logo

విహంగాల పాలిట ఆపద్బాంధవుడు

ఆయన నిజంగానే గాయపడిన పక్షుల పాలిట ఆపద్బాంధవుడే...వేలాది పక్షులకు ఆయన శుశ్రూష చేసి గాయాల్ని నయం చేశారు. ఎక్కడ పక్షి  దెబ్బలతో విలవిల్లాడుతోందని సమాచారం అందినా క్షణాల్లో స్వచ్ఛంద సేవకులు అక్కడ ప్రత్యక్షమై వాటిని ప్రగతి ప్రతిష్ఠాన ఆధ్వర్యంలోని పక్షుల ఆసుపత్రికి తీసుకొస్తారు. ఒకసారి ఆయన చేతుల్లోకి చేరిందంటే ఇక ఆ పక్షి ప్రమాదం నుంచి గట్టెక్కినాననే ధీమాతో ఉంటుందంటే

Published : 27 Jun 2022 02:47 IST

అజయ్‌ జైన్‌ చేతిలో సేదతీరుతున్న బుజ్జి పక్షి

మైసూరు, న్యూస్‌టుడే: ఆయన నిజంగానే గాయపడిన పక్షుల పాలిట ఆపద్బాంధవుడే...వేలాది పక్షులకు ఆయన శుశ్రూష చేసి గాయాల్ని నయం చేశారు. ఎక్కడ పక్షి  దెబ్బలతో విలవిల్లాడుతోందని సమాచారం అందినా క్షణాల్లో స్వచ్ఛంద సేవకులు అక్కడ ప్రత్యక్షమై వాటిని ప్రగతి ప్రతిష్ఠాన ఆధ్వర్యంలోని పక్షుల ఆసుపత్రికి తీసుకొస్తారు. ఒకసారి ఆయన చేతుల్లోకి చేరిందంటే ఇక ఆ పక్షి ప్రమాదం నుంచి గట్టెక్కినాననే ధీమాతో ఉంటుందంటే అతిశయోక్తికాదు. నగరానికి చెందిన అజయ్‌ జైన్‌ అనే మంచి మనిషికి పక్షులంటే అమితమైన ప్రేమ. ఒకసారి దెబ్బతిన్న పక్షికి తగిన చికిత్స లభించడంలో ఎదురైన కష్టాలే ఆయనను పక్షుల కోసమే ప్రత్యేక ఆసుపత్రిని నెలకొల్పేందుకు ప్రేరేపించిందంటారు. కొన్నేళ్ల క్రితం కృష్ణరాజ సాగర జలాశయం దిగువన ఉన్న బృందావన్‌ గార్డెన్స్‌లో బలమైన ఈదురుగాలుల కారణంగా అక్కడి పక్షుల కేంద్రం ధ్వంసమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంలో చెట్లు నేలకొరగడం, షెడ్లు కూలడంతో వందలాది పక్షులు మృత్యువాతపడ్డాయి. అంతే సంఖ్యలో పక్షులు (ఎక్కువగా కొంగ జాతి) క్షతగాత్రులుగా మారాయి. విషయాన్ని తెలుసుకున్న అజయ్‌ జైన్‌ హుటాహుటిన అక్కడకు చేరుకుని వాటిని సంరక్షించారు. తగిన చికిత్సను అందించడంతో త్వరలోనే అవి కోలుకున్నాయి. ఇలాంటి సంఘటనలు అజయ్‌ జైన్‌ జీవితంలో బోలెడన్ని ఎదురయ్యాయని అంటారు. సాధారణంగా అనేక పక్షులు విద్యుత్తు తీగలు తగలడం వల్ల తీవ్ర గాయాలతో కిందపడుతుంటాయి. అనేక సందర్భాల్లో ఉడుతలకూ ఇదే దుస్థితి. ఇలాంటివన్నీ అజయ్‌ జైన్‌ చెంతకు చేరుతంటాయి. స్వతహాగా పశువైద్యుడు కానప్పటికీ మంచి మనసున్న మనిషిగా ప్రముఖ పశువైద్యుల వద్ద చికిత్సా పద్ధతుల్ని నేర్చుకుని ఇప్పుడు అత్యాధునిక వైద్య సేవల్ని వాటికోసమే అందిస్తున్నారు. మహా మానవతావాదిగా పేరుతెచ్చుకున్న అజయ్‌కి అనేక పురస్కారాలు లభించాయి.

  

గాయాలైన రామచిలుకను చికిత్స కోసం తీసుకొచ్చారు

నాకూ చికిత్స కావాలంటున్న ఉడుత పిల్ల
 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని