logo

రాహుల్‌ రంగప్రవేశం

ఇప్పటికే దావణగెరెలో సిద్ధరామయోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్‌ మరో భారీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలో ప్రవేశించే ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ ‘భారత ఐక్యతా యాత్ర’ (భారత్‌ జోడో యాత్ర) రానున్న 21 రోజులు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనుంది.

Published : 30 Sep 2022 02:49 IST

నేడే గుండ్లుపేటలో యాత్ర

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం

ఈనాడు, బెంగళూరు : ఇప్పటికే దావణగెరెలో సిద్ధరామయోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్‌ మరో భారీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలో ప్రవేశించే ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ ‘భారత ఐక్యతా యాత్ర’ (భారత్‌ జోడో యాత్ర) రానున్న 21 రోజులు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనుంది. తమిళనాడు, కేరళలో ఇప్పటికే 22 రోజుల యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్‌.. రాష్ట్రంలో 500కుపైగా కిలోమీటర్ల పాటు ముందుకు సాగనున్నారు. ఈ యాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనుండగా- అధికార పక్షం ఈ యాత్ర ప్రభావాన్ని లెక్కించే పనిలో ఉంది.

రాహుల్‌ రాక నేపథ్యంలో గుండ్లుపేటలో స్వాగత ద్వారం ఏర్పాటు

రాష్ట్రం.. కీలకం
సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన రాహుల్‌ యాత్ర 12 రాష్ట్రాల మీదుగా కశ్మీరులో ముగుస్తుంది. ఈ రాష్ట్రాలన్నింటిలో కర్ణాటక ఆ పార్టీకి ఎంతో కీలకం. మరో ఆరు నెలల్లో నిర్వహించే విధానసభ ఎన్నికల నేపథ్యంలో ఈ యాత్రను విజయవంతం చేయటం కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కాస్త బలంగా ఉన్న కాంగ్రెస్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుకొనేందుకు యత్నిస్తోంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తలను రాబట్టిన సిద్ధరామోత్సవానికి మించి జోడో యాత్రను విజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రయత్నిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలాతో పాటు కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్‌ ఈ యాత్రలో పాల్గొంటారు. రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ సత్తా చాటడానికి ముందుకు కదలుతున్నారు.

‘పే సీఎం’ ఉత్సాహంతో..
కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమం సృష్టించిన ‘పే సీఎం’ ప్రచారం భాజపాకు దాదాపు చెమటలు పట్టించింది. జాతీయ స్థాయిలో అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ ప్రచారం కాంగ్రెస్‌ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపింది. ఓ వైపు అధికారపక్షం ఈ ప్రచార బాధ్యులను విచారించి అదుపులో తీసుకునే పనిలో ఉన్నా కాంగ్రెస్‌ ఏమాత్రం జంకలేదు. ఈ ఉత్సాహంలో సామాజిక మాధ్యమ విభాగాన్ని ఇంకాస్త బలోపేతం చేసేందుకు యువకులైన సాంకేతిక నిపుణులను నియమించుకుంది. యువనేత ప్రియాంక్‌ ఖర్గే నేతృత్వంలోని ఈ విభాగం రానున్న రోజుల్లో మరిన్ని ప్రచారాలతో అధికార పక్షానికి సవాలు విసరనుంది. రాష్ట్రంలో ‘40 శాతం అవినీతి’ పేరిట కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారం అధికార పక్షానికి మింగుడుపడని అంశం.

అధిష్ఠానం సూచనలతో..
దావణగెరెలో సిద్ధరామోత్సవం సాధించిన విజయం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి పలు సవాళ్లను ముందుంచింది. ఈ కార్యక్రమంపై అధిష్ఠానం ప్రత్యేక నివేదిక కూడా తెప్పించుకుని రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించింది. తాజా ‘పే సీఎం’ ప్రచారం జాతీయ స్థాయిలో కలకలం రేపడంతో అధిష్ఠానం బొమ్మై సర్కారుపై నిప్పులు చెరిగినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమైన బొమ్మై.. పార్టీని, నాయకత్వాన్ని బలోపేతం చేయటం, కాంగ్రెస్‌ చేసిన ‘పే సీఎం’ ప్రచారానికి దీటైన ప్రచారాన్ని చేపట్టకపోవటంపై అధిష్ఠానం గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ప్రతిపక్షం చేసిన ప్రచారంలో వాస్తవాలెలా ఉన్నా ‘40 శాతం కమీషన్‌’ అంశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేదిగా పరిణమించినట్లు జాతీయ స్థాయిలో సమీక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మొదలైన కాంగ్రెస్‌ భారత్‌ ఐక్యతా యాత్రపైనా దృష్టి సారించాలని రాష్ట్ర నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించారు. గుండ్లుపేట జాతీయ రహదారిలో యాత్ర తాలూకు ఫ్లెక్సీలను చించివేసిన సంఘటన పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉండరాదని బొమ్మై పార్టీ నేతలకు సూచించారు.

గుండ్లుపేటలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తదితరులు


యాత్రకు ‘స్వరాజ్‌’మద్దతు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : దక్షిణం నుంచి ఉత్తర భారతదేశానికి కర్ణాటక, సాహిత్య, సంస్కృతిని పరిచయం చేయాలని స్వరాజ్‌ ఇండియా వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. ఇదే నేపథ్యంలో రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఆయన శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో అధికార పార్టీ ద్వేష రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజల మధ్య చీలికలను తీసుకు వస్తోందని ఆరోపించారు. కర్ణాటక నుంచి జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్న గిరీశ్‌ కర్నాడ్‌, అనంతమూర్తి, కువెంపు, దారా బేంద్రే తదితరుల అనువాద రచనలతో పాటు దళిత సాహితీవేత్తలు డి.ఆర్‌.నాగరాజ్‌, దేవనూరు మహదేవ రచనలను తాను చదివానని చెప్పారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను రాహుల్‌గాంధీ దిల్లీ వరకు తీసుకెళ్లాలని సూచించారు.


పాపాల శిశివు.. భాజపా

సిద్ధరామయ్య

మైసూరు, న్యూస్‌టుడే : పీఎఫ్‌ఐ.. కాంగ్రెస్‌ పార్టీ పెంచి పోషించిన బిడ్డ అయితే- ఆర్‌ఎస్‌ఎస్‌ పాపాల శిశువే భాజపా అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. భాజపా నాయకులు ఒకే అబద్దాన్ని వందలసార్లు చెప్పి, దాన్ని నిజమని భ్రమింపజేస్తారని ఎద్దేవా చేశారు. మైసూరులో గురువారం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా జాగృతి కల్పించేందుకు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శుక్రవారం గుండ్లుపేటకు చేరుకుంటోందని తెలిపారు. అక్కడి నుంచి నంజనగూడు మార్గంలో కడకోళలో భోజనం చేసి, బండీపాళ్య వద్ద బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడతారని వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన మైసూరులో బస చేస్తారని చెప్పారు. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ రెండూ భాజపాకు బీటీమ్‌గా వ్యవహరిస్తున్నాయని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ యతీంద్ర సిద్ధరామయ్య ఆరోపించారు. భాజపా అధికారంలో ఉన్నచోట మత ఘర్షణలు, ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నింటారని విమర్శించారు. గుండ్లుపేటలో భారత్‌ జోడో యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను చించివేయడం వెనుక భాజపా కార్యకర్తల పాత్ర ఉందన్నారు. యాత్రకు లభిస్తున్న ప్రజాదరణను ఓర్వలేక ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని