logo

‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..

మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్‌ ఎంపీ అణ్ణా సాహెబ్‌ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ

Published : 19 Apr 2024 02:58 IST

అణ్ణా సాహెబ్‌ జొల్లె

రాయచూరు, న్యూస్‌టుడే : మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్‌ ఎంపీ అణ్ణా సాహెబ్‌ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజా పనులశాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి కూతురే ప్రియాంక! ఈ క్రమంంలోనే చిక్కోడి అందరినీ ఆకర్షిస్తోంది. సతీశ్‌ సోదరులు రమేశ్‌ జార్కిహొళి (గోకాక్‌), బాలచంద్ర జార్కిహొళి (అరబావి) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గత భాజపా ప్రభుత్వాల్లో వారు మంత్రులుగా పనిచేశారు. బెళగావి జిల్లాలో వారి కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఉంది. ప్రజలతో మమేకమైన ఆ కుటుంబం తరఫున ఎవరు పోటీ చేసినా విజయం తథ్యమనే అంచనాలు లేకపోలేదు. జార్ఖిహొళి కుటుంబ సభ్యులు సూచించిన వారికే ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తారు. చిక్కోడిలో పాగా వేయటానికి కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ప్రియాంకను అభ్యర్థినిగా నిర్ణయించింది. ఫలితంగా భాజపాకు గట్టి పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో సులువుగా ఒడ్డు దాటిన జొల్లైకు ప్రియాంక ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇధ్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొంది.

ప్రియాంక జార్ఖిహొళి

కాంగ్రెస్‌ ఆందోళన: స్వతంత్ర అభ్యర్థి అయిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శంభు కల్లోళికర్‌ కాంగ్రెస్‌ కంట్లో నలుసులా మారారు. ఈయన గత విధానసభ ఎన్నికల్లో రాయబాగ (ఎస్సీ రిజర్వు) నుంచి హస్తం పార్టీ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఓట్లకు గండి కొట్టడంతో భాజపా ఎమ్మెల్యేగా దుర్యోధన మహాలింగప్ప ఐహోళి నెగ్గారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రియాంకకు వచ్చే ఓట్లను చీలిస్తారేమోన్న భయం కాంగ్రెస్‌ నాయకుల్లో కన్పిస్తోంది. దీంతో జార్కిహొళి కుటుంబం చిక్కోడిలో తిష్ట వేసింది. పార్టీలకు అతీతంగా పంచాయతీ సభ్యులు, తాలూకా, జడ్పీ మాజీ సభ్యులను భేటీ అయి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలు ప్లస్‌ పాయింటే. చిక్కోడి పరిధిలో ఐదు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండటం అదనపు బలమే. ఎమ్మెల్యే ఎన్నికల్లో హస్తానికి ఓటు వేసిన వారు ఎంపీ ఎన్నికల్లో భాజపా వైపు మొగ్గు చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకుల అంచనా. దీన్ని అధిగమించడం అంత సులువు కాదని చెప్పొచ్చు. సిద్ధరామయ్య ప్రభుత్వం కరవు నష్ట పరిహారం నామమాత్రంగా ఇవ్వడంతో అన్నదాతలు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఇది కొద్దిలో  కొంచెమైనా కీడు చేస్తుందేమోననే ఆందోళన పార్టీలో కన్పిస్తోంది.

నియోజకవర్గ స్వరూపం: చిక్కోడి, నిప్పాణి, అధణి, కాగవాడ, కుడచి, రాయబాగ్‌, హుక్కేరి, యమకనమరడి విధానసభ సెగ్మెంట్లతో ఈ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. మంత్రి సతీశ్‌ జార్కిహొళి యమకనమరడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిక్కోడి పరిధిలో 17,32,346 మంది ఓటర్లున్నారు. ముస్లింలు 1.80 లక్షలు, కురుబలు 1.70 లక్షలు, దళితులు 1.65 లక్షలు, జైనులు 1.30 లక్షలు, ఎస్టీలు 90 వేలు, ఇతర సామాజిక వర్గాల ఓట్లు 2.55 లక్షలు ఉన్నాయి. చిక్కోడి వాసులకు వ్యవసాయం ప్రధాన ఆధారం. ఇక్కడ ఐదు చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. సౌర, గాలిమరల ద్వారా విద్యుదుత్పాదన కీలకం. మహారాష్ట్ర కొల్హాపూరు మహాలక్ష్మి దేవస్థానం చిక్కోడి నుంచి 65 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.


మోదీనే శ్రీరామరక్ష

ప్రధాని జనారక్షణ ఇక్కడ కూడా కన్పిస్తోంది. యువత మోదీ మంత్రాన్ని జపిస్తోంది. హిందుత్వ ప్రభావం ఎలాగూ ఉంది. ఐదేళ్లలో రూ.8810 కోట్లతో చేసిన పనులే విజయాన్ని అందిస్తుందని అణ్ణా సాహెబ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ కేటాయింపులో ఏర్పడిన అసమ్మతి జ్వాలను యడియూరప్ప ఆరంభంలోనే ఆర్పేశారు. దరిమలా కమలనాథులు సమష్టి ప్రచారం చేయడం అభ్యర్థిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మరాఠా సముదాయం ఓట్లు 1.70 లక్షలు ఉన్నాయి. ఎంపీ భార్య నిప్పాణి ఎమ్మెల్యే శశికళా మరాఠా వారైనందున ఆ సామాజిక వర్గం ఓట్లు ఏకపక్షంగా పడుతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. లింగాయత్‌ల ఓట్లు అత్యధికంగా 4.10 లక్షలు ఉన్నాయి. లింగాయత్‌లు సహజంగా భాజపా వైపు ఉంటారు. వీరిని ప్రియాంక వైపు మళ్లించేందుకు లింగాయత్‌ సామాజిక వర్గం ప్రముఖుడు, మాజీ మంత్రి, అధణి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మణ సవదిని రంగంలోకి దింపారు. ఇతడు సామాజిక వర్గం పెద్దలను ఆశ్రయిస్తున్నారు. ఎంపీ నిప్పాణి నియోజకవర్గాన్ని వదలి రావడం లేదని ప్రత్యర్థులు ఇతర క్షేత్రాల్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని