logo

దాహం తీరేదెలా?

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన పలు కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. మూడేళ్ల కిందట పంచాయతీల నుంచి నగరంలోకి వచ్చినా ఇబ్బందులు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయి.

Published : 28 Nov 2022 03:40 IST

విలీన కాలనీల్లో తాగునీటి సమస్య
శంకుస్థాపన చేసినా పత్తా లేని పనులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విద్యారణ్యపురి ప్రాంతం

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన పలు కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. మూడేళ్ల కిందట పంచాయతీల నుంచి నగరంలోకి వచ్చినా ఇబ్బందులు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయి. రూరల్‌ మిషన్‌ భగీరథ కింద చేపట్టిన పైపులైన్ల విస్తరణ పనులు, ట్యాంకుల నిర్మాణం నామమాత్రంగా మారగా, ప్రస్తుత జనాభా, ఇళ్లకు తగ్గట్లూ నీటి సరఫరా చేయకపోవడం, కనెక్షన్లు ఇచ్చినా నిరుపయోగంగా మారడంతో ఆయా ప్రాంతవాసులు నానావస్థలు పడుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నగర మేయర్‌ వై.సునీల్‌రావు భావించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.13 కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో మాత్రం నత్తనడకన సాగుతుండగా.. కొన్ని చోట్ల అసలే ప్రారంభించ లేదు.

బిందె నిండడానికి గంట

తీగలగుట్టపల్లి ప్రాంతంలోని సరస్వతీనగర్‌, విద్యారణ్యపురి ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నప్పటికీ బొట్టు నీరు రాదు. ఇక్కడ ఉన్న ట్యాంకు పంచాయతీ సమయంలో నిర్మించగా అదీ పేరుకే అన్నట్లుగా మారింది. దీనికి ఇన్‌, ఔట్‌ లెట్‌ కనెక్షన్లు ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఇతర ప్రాంతం నుంచి కొన్ని ప్రాంతాలకు సన్నని ధార వస్తుండగా ఒక బిందె నిండడానికి గంట సమయం పడుతుండటంతో ఆ ఒక బిందె నీరు ఏమూలకు సరిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఇళ్లలో ఉన్న బోరుబావులు ఎండిపోతుండగా జులై వరకు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్వే ట్రాక్‌ తర్వాత ఉన్న తీగలగుట్టపల్లి చంద్రపురి, కెఆర్‌ కాలనీ, రెడ్డిస్‌ కాలనీలు, ఎస్సీ కాలనీ, పాత వాడలకు పంచాయతీ హాయం నుంచి ఉన్న బావి నీరు, రూరల్‌ మిషన్‌ భగీరథ ద్వారా వచ్చే నీటిని కలిపి రోజుకు నాలుగు ట్యాంకులు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు కూడా ఆ ప్రాంతవాసులకు సరిపోవడం లేదు.  

విద్యారణ్యపురి రోడ్డు నం.3లో కనెక్షన్లు లేకుండా నిర్మించిన ట్యాంక్‌

11 నెలల కిందట శంకుస్థాపన

తీగలగుట్టపల్లిలోని పలు కాలనీలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఈ ఏడాది జనవరి 10న సరస్వతీనగర్‌లో రూ.1.30 కోట్లతో పైపులైన్లు వేసేందుకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు టెండర్లు అయి రెండేళ్లు దాటింది. మళ్లీ ఎండాకాలం ముంచుకొస్తుండగా పైపులైన్లు వేసి కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియని గందరగోళంలో స్థానికులు ఉన్నారు. విలీన కాలనీల్లో తాగునీరు మెరుగు పర్చడానికి కొత్తగా వేస్తున్న పైపులైను పనులు సీతారాంపూర్‌లో 50శాతం మాత్రమే పూర్తయ్యాయి. శుభం గార్డెన్‌, సూర్యనగర్‌ ప్రాంతానికి పైపులైను వేయాల్సి ఉంది. తీగలగుట్టపల్లిలో అసలే ప్రారంభించకపోగా, రేకుర్తిలో కొంత పైపులైను విస్తరణ చేపట్టారు.


కనెక్షన్లు ఇచ్చి మూడేళ్లు

ఇంటింటా నల్లా కనెక్షన్లు ఇచ్చి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అందుల్లోంచి నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. పైపులైన్లు వేస్తున్నామని అంటున్నారు. ఇప్పటికైతే కనిపించడం లేదు. సరస్వతీనగర్‌లో ఎండాకాలం వచ్చిందంటే బోర్లు అడుగంటిపోతాయి. నీళ్ల కోసం అవస్థలు పడాల్సిందే. నల్లా నీరు వచ్చేలా చూడాలి.

బి.సుగుణ, స్థానికురాలు


గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి

శంకుస్థాపనలు చేసిన తర్వాత పనులు ప్రారంభించడం లేదు. ఈ విషయాన్ని మేయర్‌, కమిషనర్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అదిగో, ఇదిగో, వారాల పేర్లు చెబుతూ గుత్తేదారు పనులు చేయకుండా దాటేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకొని పనులు ప్రారంభించాలి.

కొలగాని శ్రీనివాస్‌, కార్పొరేటర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని