logo

పఠనాలయం సద్వినియోగం... కల సాకారం

గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్‌ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్‌గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను

Published : 28 Mar 2024 05:19 IST

గోదావరిఖనిలోని శాఖా గ్రంథాలయం


గ్రూప్స్‌ లక్ష్యంగా

గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్‌ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్‌గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను. నాభర్త దుర్గం తిరుపతి కోరిక మేరకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. మొదటి సారి గ్రూప్స్‌, గురుకుల ఉద్యోగానికి పరీక్షలు రాశా. ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదు. దీంతో ప్రణాళిక రూపొందించుకుని గ్రంథాలయ సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సన్నద్ధమయ్యా. పోటీ పరీక్షల్లో విజయం సాధించి రెండు ఉద్యోగాలు సాధించా. ఇటీవల గ్రంథాలయంలో పుస్తకాలతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం సైతం కల్పించారు. అవసరమైన పుస్తకాలను గ్రంథపాలకురాలు భారతి అందజేయంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించా. గ్రూప్స్‌ లక్ష్యంగా ముందుకు సాగుతా.

 -కుమ్మరి సువర్ణ, గోదావరిఖని

 న్యూస్‌టుడే, జ్యోతినగర్‌ (మార్కండేయకాలనీ): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో అర్హులైన అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో నిర్వహించిన తెలంగాణ మైనార్టీ, మహాత్మా జ్యోతిబాఫులే, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో విడుదల చేసిన ఫలితాల్లో గోదావరిఖనికి చెందిన పలువురు విజయం సాధించారు. ఉద్యోగాలను సాధించాలన్న సంకల్పంతో నేటి యువత శిక్షణ కేంద్రాలకు వెళుతున్నారు. మరికొందరు సమీప గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీపట్టి కొలువులు పలువురు కొలువులు సాధించారు.


పఠనాలయమే ఉద్యోగ సోపానం   -తంగళ్లపల్లి శ్రీలక్ష్మి, గోదావరిఖని

తొలి ప్రయత్నంలోనే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీజీటీ సాంఘిశాస్త్రం ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యా. గోదావరిఖని శాఖా గ్రంథాలయ పుస్తకాలు నాకు చేదోడు వాదోడుగా నిలిచాయి. పోటీపరీక్షలకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో ఉండటంతో నిత్యం ఉదయాన్నే గ్రంథాలయానికి వెళ్లా. సందేహాలుంటే గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వైఫై సదుపాయంతో ఆన్‌లైన్‌లో నివృత్తి చేసుకుంటూ నిత్యం సాధన చేశా. చదువుకునేందుకు తల్లిదండ్రులు చాలా ప్రోత్సాహం అందిచారు. గ్రంథాలయానికి వచ్చే ప్రతి పాఠకులు సమయాన్ని వృథా చేయకుండా నిత్యం సాధన చేయాలి.


మూడు ఉద్యోగాలు సాధించా

ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పని చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఒకటిన్నర మార్కుల తేడాతో ఉద్యోగాలను కోల్పోయా. నిరుత్సాహానికి గురికాకుండా మళ్లీ సన్నద్థత ప్రారంభించా. గ్రంథాలయంలోని తెలుగు అకాడమీ పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వీటిని చదివే మహాత్మా జ్యోతిబాఫులే గురుకుల(టీజీటీ) గణితం, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో పీజీటీ, జేఎల్‌ గణితం ఉద్యోగాలు సాధించాను. నేటియువత ఎక్కడికో వెళ్లి కోచింగ్‌లు, అద్దె ఇళ్లలో నివాసం ఉండేందుకు వేలరూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీటికంటే స్థానికంగా ఉన్న గ్రంథాలయాలను వినియోగించుకొని ప్రణాళికతో సన్నద్ధం కావాలి.
-అడుప అనిల్‌కుమార్‌, గోదావరిఖని


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని