logo

నంజనగూడుకు ప్రగతి తోడు

నంజనగూడు నియోజకవర్గాన్ని ధార్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.

Updated : 29 Nov 2022 05:55 IST

మైసూరులో పది పడకల ఐసీయూ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి, ప్రముఖులు

మైసూరు, న్యూస్‌టుడే : నంజనగూడు నియోజకవర్గాన్ని ధార్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. మైసూరు, నంజనగూడు నియోజకవర్గాల్లో సోమవారం మధ్యాహ్నం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. శ్రీకంఠేశ్వరుని ఆలయంలో పూజలు చేయించుకున్నారు. నంజనగూడు శ్రీకంఠేశ్వర ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నుగు, హెడియాల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కబిని ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభించామని గుర్తు చేశారు. ఉపన్యాసానాలతో సామాజిక న్యాయం దక్కదని, పేదల కడుపు నిండదని పేర్కొన్నారు. తమది మార్పునకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో ఐదు వేల మంది విద్యార్థులు మెగా హాస్టళ్లలో ఉంటూ విద్యాభ్యాసం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నంజనగూడు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ సహకారంతో రూ.30 కోట్ల ఖర్చుతో స్థానికంగా అన్ని చెరువులలో నీటిని నింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. మైసూరు కె.ఆర్‌.ఆసుపత్రితో పాటు 41 తాలూకా ఆసుపత్రులలో పది పడకల ఐసీయూలు,  మైసూరు వైద్య కళాశాలలో హాస్టళ్లు, స్కిల్‌ ల్యాబ్‌, ఇతర సదుపాయాలను ఇదే సందర్భగా బొమ్మై ప్రారంభించారు. మైసూరు పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ అమృత మహోత్సవాలను ప్రారంభించారు. సంస్థ నుంచి రూ.28.41 లక్షల డివిడెంట్ను అందుకున్నారు. రాజమాత ప్రమోదాదేవి, మంత్రులు డాక్టర్‌ సుధాకర్‌, గోవింద కారజోళ, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్‌, రామదాసు, తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని