logo

అనిశాకే అంతు చిక్కడం లేదా?

అనిశా దాడి ఘటన జరిగి నెల రోజులు దాటగా, అధికారి నుంచి స్వాధీనం చేసుకున్న చరవాణులను ఇప్పటికీ తిరిగివ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆగస్టు 27న కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో....

Published : 29 Sep 2022 04:53 IST

నెల దాటినా తహసీల్దారు చరవాణుల సీజ్‌పై వీడని సందిగ్ధం


తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: అనిశా దాడి ఘటన జరిగి నెల రోజులు దాటగా, అధికారి నుంచి స్వాధీనం చేసుకున్న చరవాణులను ఇప్పటికీ తిరిగివ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆగస్టు 27న కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన రైతు రాపెల్లి సంతోష్‌ నుంచి రూ.7,500 తీసుకుంటూ ధరణి ఆపరేటర్‌ పోలు కుమారస్వామి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన సంగతి విదితమే. ఈ క్రమంలో అనిశా అధికారులు తహసీల్దారు అనుపమరావుకు చెందిన రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటివరకు వాటిని తిరిగి ఆమెకు సరెండర్‌ చేయలేదు. తహసీల్దారుతో పాటు అనుమానిత సిబ్బంది ఫోన్లు కూడా అనిశా అధికారులు స్వాధీనం చేసుకోగా ఇప్పటికీ ఎటూ తేల్చకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బలమైన ఆధారాల కోసమేనా!
జిల్లాలో మంథని(34), పెద్దపల్లి(30), ధర్మారం(29), సుల్తానాబాద్‌(27) తర్వాత అత్యధికంగా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 24 పంచాయతీలున్నాయి. గతంలో కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దారుగా పని చేసిన రాజవీరు, వెన్నంపల్లిలో వీఆర్వో రామారావు, పెద్దరాతుపల్లిలో ఫణీందర్‌రావు, రెవెన్యూ పరిశీలకుడు తిరుపతి, మల్యాల వీఆర్వో రమేష్‌, మీర్జంపేట వీఆర్వో కొంరయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా ఆవిర్భావం తర్వాత ఈ మండలం నుంచే ఎక్కువగా రెవెన్యూ ఉద్యోగులు అనిశాకు పట్టుబడుతుండటం గమనార్హం. ప్రతి ప్రజావాణిలో సైతం ఈ తహసీల్దార్‌ కార్యాలయంపైనే చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, భూస్వాములు, కౌలుదారుల మధ్య వివాదాలు, కబ్జాలు, రెవెన్యూ సమస్యలన్నీ ఎక్కువగా ఉండటం అధికారులకు కలసివస్తోంది. కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దారు కార్యాలయంలో పని చేసే కొందరు సిబ్బంది డబ్బులు ఇవ్వనిదే పనులు చేయడం లేదని గతంలోనూ అనిశాకు పలువురు ఫిర్యాదు చేశారు. కాగా ఒక మండల మెజిస్ట్రేట్‌కు సంబంధించిన రెండు ఫోన్లు సీజ్‌ చేసి నెల దాటగా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తుండటంతో బలమైన ఆధారాల కోసం అనిశా ఉచ్చు బిగిస్తుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని