logo

అయిదు కోట్లు వెచ్చించినా అహ్లాదం ఏది..!

వైరా జలాశయం అంటే గతంలో పర్యాటకులతో సందడిగా కనిపించేది. ఉభయ జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలో జలాశయ అందాల్ని వీక్షించేందుకు వచ్చేవారు. ఇక్కడి పార్కు, ఇతరత్రా సదుపాయాలూ పర్యాటకుల్ని ఆకట్టుకునేవి. కొన్నేళ్లుగా కళతప్పిన జలాశయానికి తిరిగి

Updated : 28 Jan 2022 06:04 IST

కళ తప్పిన వైరా ట్యాంక్‌బండ్‌

వైరా, న్యూస్‌టుడే

ఇలా తయారైంది..

వైరా జలాశయం అంటే గతంలో పర్యాటకులతో సందడిగా కనిపించేది. ఉభయ జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలో జలాశయ అందాల్ని వీక్షించేందుకు వచ్చేవారు. ఇక్కడి పార్కు, ఇతరత్రా సదుపాయాలూ పర్యాటకుల్ని ఆకట్టుకునేవి. కొన్నేళ్లుగా కళతప్పిన జలాశయానికి తిరిగి సొబగులు అద్దేందుకు చేపట్టిన పనులు గాడి తప్పాయి. ఏ మాత్రం ఆకర్షణీయ ఏర్పాట్లు ఇక్కడ కనిపించటం లేదు. వైరా జలాశయం ఆనకట్టను ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ.5.7 కోట్లు మంజూరు చేసింది. ట్యాంక్‌బండ్‌గా మార్చే పనులన్నీ పది నెలల క్రితమే పూర్తయినా ఏడాదిగా ఎలాంటి పురోగతి లేదు. పనులను చూస్తే ఏళ్ల క్రితం మధ్యలో వదిలేసినట్టు కనిపిస్తున్నాయి. సహజసిద్ధ జలాశయంతో ఆనకట్ట ఉన్నా పర్యాటక శోభ కరవైంది.

అభివృద్ధి పనుల్లో భాగంగా ఆనకట్ట నుంచి దిగువ భాగంలో పూర్తిగా లాన్‌ (పచ్చగడ్డి) వేశారు. సుమారు 30 వేల చదరపు మీటర్ల పరిమాణంలో వేసిన లాన్‌కు రూ.24 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం పచ్చదనం ఎక్కడా కనిపించదు. పూర్తిగా ఎండిపోయి పిచ్చిగడ్డి, పిచ్చిమొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల గుంతలున్నాయి. అప్పుడప్పుడు నీళ్లు పడుతున్నా పచ్చదనం పూర్తిగా కనుమరుగైంది.

* ఆనకట్ట అంచు వరుసలో మొక్కలు నాటినా ఆహ్లాదకరంగా లేవు.


‘‘వైరా జలాశయం సుందరంగా ఉంది. ట్యాంక్‌బండ్‌ పనులు త్వరగా చేసి ఖమ్మం ట్యాంక్‌బండ్‌కు దీటుగా మార్చాలి. స్థానిక మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. సుందరీకరణకు సుడా నిధులు ఇస్తాం.’’

- ట్యాంకుబండ్‌ పనుల పరిశీలనప్పుడు మంత్రి అజయ్‌


సుదూర మార్గంలో వెలుగులు కరవు..

ట్యాంకుబండ్‌పై లైటింగ్‌ పనులు ఆరంభం కాలేదు. సుమారు 70 సోలార్‌ లైట్లు అమర్చాల్సి ఉండగా దీనికోసం రూ.34 లక్షల కేటాయించారు. ఇంకా టెండర్లు పిలవలేదు.


కట్ట వెడల్పు కోసం భారీగా మట్టి తోలకం

సుమారు 1.5 కి.మీ. పొడవున్న ఆనకట్టను వెడల్పు చేశారు. గతంలో రెండున్నర మీటర్ల వెడల్పున్న ఆనకట్టను ఏడు మీటర్లకు పైగా పెంచారు. దీని కోసం సుమారు 1.2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తోలారు. రూ.కోటికి పైగా వెచ్చించినట్లు అధికారులు చెబుతున్నారు.


రెయిలింగ్‌, బతుకమ్మ ఘాట్‌

రూ.కోటి వ్యయంతో కట్టపై రెయిలింగ్‌, ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. సుమారు రూ.90 లక్షలతో బతుకమ్మ ఘాట్‌ను నిర్మించారు. వీటికి సంబంధించి రూ.2.3 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ఇంకా కొన్ని చెల్లింపు దశలో ఉన్నాయి.


ఇలా చేయాలి...

1. లైటింగ్‌ను ఏర్పాటుచేసి నిర్వహణను మున్సిపాలిటీకి అప్పగించాలి.
2. మున్సిపాలిటీ యంత్రాంగం కూర్చునే బల్లలు, పూల మొక్కలు, ఇతర ఆహ్లాదకర వాతావరణాన్ని సమకూర్చాలి.
3. ప్రస్తుతం ప్రవేశ ద్వారం సాధారణంగానే ఉంది. ఎంట్రీప్లాజా స్థాయిలో ఆకర్షణీయ ద్వారం ఏర్పాటుచేయాలి.
4. చిన్నారులను ఆకట్టుకునేలా ఆట వసతులు నెలకొల్పాలి.


‘‘ట్యాంక్‌బండ్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. లైటింగ్‌ సౌకర్యం మాత్రమే ఏర్పాటు చేయాలి. టెండర్లకు కసరత్తు చేస్తున్నాం. లాన్‌ వేసి సంరక్షించే చర్యలు తీసుకుంటున్నాం. బ్యూటిఫికేషన్‌ను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంది.’’

- శ్రీనివాస్‌, నీటిపారుదల శాఖ డీఈ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని