logo

పరిశీలించండి.. పరిష్కరించండి

సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 215 దరఖాస్తులను...

Published : 28 Mar 2023 05:35 IST

ప్రజావాణికి 215 దరఖాస్తులు

అర్జీలను స్వీకరిస్తున్న అదనపు పాలనాధికారులు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగ్రవాల్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 215 దరఖాస్తులను అదనపు పాలనాధికారులు జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగ్రవాల్‌ స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను ఇస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ లెనిన్‌ వాత్సల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


లక్షల్లో పంచాయతీ బకాయిలు

ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు అందాల్సిన నిధులు ఇప్పించాలని జిల్లాలోని పలు గ్రామాల సర్పంచులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు తాగునీరు, సీసీ రోడ్లు, విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాలు తదితర పనులు చేశామన్నారు. ఒక్కో గ్రామానికి రావాల్సిన నిధుల బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం నుంచి అందేలా చూడాలని రామడుగు మండలం గోపాల్‌రావుపేట సర్పంచి కర్ర సత్యప్రసన్నరెడ్డితోపాటు జిల్లాలోని పలు మండలాల సర్పంచులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.


మీటరు మంజూరు చేయడం లేదు

భగత్‌నగర్‌లో ఇంటి నిర్మాణానికి టీఎస్‌బీపాస్‌ ద్వారా జనవరి 25 అధికారులు అనుమతిచ్చారని, ఇంటి నిర్మాణానికి విద్యుత్తు శాఖకు మీటరు కోసం దరఖాస్తు చేసుకున్నా.. మీటరు మంజూరు చేయడంలేదని రాజిరెడ్డి దంపతులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఫిర్యాదు చేశామన్నారు. పరిశీలించిన అదనపు కలెక్టర్‌ మీటరు మంజూరు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు.


ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ..

కొత్తపల్లి విత్తన గోదాంను వైద్య కళాశాలగా మార్చుతుండడంతో అందులో పని చేసే కార్మికులం ఉపాధి కోల్పోతున్నామని, నూతనంగా నిర్మిస్తున్న కళాశాలలో ఏదైనా ఉపాధి చూపించాలని 14 మంది విన్నవించుకున్నారు. విత్తన గోదాంలో వారికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు ఉండేవని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సరోజన, అరుణ, కోమల, రేణుక, జి.లావణ్య, బి.నర్మద, బి.రజని, మాధవి ఇతర కార్మికులు పాల్గొన్నారు.


ప్రభుత్వ భూమిని కాపాడాలని..

కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూరు శివారులో 26 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్థానికేతరుల పేర్లు ధరణిలో వస్తున్నాయని, వారి పేర్లను తొలగించి స్థానిక నిరుపేదలకు ఆ భూమిని కేటాయించాలని అమర్‌నాథ్‌ అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూ కుంభకోణంలో సంబంధిత అధికారులు, స్థిరాస్తి వ్యాపారులు కుమ్మక్కై భూమి కొట్టేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.


డీపీవోపై చర్యలు తీసుకోండి

కొత్తపల్లి మండలం ఎల్గందల్‌లో స్థానిక కారోబార్‌, మరికొంత మంది ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారని, విచారణలో అది నిజమని తేలినా డీపీవో చర్యలు తీసుకోవడంలేదని ఎల్గందల్‌ ఎంపీటీసీ సభ్యుడు, సుడా డైరెక్టర్‌ మంద రమేశ్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలను అమలు చేయని డీపీవోపై చర్యలు తీసుకోవాలన్నారు.


దాదాపు 2 గంటల నిరీక్షణ

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం గ్రామ పంచాయతీల పురస్కార కార్యక్రమం నిర్వహించడంతో ప్రజావాణి ఫిర్యాదుదారులంతా ఉదయం 11.45 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆలస్యంగా ప్రజావాణి ప్రారంభం కావడంతో దూర ప్రాంతాల నుంచి 10 గంటలకు వచ్చిన వారు నిరీక్షించాల్సి వచ్చింది. చెకింగ్‌ పాయింట్‌ నుంచి గుంపులుగా లోపలకు రావడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రజావాణి తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుందని అక్కడికి వచ్చిన ప్రజలు పేర్కొన్నారు.

శాఖల వారీగా ఇలా..
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం : 18
కరీంనగర్‌ గ్రామీణ తహసీల్దార్‌ : 47
తహసీల్దార్‌ మానకొండూర్‌ 14
ఆర్డీవో కార్యాలయానికి 4   నగర పాలక సంస్థ : 13
వారధి విభాగం : 8
ఇతర శాఖల నుంచి : 111 ఫిర్యాదులు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని