logo

వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా?

వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

Published : 04 May 2024 04:36 IST

మరమ్మతులు చేయించని అధికారులు
న్యూస్‌టుడే, వేములవాడ

వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వాహనం రాని రోజు స్థానికులు చెత్తను సమీపంలోని ఖాళీ స్థలాలు, రహదారులు పక్కన, మురుగు కాలువల్లో వేస్తున్నారు. దీంతో వార్డుల్లో పారిశుద్ధ్యం లోపిస్తుంది.

వేములవాడలో ట్రాక్టర్లు, ఆటోల ద్వారా రోజుకు దాదాపు 20 టన్నుల చెత్త, వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇందులో చాలా వరకు వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఆటోల టైర్లు, ఇంజిన్లు, ఇతరత్రా పాడవ్వడంతో ఇప్పటికే దాదాపు 8 ఆటోలు మూలకు చేరాయి. దీంతో ఉన్న ఆటోలు, ట్రాక్టర్లనే వార్డుల్లో తిప్పి అగ్రహారంలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. వాహనాల కొరత కారణంగా పట్టణంలో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తీవ్ర జాప్యంతో...

వాహనాలు మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా బాగు చేయించడంలో పురపాలక సంఘం  అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. పాడైన వాటిని మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో, సినారె కళామందిరం వద్ద, గ్యారేజీ తదితర ప్రాంతాల్లో పక్కన పెట్టారు. నెలల తరబడి వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వాహనాల కొరత ఏర్పడి పట్టణంలో చెత్త సేకరణపై ప్రభావం చూపుతోంది. అయినా అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

డంపింగ్‌ యార్డులుగా ఖాళీ స్థలాలు

మున్సిపల్‌ అధికారుల అలసత్వం కారణంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు డంపింగ్‌ యార్డులుగా మారుతున్నాయి. వార్డుల్లోకి వాహనాలు రాకపోవడంతో స్థానికులు ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం వేస్తున్నారు. పట్టణంలోని బైపాస్‌ రోడ్డు ప్రాంతాలు, వీఐపీ రోడ్డు చెరువు వైపు పోస్తున్నారు. కొందరు కోళ్ల వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని బైపాస్‌ రోడ్ల చివరి ప్రాంతాల్లో వేస్తుండటంతో పారిశుద్ధ్యం లోపించడంతో పాటు దుర్వాసన వస్తోంది. ఇలాంటి ప్రాంతాల్లో పోయకుండా కట్టడి చేయాల్సిన మున్సిపల్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోతుంది. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి వాహనాలకు మరమ్మతులు చేయించి వార్డుల్లో పూర్తిస్థాయిలో తిప్పాలని పట్టణవాసులు కోరుతున్నారు.


పూర్తి స్థాయిలో సేకరణకు చర్యలు

- కిరణ్‌కుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వేములవాడ

పట్టణంలో పూర్తి స్థాయిలో చెత్త, వ్యర్థాల సేకరణ జరుగుతోంది. కొన్ని ఆటోలకు చిన్న చిన్న మరమ్మతులున్నాయి. వారం రోజుల్లో చేయిస్తాం. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని ముమ్మరంగా ప్రచారం కల్పిస్తున్నాం. అయినా కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి జరిమానా వేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని