logo

ఫైరింగ్‌లో ఉత్తమం.. పదోన్నతిలో ప్రథమం

తుపాకీ గురి పెడితే...లక్ష్యం చేరుకోవాల్సిందే. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్‌సీసీ అధికారులకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటీవల నిర్వహించిన శిక్షణలో అందరికంటే ఫైరింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది గోదావరిఖని సెక్రెడ్‌ హార్ట్‌ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ సెకండ్‌ అధికారిణి జ్యోత్స్న.

Updated : 31 Mar 2023 06:38 IST

న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ

తుపాకీ శిక్షణ పొందుతున్న ఎన్‌సీసీ అధికారిణులు

తుపాకీ గురి పెడితే...లక్ష్యం చేరుకోవాల్సిందే. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్‌సీసీ అధికారులకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటీవల నిర్వహించిన శిక్షణలో అందరికంటే ఫైరింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది గోదావరిఖని సెక్రెడ్‌ హార్ట్‌ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ సెకండ్‌ అధికారిణి జ్యోత్స్న. ఆ ప్రతిభే ఆమెకు ఫస్ట్‌ ఆఫీసర్‌గా పదోన్నతి దక్కేలా చేసింది.

110మంది అధికారుల్లో..

జనవరి 30వ తేదీ నుంచి 20 రోజులపాటు గ్వాలియర్‌ ఎన్‌సీసీ ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ(వోటీఏ) నిర్వహించిన శిక్షణ శిబిరంలో 28 రాష్ట్రాల నుంచి 110 మంది ఎన్‌సీసీ అధికారుల్లో తెలంగాణ తరఫున జ్యోత్స్న పాల్గొన్నారు. మ్యాప్‌రీడింగ్‌, పాఠ్యాంశ బోధన, డ్రిల్‌ పరీక్ష, యోగా, ఫైరింగ్‌ విభాగంలో శిక్షణ పొందారు. అనంతరం ప్రతిభా పరీక్షల్లో ఫైరింగ్‌ విభాగంలో ఐదురౌండ్ల టార్గెట్‌ పూర్తి చేయడంతో ప్రథమస్థానం కైవసం చేసుకున్నారు.  మధ్యప్రదేశ్‌ ట్రైనింగ్‌ కమాండెంట్‌ బ్రిగేడియర్‌ శర్మ చేతుల మీదుగా ఎక్స్‌లెన్స్‌ ఫైరింగ్‌ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

ఎనిమిదేళ్ల క్రితం

సెక్రెడ్‌ హార్ట్‌ ఉన్నత పాఠశాలకు ఎనిమిదేళ్ల క్రితం ఎన్‌సీసీ శిక్షణ కేంద్రం నిర్వహణకు అనుమతి వచ్చింది. శిబిరానికి శిక్షకురాలిగా ఎంపికవ్వటం కోసం గ్వాలియర్‌ ఎన్‌సీసీ ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీలో మూడు నెలలు పాటు జ్యోత్స్న శిక్షణ పొందారు. ఏటా 8, 9వ తరగతి విద్యార్థుల్లో 50 మందిని ఎన్‌సీసీ క్యాడెట్లుగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. యేటా మూడు శిబిరాలు(సీఏటీసీ) కంబైన్డ్‌ అన్యువల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌ -1, 2, 3 లతో పాటు బెటాలియన్‌ యూనిట్‌ క్యాంపులు కరీంనగర్‌, సంగారెడ్డి, తిరుపతి, హైదరాబాద్‌లలో నిర్వహించే శిబిరాలకు విద్యార్థులు వెళుతున్నారు.

ప్రతి విద్యా సంవత్సరం యూనిట్‌ క్యాంపుల్లో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లను ఇంటర్‌ గ్రూపు కాంపిటీషన్‌(ఐజీసీ), ప్రీ రిపబ్లిక్‌ డే(పీఆర్‌డీ)వరకు సంసిద్ధం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసేలా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు రిపబ్లిక్‌ డే శిబిరానికి విద్యార్థులు జాహ్నవి, రిత్వికా, వైభవ్‌లు ఎంపికయ్యారు.

ప్రజలకు సేవ చేయాలనే తపన

జ్యోత్స్న, ఎన్‌సీసీ అధికారిణి

చిన్నప్పటి నుంచి యూనిఫాం దుస్తులతోనే ప్రజలకు సేవచేసే అవకాశం లభిస్తుందని చాలా శ్రమించినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించ లేకపోయా. దీంతో ఎన్‌సీసీ అధికారిణిగా శిక్షణ పొందాను. ఇప్పటి వరకు ఎంతోమందిని ఎన్‌సీసీ క్యాడెట్లుగా తీర్చిదిద్దా. ఇటీవల నిర్వహించిన శిక్షణలో ఫైరింగ్‌ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఎన్‌సీసీ రెండవ ఆఫీసర్‌ నుంచి ప్రథమ ఆఫీసర్‌గా పదోన్నతి లభించడం ఆనందంగా ఉంది. ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రతి అంశాన్ని వివరిస్తూ ప్రత్యేక శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో వారు ఉన్నతంగా రాణించే విధంగా మెలకువలు నేర్పుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని