logo

నాలుగేళ్ల బాలుడు.. గదిలో ఊపిరాడక..

రాజధాని నగరంలో ఇదొక విషాద ఘటన. సుల్తాన్‌పాళ్య సమీపంలోని ఉడ్‌ అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఊపిరి ఆడక నాలుగేళ్ల బాలుడు మరణించాడు.

Published : 16 Apr 2024 00:53 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాజధాని నగరంలో ఇదొక విషాద ఘటన. సుల్తాన్‌పాళ్య సమీపంలోని ఉడ్‌ అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఊపిరి ఆడక నాలుగేళ్ల బాలుడు మరణించాడు. బాలుని తండ్రి కాపలాదారు. అతని తల్లి హౌస్‌ కీపింగ్‌లో పని చేస్తోంది. నేపాల్‌కు చెందిన వీరు కొన్నేళ్లుగా అక్కడ ఉంటున్నారు. తమ బిడ్డను గదిలో వదిలి- వీరు ఆదివారం రాత్రి విధులు నిర్వహించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. పొగతో ఊపిరి ఆడక బాలుడు విలవిలాడాడు. ఎవరూ రక్షించేవారు లేక మరణించాడు. ఉదయం ఆ తల్లిదండ్రులు వెళ్లి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారి కన్నీరు కట్టలు తెగింది. ఆర్‌టీనగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ప్రాణం తీసిన ‘వీలింగ్‌’

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ముగ్గురు యువకులు ఒకే బైకుపై వీలింగ్‌ చేస్తున్న సమయంలో అది అదుపుతప్పింది. అడ్డదిడ్డంగా దూసుకెళ్లి ఓ గుంతలో పడింది. వాహనం పైనుంచి కింద పడిన ఘటనలో సద్దాం హుసేన్‌ (20) అనే యువకుడు మరణించాడు. ఉమ్రాన్‌ పాషా, ముబారక్‌ పాషా అనే యువకులు గాయపడ్డారు. జగ్జీవన్‌రామ్‌ నగరకు చెందిన వీరు కెంగేరి సమీపంలోని కొమ్మఘట్ట కూడలి వద్ద ఆదివారం రాత్రి వీలింగ్‌ చేస్తూ పది అడుగుల లోతున్న గుంతలోకి పడిపోయారు. నీటి గొట్టాలు అమర్చడానికి రహదారి పక్కనే గుంత తీయడాన్ని వారు గమనించలేకపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సద్దాం హుసేన్‌ సోమవారం ఉదయం మరణించాడు. కెంగేరి ట్రాఫిక్‌ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


సుడాన్‌లో హుణసూరు మహిళ విషాదాంతం

మైసూరు: ఈశాన్య ఆఫ్రికాలోని సుడాన్‌ దేశంలో వ్యాపారం చేసేందుకు వెళ్లిన హక్కిపిక్కి సముదాయానికి చెందిన నందిని అనే మహిళ అనారోగ్యంతో మరణించింది. హుణసూరు తాలూకా పక్షిరాజపురకు చెందిన ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మాజీ ఎమ్మెల్యే హెచ్‌పీ మంజునాథ్‌ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుడాన్‌లోని భారత రాయబారితో మాట్లాడారని, బుధవారం నాటికి నందిని మృతదేహాన్ని హుణసూరుకు తీసుకురానున్నారని వివరించారు.


నటుడు సుబ్బరాము మృతి

బెంగళూరు (మల్లేశ్వరం): సీనియరు నాటక కళాకారుడు, బుల్లితెర నటుడు ప్రదీప్‌ అలియాస్‌ సుబ్బరాము (73) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. పది రోజుల కిందటే ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆయనను ఇంటికి తీసుకువచ్చేలోగా మరోసారి గుండెపోటుకు గురి కావడంతో మరణించారు. మంగళవారం నగరంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య కల్యాణి నాటకరంగ కళాకారిణే.


పెళ్లి పేరిట వంచనపై ఫిర్యాదు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : వివాహం చేసుకుంటానని నమ్మించి ఆదిత్య సింగ్‌ అనే వ్యక్తి తనను వంచించాడని ఉత్తరాదికి చెందిన ఒక మహిళా టెకీ (27) పోలీసుకు ఫిర్యాదు చేశారు. జిమ్‌కు వెళుతున్న సమయంలో పరిచయమైన యువకుడు కూడా మరో కంపెనీలో టెకీ. అతని మాటలు విశ్వసించి కొద్ది నెలలు అతనితో ఆమె సహజీవనం చేసింది. ఇప్పుడు తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తూ, దాడి చేస్తున్నాడని, తన ఒంటిపై కత్తితో గాటు పెట్టాడని బండేపాళ్య ఠాణాలో ఫిర్యాదు చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదిత్యసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.


గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

హాసన, న్యూస్‌టుడే : మైసూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభ భద్రతకు వెళ్లి, ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో సిద్ధప్ప (50) అనే కానిస్టేబుల్‌ గుండెపోటుతో మరణించారు. బేలూరు ఠాణాలో ఆయన సేవలు అందిస్తున్నారు. విధులు ముగించుకుని, ఇంటికి వచ్చేందుకు పోలీసు వ్యాను ఎక్కి నిద్రపోయారు. హాసనకు చేరుకునే సరికి ఆయన నిద్రలోనే చనిపోయారు. గుండెపోటే ఆయన మృతికి కారణమని వైద్యులు గుర్తించారు.


ఊరేగింపు వేళ.. యువకుడి హత్య

కలబురగి, న్యూస్‌టుడే : డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 133వ జయంతిలో భాగంగా కలబురగిలో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రదర్శన సందర్భంగా ఆకాశ్‌ (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అశోకనగరకు చెందిన ఆకాశ్‌ను ఊరేగింపు నుంచి పక్కకు పిలిచిన ఆగంతకులు కత్తితో పొడిచి పరారయ్యారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. పరారైన నిందితుల కోసం అశోకనగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఏనుగుల దాడిలో ఇద్దరి దుర్మరణం

మడికేరి, న్యూస్‌టుడే : కొడగు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో అడవి ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పొన్నంపేట తాలూకా బీరుగ గ్రామానికి చెందిన అయ్యమాడ మాదయ్య (63) అనే వ్యక్తి సోమవారం ఉదయం వ్యాహ్యాళికి వెళుతున్న సమయంలో కాఫీ తోట మధ్య నుంచి వచ్చిన ఏనుగు ఆయనపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. మడికేరి తాలూకా నాలగి గ్రామంలో తన కాఫీ తోటకు వెళ్లిన రాజ దేవయ్య (59) అనే రైతుపై అక్కడే ఉన్న ఏనుగు దాడి చేసింది. తోటలో ఉన్న కార్మికులు కేకలు వేసుకుంటూ అక్కడికి వచ్చేలోగా ఏనుగు తప్పించుకుంది. ఏనుగు దాడిలో రాజ దేవయ్య అక్కడికక్కడే మరణించారు. అడవిలో నీరు లభించకపోవడంతోనే ఏనుగులు చుట్టుపక్కల గ్రామాలకు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. అటవీ ప్రాంతాల కుంటలను నీటితో నింపాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని