logo

సిమెంటు దిమ్మె జారిపడి యువకుడి మృతి

వంతెన నిర్మాణ పనుల వద్ద జరిగిన ఓ ప్రమాదంలో భారీ సిమెంటు దిమ్మె మీద పడటంతో వలస కూలీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి.

Published : 19 May 2022 05:47 IST

సుజాతనగర్‌, న్యూస్‌టుడే: వంతెన నిర్మాణ పనుల వద్ద జరిగిన ఓ ప్రమాదంలో భారీ సిమెంటు దిమ్మె మీద పడటంతో వలస కూలీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సుజాతనగర్‌ మండలం వేపలగడ్డ గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రైలు పట్టాల మీదుగా భారీ వంతెన (రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడకు కూలీ పనులు చేసేందుకు పశ్చిమ బంగ రాష్ట్రం బీర్బూర్‌ జిల్లా నక్ష్యర్‌కొండకు చెందిన జయదేవ్‌ దాస్‌ (21) రెణ్నెల్ల క్రితం బంధువులతో కలిసి వచ్చాడు. రోజూ నిర్వహించే పనుల్లో భాగంగా టన్ను బరువున్న సిమెంటు దిమ్మెను నలుగురు కూలీలు క్రేన్‌ సహాయంతో తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు జయదేవ్‌ దాస్‌ వైపు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంతో అతని తల ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బంధువైన ఆనంద్‌ బస్రీ కాలుకు గాయమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. జయదేవ్‌ అవివాహితుడు కాగా.. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని