logo

4017 ప్రవేశాలు.. రప్పిస్తే ప్రయోజనాలు

రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన బడిబాట ప్రత్యేక డ్రైవ్‌ శుక్రవారం ముగిసింది. ఈనెల 3 నుంచి 17 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ వరకు కొత్త ప్రవేశాల కోసం డ్రైవ్‌ను, 13 నుంచి 17 వరకు రోజు వారీగా కార్యక్రమాలను నిర్వహించేలా

Published : 10 Jun 2023 04:51 IST

జిల్లాలో ముగిసిన బడి బాట ప్రత్యేక డ్రైవ్‌

బాలల ప్రవేశాల నమోదుపై ప్రచారం చేస్తున్న గంగాధర మండలం ఓద్యారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం : రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన బడిబాట ప్రత్యేక డ్రైవ్‌ శుక్రవారం ముగిసింది. ఈనెల 3 నుంచి 17 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ వరకు కొత్త ప్రవేశాల కోసం డ్రైవ్‌ను, 13 నుంచి 17 వరకు రోజు వారీగా కార్యక్రమాలను నిర్వహించేలా రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు జిల్లా విద్యా శాఖకు అందించిన లెక్కల ప్రకారం విద్యార్థులు పాఠశాలలు ప్రారంభం కాగానే వస్తే కొంత మేర కళకళలాడనున్నాయి.

ఆపసోపాల మధ్య...

బడి బాటకు వంతుల వారీగా ఉపాధ్యాయుల హాజరవడం, కొన్ని చోట్ల ఇంకా సెలవుల్లోనే ఉండటం, మరి కొందరు కార్యక్రమానికి దూరంగా ఉండడం, విద్యాశాఖ కోరిన వివరాలను నమోదు చేయకపోవడం వంటివి జరిగాయి. జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో కూడా ఈ విషయాలు నిజమని తేలడంతో 268 పాఠశాలలకు డీఈవో తాఖీదులు జారీ చేయడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనే అపవాదు ఉపాధ్యాయుల్లో ఉంది. ఓ వైపు ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమం ముగిసినా కొన్ని పాఠశాలల్లో శుక్రవారం నాటికి కొందరు విధుల్లో చేరకుండా సెలవుల్లోనే ఉంటూ సొంత పనుల్లో నిమగ్నమయ్యారనే

రోపణలున్నాయి.

* 675 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో 4017 మంది బాలలు కొత్తగా ప్రవేశాలు నమోదు చేసుకున్నట్లు వివరాలు చెబుతున్నాయి.

* గత విద్యా సంవత్సరంలో కొత్తగా 2321 మంది బడిబాట ద్వారా ప్రవేశాలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సంఖ్య పెరిగింది.

* 1వ తరగతిలో మొత్తం 1812 మంది ప్రవేశాలు నమోదు చేసుకోగా వారిలో అంగన్‌వాడీల నుంచి వస్తున్న వారు 1250, ప్రైవేటు పాఠశాలల నుంచి వస్తున్న వారు 313, నేరుగా ప్రవేశాలు పొందుతున్న వారు 249 మంది ఉన్నారు.

* 2 నుంచి 12వ తరగతుల వరకు ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పేర్లు నమోదు చేసుకున్న వారు 2205 మంది ఉన్నారు.

* జిల్లా విద్యాశాఖ వివరాల ప్రకారం ప్రవేశాలు తీసుకున్న పాఠశాలల సంఖ్య 503గా పేర్కొంటున్నారు. వాస్తవానికి జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మిగిలిన పాఠశాలల్లో ప్రవేశాల సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అంకితభావంతో కృషి చేస్తేనే..

ఈసారి ప్రవేశాల నమోదు పెంచడం శుభపరిణామమే. వారిని బడులకు రప్పించడం ఉపాధ్యాయులకు ఓ పరీక్షగానే నిలవనుంది. ఇప్పటి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పాఠశాలలకు చేరకపోవడం, మరో వైపు ఉపాధ్యాయుల కొరత, విద్యావాలంటీర్ల నియామకాలు లేకపోవడం వంటివి ప్రవేశాలకు ప్రతిబంధకాలుగా మారనున్నాయి. ఉపాధ్యాయులు అంకితభావంతో బాలలను బడికి రప్పించుకునేలా కృషి చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని