logo
Published : 20 May 2022 02:13 IST

తక్షణమే కాలువల ఆధునికీకరణ

రూ.1600 కోట్లతో పనులు

సర్వజ్ఞనగర : మహిళల గోడు ఆలకిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

మల్లేశ్వరం, యశ్వంతపుర, న్యూస్‌టుడే : ఉద్యాననగరిలో వర్షం నీటితో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో రూ.1,600 కోట్లతో వాన నీటి కాలువలను ఆధునికీకరణ చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. నగరంలో ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, విపక్ష నేతలతో ఇప్పటికే ఒకసారి సమావేశమై, కాలువల మరమ్మతు, పూడికతీతకు చర్యలు చేపట్టాలని తీర్మానించామని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసేందుకు రాష్ట్ర పద్దులో దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. డీపీఆర్‌ తయారు కాగానే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. వర్షంతో సమస్యలు ఎదురైన ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులు, మంత్రులు అశోక్‌, గోపాలయ్య, సోమణ్ణ, ఎమ్మెల్యే జార్జ్‌ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి బొమ్మై పర్యటించారు. వర్షం నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశలో మంత్రుల, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మురుగు నీరు, వర్షం నీటి కాలువల మరమ్మతులకు రూ.400 కోట్లు ఖర్చు వస్తుందని అంచనా వేశామని తెలిపారు. హెచ్‌బీఆర్‌ లేఅవుట్‌లో రాజకాలువలో 2.5 కిలోమీటర్ల పొడవునా పూడిక తీతకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్య తీవ్రత ఉన్న చోట్ల మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాల సామర్థ్యాన్ని 40 ఎంఎల్‌డీకి వృద్ధి చేయాలని బెంగళూరు పాలికె అధికారులకు సూచించామని తెలిపారు. గత అర్ధ శతాబ్ద కాలంలో ఎప్పుడూ ఎరుగని రీతిలో నగరంలో వర్షం కురవడంతోనే సమస్య తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. హెబ్బాళ ఎస్‌టీపీలో 100 ఎంఎల్‌డీ స్థాయి నీటి శుద్ధీకరణ కేంద్ర పనులు నడుస్తుండగా.. మరో 60 ఎంఎల్‌డీ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. కేఆర్‌పురం వార్డులో రైల్వే వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్లలోకి నీరు ప్రవేశించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు రూ.25 వేల తక్షణ పరిహారాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. బెంగళూరులో 110 గ్రామాలు, పురసభలు, నగర సభలు చేరడంతో విస్తీర్ణం ఒకే సారి పెరగడం, దానికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేయడంలో జరిగిన జాప్యంతోనే ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.

సర్వజ్ఞనగర : రాజకాలువ సమస్యను బొమ్మైకు వివరిస్తున్న కాంగ్రెస్‌ నేత కె.జె.జార్జి

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని