logo

విద్యానగరిలో స్వతంత్రుడి సెగ?

ధార్వాడ లోక్‌సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్‌ జోసి- యువనేత వినోద్‌ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది.

Published : 18 Apr 2024 02:53 IST

ధార్వాడలో నెగ్గే సత్తా ఎవరిదో!

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ధార్వాడ లోక్‌సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్‌ జోసి- యువనేత వినోద్‌ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది. వారిద్దరి మధ్య మఠాధిపతి దింగాలేశ్వర స్వామి బరిలోకి రావడంతో రాజకీయాలే ఆసక్తికరంగా మారాయి. విద్యారంగ ప్రగతికి పెట్టింది పేరైన ధార్వాడలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు- న్యాయ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఐదో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీలో దిగారు. ఆయనను ఎదుర్కొనేందుకు యువ నాయకుడు వినోద్‌ అసూటిని కాంగ్రెస్‌ ప్రయోగించింది. జోషి వ్యవహార శైలి నచ్చడం లేదంటూ మఠాధిపతి దింగలేశ్వర స్వామి ఓట్ల వేటకు సన్నద్ధమయ్యారు. లింగాయతులను కించపరిచేలా జోషి మాట్లాడుతున్నారనేది స్వామీజీ ఆరోపణ. ఆయనకు రాజకీయంగానే బుద్ధి చెప్పేందుకు పోటీలో ఉన్నట్లు స్వామీజీ వివరించారు. మఠాధిపతి ముందుగా పోటీ చేస్తామంటే కాంగ్రెస్‌ బి.ఫాం ఇచ్చేదని ఉపముఖ్యమంత్రి డీకేశివకుమార్‌ వ్యాఖ్యానించారు. లింగాయతుల్లో అత్యధికులు భాజపా అభ్యర్థి విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ధార్వాడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఎదురు చూసిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ను బెళగావిలో బరిలో దింపడం భాజపా కొత్త రాజకీయాలకు దర్పణం. కేంద్ర మంత్రిగా జోషి రాష్ట్రానికి చేసింది ఏమీలేదని, కరవు పరిస్థితులు నెలకొన్నా కేంద్రం నుంచి సాయం చేయించలేదనే అపవాదు లేకపోలేదు. రాయచూరులో ఎయిమ్స్‌ ఏర్పాటుకు చొరవ తీసుకోలేదనే నిందలూ ఆయన భరిస్తున్నారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. 1990లో హొబ్బళ్లి ఈద్గా మైదానం వివాదంతో ధార్వాడ జిల్లాలో భాజపా బలపడటం నిన్నమొన్నటి చరిత్ర. 1996 నుంచి ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పతాకం ఎగురుతూనే ఉంది. కేసరి కోటను బద్ధలు కొట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ధార్వాడ కొత్త రూపు దాల్చింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో జోషికి ఎదురే లేకుండా పోయింది. మరోసారి విజయం సాధించాలని శ్రమిస్తున్నారు. వెనకబడిన వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ అసూటి తమ వంతు సత్తా చాటుతున్నారు. మఠాధిపతి దింగలేశ్వర స్వామి ప్రస్తుతం కీలకంగా మారారు.

విద్యానగరి ధార్వాడకే తలమానికం.. ఐఐటీ కళాశాల!

విధానసభ సెగ్మెంట్లు : ధార్వాడ, హుబ్బళ్లి, ధార్వాడ తూర్పు, సెంట్రల్‌, పడమర, నరగుంద, కుందగోల్‌, శిగ్గావి.
ఓటర్లు : 15.60 లక్షలు, పురుషులు- 7.80 లక్షలు, మహిళలు- 7.79 లక్షలు, ఇతరులు 90 మంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని