logo

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటయ్యేనా..?

ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలందించేందుకు ప్రభుత్వపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్థానికంగా నిర్వహణ గాడి తప్పడంతో గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 24 Jan 2023 07:04 IST

గాడి తప్పిన నిర్వహణ
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి

ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలందించేందుకు ప్రభుత్వపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్థానికంగా నిర్వహణ గాడి తప్పడంతో గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి నిర్వహణలో కీలకపాత్ర పోషించాల్సిన సూపరింటెండెంట్ సేవలు నామమాత్రమే కాగా వైద్య కళాశాల నిర్వహణను పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్‌ ఆసుపత్రి నిర్వహణను చూస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ మార్పులు కనిపించడం లేదు. నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. జిల్లా కలెక్టర్‌ను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసినా ఇంతవరకూ పూర్తిస్థాయి కమిటీ నియామకం జరగడం లేదు. ఈ కారణంగా ఆస్పత్రిలో పర్యవేక్షణ ఏకపక్షంగా సాగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

ఆసుపత్రి నిర్వహణ పర్యవేక్షణలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం. స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి సమర్థులను సూపరింటెండెంÆట్గా నియమించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేసినప్పటికీ ఆశించిన పురోగతి లేదు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు కావాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో జిల్లా పరిషత్తు ఛైర్మన్‌, ఆసుపత్రి పరిధిలోకి వచ్చే ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్‌, ఎంపీలతో పాటు వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ ఏర్పాటు జరిగితే సభ్యులుగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థల ప్రతినిధులు ఆసుపత్రి నిర్వహణపై దృష్టి సారించే అవకాశముంది. ప్రాంతీయ ఆసుపత్రిగా ఉన్నప్పుడు జిల్లా ఆసుపత్రుల నిర్వహణ పర్యవేక్షకులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్పుడప్పుడూ సందర్శిస్తూ నిర్వహణపరమైన ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకున్నారు. కాగా సార్వజనిక ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులున్నా రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులే ప్రధాన దృష్టి సారించాల్సి ఉండడంతోనే ఆసుపత్రి నిర్వహణపై ఆశించిన పర్యవేక్షణ ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొరవడిన సమన్వయం...

దవాఖానా నిర్వహణను పర్యవేక్షించాల్సిన రెసిడెంÆÆట్ మెడికల్‌ అధికారుల్లో ఒకరిద్దరు పెద్దగా పట్టించుకోకపోగా ఒకరిద్దరు అత్యుత్సాహంతో కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వైద్య విధాన పరిషత్తునకు చెందిన సిబ్బందిపై వివక్షతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయా వర్గాల నుంచి ఆవేదనలు వినిపిస్తున్నాయి. తమను వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రులకు బదిలీ చేయాలంటూ ఇటీవల కొందరు ఉద్యోగులు జిల్లా స్థాయి అధికారులను వేడుకోవడం గమనార్హం. ఆసుపత్రి నిర్వహణతో ఏమాత్రం సంబంధం లేని ఓ ఒప్పంద కార్మికుడు నిర్వహణపై పెత్తనం చేస్తుండడం వారిని మరింత వేదనకు గురి చేస్తుంది. ఒప్పంద కార్మికుల నియామకంలో వసూళ్లపర్వం తెరపైకి రాగా విషయం పోలీసు స్టేషన్‌ వరకూ వెళ్లింది. కొన్ని విభాగాల్లో మందులతో పాటు ప్రయోగశాలల్లో అవసరమైన సామగ్రి, రసాయనాలు లేకపోవడంతో అత్యవసరమైతే తప్ప ఆయా పరీక్షలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒప్పంద విధానంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు సైతం ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులతో దురుసుగా వ్యవహరిస్తున్న సంఘటనలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని