logo

అనుమతుల్లేకుండా ఆసుపత్రుల నిర్వహణ

సిరిసిల్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి చెందింది. చికిత్స కోసం వచ్చిన గర్భిణికి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరీక్షను బట్టి శస్త్రచికిత్సలు చేయాలి. కాగా పైపై పరీక్షలతో అందిస్తున్న వైద్యం ప్రాణాల మీదకు తెచ్చింది.

Published : 03 Oct 2022 04:59 IST

వైద్యఆరోగ్యశాఖ తనిఖీల్లో బహిర్గతం
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల


ప్రైవేటు ఆసుపత్రిలో తనిఖీ చేస్తున్న వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది

సిరిసిల్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి చెందింది. చికిత్స కోసం వచ్చిన గర్భిణికి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరీక్షను బట్టి శస్త్రచికిత్సలు చేయాలి. కాగా పైపై పరీక్షలతో అందిస్తున్న వైద్యం ప్రాణాల మీదకు తెచ్చింది. వేములవాడలో అపెండిసైటీస్‌ ఆపరేషన్‌ వికటించడంతో యువకుడు వారం రోజులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవల్లో లోపాలతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనలు చేపట్టడంతో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విషయం బయటకు రాకుండా సద్దుమణిగేవి చాలా ఉంటాయి. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సేవలపై పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గత వారం వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లా అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. వీటిలో చాలా వరకు అనుమతిలేవి.. రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకోనివే ఎక్కువగా ఉన్నాయి.
జిల్లాలో ఏడాది నుంచి ప్రైవేటు ఆసుపత్రుల విస్తరణ పెరిగింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకే పరిమితమైన ఆసుపత్రులు ఇప్పుడు ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలకూ విస్తరించాయి. జిల్లా వ్యాప్తంగా 119 ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, పాలీక్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. అనధికారికంగా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాటిలో కనీస నిబంధనలు పాటించడం లేదు. వైద్యఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండానే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అలాంటి వాటిని కట్టడి చేసే విషయమై వైద్యఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వారం రోజులుగా ప్రతి ఆసుపత్రిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు పాటించని 25 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తున్నారు. 19 ఆసుపత్రులను అనుమతులు పొందకుండానే నడుపుతున్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల అర్హతలేని నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉండటం గమనార్హం. ఏవైనా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే మంటలార్పే వ్యవస్థ సైతం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే చికిత్సలు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో ధరల పట్టికలు సైతం ఏర్పాటు చేయడం లేదు.

అయిదు బృందాలతో తనిఖీలు..
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో మండల కేంద్రాల్లోని ఆసుపత్రులు, ల్యాబ్‌ల తనిఖీ లకు వైద్య ఆరోగ్యశాఖ అయిదు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో వైద్యఆరోగ్యశాఖ నుంచి ముగ్గురు అధికారులున్నారు. రిజిస్ట్రేషన్‌ లేనివాటికి... పాత రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసిన వాటికి నోటీసులు జారీ చేస్తున్నారు. నర్సింగ్‌ హోంలు, శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రులు బయోవ్యర్థాలను వేరు చేయడంలో నిబంధనలు పాటించకుంటే నోటీసులు జారీ చేస్తున్నారు. తనిఖీలు జరుగుతున్న తీరుపై జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావును ‘ఈనాడు’ సంప్రదించగా... అనుమతి లేకుండా ఆసుపత్రులను నిర్వహిస్తున్నవారు రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. తనిఖీల నివేదికను రోజువారీగా ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని