ్ధిదారులు ఉపాధి అవకాశాలకు ఏ రంగాన్ని ఎంపిక చేసుకుంటే దానికే ప్రాధాన్యం ఇవ్వాలనే మార్గదర్శకాలున్నాయి. జిల్లాలో తొలి విడతలో చాలా మంది కార్లు తీసుకున్నారు. జిల్లా యూనిట్‌గా వీరందరికీ ఒక వేదిక కల్పించి,  ప్రభుత్వ శాఖల్లో అద్దె ప్రాతిపదికన వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలి. దీంతో ఆయా శాఖల్లో వాహనాల అద్దె సమస్య తీరడంతోపాటు నిధుల వినియోగంలో స్పష్టత ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి ఉపాధితోపాటు స్థిరమైన ఆదాయం కలిసిరానుంది.

ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తాం - స్వప్న, జిల్లా ఆడిట్‌ అధికారి

ప్రభుత్వ శాఖల్లో అంతర్గతంగా జరిగే ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వస్తే.. వాటిని కలెక్టర్‌ అనుమతితో పరిశీలిస్తాం. వాటిలోనూ బిల్లులు సమర్పించిన తీరు మాత్రమే పరిశీలిస్తాం. వాహనాలను పరిశీలించే అధికారం మాకు లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని