logo
Published : 08 Aug 2022 01:45 IST

బెంగళూరుపై నిర్లక్ష్య మేఘం

వానలంటే నగరవాసి గుండెల్లో గుబులే
కలగానే మౌలిక వసతుల కల్పన

సమాంతర మురుగు కాల్వలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి

ఈనాడు, బెంగళూరు: బెంగళూరు ఇప్పుడు వానలంటే హడలెత్తే పరిస్థితి. మేఘావృతమైతే చాలు నగరవాసి బెంబేలెత్తుతున్నాడు.. నగరంలో మౌలిక సదుపాయాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలకు కొదవే లేదు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నగర సదుపాయాలను సాకుగా చేసుకుని రాజకీయ విమర్శలు దిగిన సందర్భాలెన్నో. ఇన్ని విమర్శలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీల తీరుపై నగరవాసులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. గత మే నెల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగర మురుగునీటి వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పరంపర కొనసాగుతోంది. ఆగస్టు 1 నుంచి 5 వరకు నగరంలో కురిసిన వర్షాలతో మరోమారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏటేటా వర్షాలకు మురుగు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని తెలిసినా బీబీఎంపీ ఏమాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బెంగళూరు రెయిన్స్‌ అట్‌ బీబీఎంపీకామ్‌’ ట్యాగ్‌లైన్‌తో నెటిజెన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఆ హామీలేమైనట్లు?

నగర మురుగు కాలువల మరమ్మతులు, మురుగు ప్రవాహ సామర్థ్యం (ఎంఎల్‌డీ)ను పెంచేందుకు బీబీఎంపీ కోట్లాది రూపాయలు అట్టిపెడుతోంది. వాస్తవానికి బెంగళూరులో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మురుగు నీటి వ్యవస్థ సామార్థ్యానికి మించిన మురుగు నీరు, వ్యర్థం వర్షాకాలంలో తయారవుతోంది. వృషభావతి కాల్వలో పేరుకున్న కాలుష్య, చెరువుల ఆక్రమణల కారణంగా నగరంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ద్వితీయ, తృతీయ మరుగు కాల్వలను ఏర్పాటు చేయాలని బీబీఎంపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు గత మే నెలలో ముఖ్యమంత్రి బొమ్మై కూడా రూ.1,600 కోట్లను విడుదల చేశారు. ఇందులో రూ.400 కోట్లను ద్వితీయ, తృతీయ కాల్వల వ్యవస్థకు ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. ఆగస్టు నాటికి ఆ తాలూకా ప్రాథమిక స్థాయి పనులు కూడా మొదలు కాలేదన్న ఆరోపణలు నగరానికి చెందిన సివిక్‌ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

బెళ్లందూరు వద్ద పూడికను తొలగిస్తున్న క్రేన్లు

అటకెక్కిన 800 కి.మీ.ల ప్రణాళిక

బెంగళూరు నగర పరిధిలో 800 కి.మీ.ల వరకు ద్వితీయ మురుగు నీటి వ్యవస్థ, వ్యర్థాన్ని తొలగింపు (ఎస్‌టీపీ) పనులు చేపట్టేందుకు రూ.83 కోట్లను బీబీఎంపీ విడుదల చేసింది. హెబ్బాళ, మహాలక్ష్మి లేఅవుట్‌, బెళ్లందూరు పరిసరాల్లో ఈ పనులు మొదలైనా దాదాపు 15 రోజుల తర్వాత ఈ పనులు నిలిచిపోయాయి. మే నెలల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ పనులు నిలిచిపోయినట్లు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు కేటాయించి ఏడాది ముగిసినా వాటి పనులు మొదలైంది గత మే నెలలో అంటూ బీప్యాక్‌ సంస్థ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మురుగు నీటి వ్యవస్థ సామర్థ్యాన్ని 60 ఎంఎల్‌డీ నుంచి 100 ఎంఎల్‌డీకి పెంచాలన్న నిర్ణయం కూడా అమలుకు నోచుకోలేదని వీరి వాదన. ఈ పనుల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని కేఆర్‌ పురం, సి.వి.రామన్‌ నగర్‌, సర్జాపుర రహదారి, మహాలక్ష్మి లేఅవుట్‌, మారతహళ్లి, మహదేవపుర, హెబ్బాళ పరిసరాల్లో వాననీరు ఇళ్ల సముదాయాల్లోకి వచ్చి చేరుతోందని బెంగళూరు రెయిన్స్‌ అడ్మిన్లు ఆరోపిస్తున్నారు.

మరో వారం రోజులు

బెంగళూరు నగరంలో మార్చి నుంచి ఆగస్టు 5 నాటికి కురిసిన వర్షాలు ఏడాది వర్షపాతాన్ని మించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి అక్టోబరు, నవంబరులో కురిసే వర్షాలతో కలిపి ఏడాదిలో 1,500 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టు 5 నాటికి బెంగళూరులో 946 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. గతేడాది 1,500 మి.మీ, 2020లో 1,200 మి.మీ, 2019లో 900 మి.మీ వార్షిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 950 మి.మీల నమోదవటంతో త్వరలో వార్షిక వర్షపాతం సగటును మించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఆగస్టులోనే గత ఐదేళ్లలో కురవనంత వర్షం ఈ ఏడాది కురిసింది. ఆగస్టు 4 నాటికి 65 మి.మీల వర్షపాతం నమోదు కాగా, 2017లోనే అత్యధికంగా 128.7 మి.మీల అత్యధికంగా నమోదైంది. ఇంకా వర్షాలు కొనసాగుతుండటంతో ఈ రికార్డును కూడా ఛేదించే అవకాశం ఉంది.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని