logo

డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Published : 18 Apr 2024 02:49 IST

బాలికను అపహరించారని నింద

హాసన, న్యూస్‌టుడే : ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాలిక తండ్రి అమెరికాలో ఒక కంపెనీ ప్రారంభించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు కూడగట్టుకున్నారని తెలుసుకుని ఈ అపహరణకు పాల్పడినట్లు గౌడ వివరించారు. ఆ బాలికను తీసుకెళ్లి గంగమ్మ తిమ్మయ్య అనే వ్యక్తి ఇంటి పక్కన ఓ గదిలో దాచారని వివరించారు. ఆమె తండ్రి నుంచి ఆస్తి రాయించుకున్న తర్వాతే విడిచి పెట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

కాంగ్రెస్‌ పతనమే..

లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ పతనం అవుతుందని దేవేగౌడ జోస్యం చెప్పారు. బేలూరు తాలూకా ఇబ్బీడు గ్రామంలో దళ్‌, భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో ప్రధానిగా కొనసాగేందుకు నరేంద్రమోదీకి మినహా మరెవరికీ అర్హత లేదన్నారు. కర్ణాటకతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉందన్నారు. మహిళలను ఉద్దేశించి కుమారస్వామి చేయని వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అంటగట్టిందని ఆరోపించారు. వివాదం తీవ్రం కాకుండా ఉండేందుకు కుమారస్వామి ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి తక్కువ స్థాయి రాజకీయాలు చేసే స్థితికి చేరుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఛలవాది నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే లింగేశ్‌, జనతాదళ్‌ నాయకుడు అనంత సుబ్బరాయ, భాజపా నాయకులు అడగూరు ఆనంద్‌, ఎంఏ నాగరాజ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని