logo

అర్ధరాత్రి బియ్యం వ్యాపారి దారుణహత్య

బళ్లారి నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మంజు అలియాస్‌ కుంటె మంజునాథ(42)గా గుర్తించారు. ఎస్పీ సైదులు అడావత్‌ నేతృత్వంలో నగర డీఎస్పీ శేఖరప్ప, సీఐ వాసుకుమార్‌ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమేరాల దృశ్యాలను స్వాధీనం చేసుకొని గాలింపు ప్రారంభించారు.

Published : 29 Sep 2022 02:20 IST

కుంటె మంజునాథ (పాతచిత్రం)

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మంజు అలియాస్‌ కుంటె మంజునాథ(42)గా గుర్తించారు. ఎస్పీ సైదులు అడావత్‌ నేతృత్వంలో నగర డీఎస్పీ శేఖరప్ప, సీఐ వాసుకుమార్‌ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమేరాల దృశ్యాలను స్వాధీనం చేసుకొని గాలింపు ప్రారంభించారు. నగరంలోని చంద్రకాలనీలో నివాసముంటున్న కుంటె మంజునాథ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ద్విచక్రవాహనంపై హెచ్‌.ఆర్‌.గవియప్ప కూడలి నుంచి కౌల్‌బజార్‌ మొదటి గేటు మీదుగా రేడియోపార్క్‌ (డైట్‌ కళాశాల) దాటగానే అప్పటి వరకు వెంబడించిన ఇద్దరు వ్యక్తులు అతనిపై వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. ఇళ్లలోకి కారం పొడి పడటంతో అక్కడే బైకును విడిచి మంజునాథ పరుగులు తీశాడు. ఇద్దరు వ్యక్తులు వెంబడించి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో అతని తలపై నరకగా అక్కడే కూలిపోయాడు. రక్తపు మడుగులో మంజునాథ పడిపోవడంతో దుండగులు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కౌల్‌బజార్‌ సీఐ వాసుకుమార్‌ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విమ్స్‌కు తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌల్‌బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

సీసీఫుటేజీ  స్వాధీనం
మంజునాథ హత్య దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమేరాల్లో నిక్షిప్తమయ్యాయి. సుమారు 1.30 నుంచి 2.30 గంటల మధ్య కుంటె మంజునాథ హత్యకు గురైనట్లు అందులో సమయం నమోదైంది. సీసీకెమేరాల్లో దృశ్యాలను చూస్తే దుండగుల నుంచి మంజునాథ తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఓ వ్యక్తి వెంబడించినా దీటుగా ఎదుర్కొన్నాడు. ఓ నిమిషం పాటు ఇద్దరి నడుమ పెనుగులాట జరిగింది. ఇంతలో మరో వ్యక్తి రావడంతో ఇద్దరు కలిసి మంజునాథను రోడ్డుపై పడేసి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో నరికి అతను చనిపోయినట్లు నిర్ధారించుకొని వెళ్లిపోయిన దృశ్యాలు సీసీకెమేరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఎవరీ కంటె మంజునాథ
బళ్లారి నగరం వరబసప్ప గుడి ప్రాంతానికి చెందిన కుంటె మంజునాథ ఈ మధ్య కాలంలో స్థానిక టి.బి.శ్యానిటోరియం రహదారిలోని చంద్ర కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చౌకదుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి, వాటిని రాత్రికిరాత్రే లారీల్లో లోడింగ్‌ చేసి వేర్వేరు ప్రాంతాలకు ఎగుమతి చేసేవాడని సమాచారం. మంగళవారం రాత్రి కూడలి వరబసప్ప గుడి ప్రాంతంలో కూడా ఓ లారీలో చౌకబియ్యం పంపి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రేడియోపార్‌్్కలో హత్యకు గురయ్యాడు. మంజునాథ బియ్యం వ్యాపారంతో పాటు, మట్కా, స్థిరాస్తి వ్యాపారంలోకి కూడా దిగాడు. ఇతనిపై అక్రమ బియ్యం తరలింపు,  ఇతర ఎనిమిది కేసులు ఉన్నాయి. గతంలో ఇతనిపై రెండుసార్లు హత్యాయత్నం చేశారు. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బియ్యం వ్యాపారం చేస్తున్న వారి మధ్య విభేదాలు రావడంతో ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాని ఆధారంతో బళ్లారి నగరంలో అక్రమంగా బియ్యం వ్యాపారస్తులు వారితో పాటు, కుంటె మంజునాథతో పరిచయం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశంలో   విచారిస్తున్నారు.

మంజునాథపై కేసులు ఉన్నాయి-ఎస్పీ సైదులు అడావత్‌
హత్యకు గురైన కుంటె మంజునాథపై గతంలో పలు కేసులు ఉన్నాయి. బియ్యం వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. హతుడి సోదరుడు అశోక్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌల్‌బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ శేఖరప్ప, నేతృత్వంలో సీఐ వాసుకుమార్‌ తదితర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సైదులు అడావత్‌ తెలిపారు. మట్కా కేసులు కూడా ఉన్నాయి. సీసీకెమేరా దృశ్యాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే హంతకులను అరెస్టు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని