logo

కాంగ్రెస్‌.. కదన కుతూహలం!

భాజపా విధానాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నాయంటూ నినదిస్తూ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. కేరళ సరిహద్దులు దాటుకుని చామరాజనగరలో అడుగుపెట్టిన ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్ర 23వ రోజున ఊటీ- కాలికట్‌ కూడలి ద్వారా కర్ణాటకలో ప్రవేశించింది.

Updated : 01 Oct 2022 02:34 IST

రాహుల్‌కు డీకే సత్కారం

ఈనాడు, బెంగళూరు : భాజపా విధానాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నాయంటూ నినదిస్తూ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. కేరళ సరిహద్దులు దాటుకుని చామరాజనగరలో అడుగుపెట్టిన ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్ర 23వ రోజున ఊటీ- కాలికట్‌ కూడలి ద్వారా కర్ణాటకలో ప్రవేశించింది. విపక్ష నేత సిద్ధరామయ్య, సీనియర్‌ నేతలు ఆర్‌.వి.దేశ్‌పాండే, కేజే జార్జ్‌ తదితరులు రాహుల్‌గాంధీని రాష్ట్రంలోనికి స్వాగతించారు. గుండ్లుపేటలోని బెండగల్లి గ్రామంలో సాగిన ఈయాత్ర రానున్న 21 రోజుల పాటు రాష్ట్రంలో 511 కి.మీ.లు సాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగిన యాత్ర.. ఆపై స్వల్ప విరామం తర్వాత సాయంత్రం 7 వరకు కొనసాగింది. గుండ్లుపేట తాలూకాలోని బేగూరులో రాహుల్‌గాంధీ బస చేస్తారు. శనివారం ఉదయం 6:30 గంటల నుంచి తొండెవాడి గేట్‌ నుంచి మళ్లీ యాత్ర ప్రారంభం అవుతుంది.

అంతటా అవినీతి..
ఏమాత్రం తగ్గని నిత్యావసర ధరలు, యువతకు ఉపాధి కొరత, రైతులకు అందని భరోసా వంటివి కొనసాగుతున్నా కేంద్రం ఆర్‌ఎస్‌ఎస్‌ సూచనలతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ధ్వజమెత్తారు. ఈ యాత్రలో రాహుల్‌తో కలిసి అడుగులు వేసిన ప్రతి ఒక్కరూ మార్పునకు నాందీ పలికారన్నారు. రాష్ట్రంలో 40 శాతం అవినీతి రాజ్యమేలుతుండగా.. ప్రజల కొనుగోలు శక్తి అడుగంటి పోయిందని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపించారు. సోనియాగాంధీకి మూడు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అధికారాన్ని అందుకోలేదని గుర్తు చేశారు. నేడు అధికారమే లక్ష్యంగా భాజపా దేశాన్ని విభజిస్తోందన్నారు. ఈ యాత్రతో దేశాన్ని ఒకే తాటిపై తెచ్చేందుకు యజ్ఞాన్ని చేపడుతున్న రాహుల్‌ గాంధీకి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గుండ్లుపేట నుంచి మైసూరు వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ‘భారత్‌ జోడో’ యాత్ర

ప్రజాస్వామ్యానికి ముప్పు
భాజపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలో మత రాజకీయాలు, జాతి విద్వేషాలు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయని సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ మత విద్వేషాలపై విసుగెత్తిన రాహుల్‌.. యాత్రకు శ్రీకారం చుట్టారని ప్రకటించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, అల్ప సంఖ్యాకులు, రైతులు, మహిళలు ఆందోళనతో బతుకులీడుస్తున్నారని వాపోయారు. ఒకే నాయకుడు, ఒకే సిద్ధాంతం, ఒకే చిహ్నంపై విశ్వాసాన్ని పెంచుకున్న భాజపా దేశంలో నియంతృత్వ పాలనను నెలకొల్పిందని దుయ్యబట్టారు. రాజ్యాంగం, లౌకికవాదంపై విశ్వాసం లేని మంత్రులు, ఎంపీలు ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రకటించారని వాపోయారు. గతంలో ఏబీ వాజపేయీ కూడా రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నం చేశారన్నారు. దేశాన్ని విభజించే ప్రయత్నాన్ని అప్పటి రాష్ట్రపతి నారాయణన్‌ అడ్డుకున్నారని చెప్పారు. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఆ ప్రయత్నం నిరాటంకంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఆలకిస్తున్నామన్నారు. మరో ఆరు నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కానుండగా రాష్ట్రం నుంచే మార్పునకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

గుండ్లుపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కదలివచ్చిన కాంగ్రెస్‌ మద్దతుదారులు

ఎన్‌డీఏపై నిప్పులు
కాంగ్రెస్‌ చరిత్రలో సుదీర్ఘ పాదయాత్రగా ఆ పార్టీ నేతలు అభివర్ణించే ఐక్యతా యాత్ర కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టింది. రాహుల్‌గాంధీతో అడుగులో అడుగేసిన విపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, జైరాం రమేశ్‌, డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ తదితరులు కేంద్ర, రాష్ట్రాల పాలనపై విమర్శలతో దండెత్తారు. తమ అభిప్రాయాలు చెప్పటం కంటే ప్రజల సమస్యలను ఆలకించటమే ఉత్తమంగా భావిస్తున్నామని రాహుల్‌ వివరించారు. స్నేహం, సంఘీభావంతో ఉంటే విజయం తథ్యమని నినదించారు. సిద్ధరామయ్య- డీకే శివకుమార్‌లతో చేతులు కలిపి యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్‌.. మరోమారు సమైక్య సందేశాన్ని వెల్లడించారు. దావణగెరె సిద్ధరామోత్సవ సమావేశంలోనూ ఇద్దరి మధ్య సమన్వయాన్ని పెంచే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తాండవిస్తున్న అవినీతిని పారదోలాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని