logo

ఇద్దరి మృతదేహాలు లభ్యం

మండలంలో సుర్థేపల్లి చెక్‌డ్యాం వద్ద గల్లంతైన చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్‌(29), ఖమ్మం డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యుడు బాశెట్టి ప్రదీప్‌(32) మృతదేహాలు శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. చెక్‌డ్యాం వద్ద చేపల వేటకు వెళ్లి గురువారం

Published : 13 Aug 2022 02:46 IST

‘సుర్థేపల్లి’ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన

జిల్లా ఆసుపత్రి మార్చురి వద్ద ఆందోళన చేస్తున్న

కార్మిక సంఘాల ఐకాస నాయకులు

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: మండలంలో సుర్థేపల్లి చెక్‌డ్యాం వద్ద గల్లంతైన చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్‌(29), ఖమ్మం డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యుడు బాశెట్టి ప్రదీప్‌(32) మృతదేహాలు శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. చెక్‌డ్యాం వద్ద చేపల వేటకు వెళ్లి గురువారం సాయంత్రం గల్లంతైన పగడాల రంజిత్‌ ఆచూకీ గుర్తించేందుకు వెళ్లిన ఖమ్మం నగరపాలక సంస్థకు చెందిన డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యుడు బాశెట్టి ప్రదీప్‌, పడిగెల వెంకటేశ్‌(29)లు గల్లంతైన విషయం విదితమే. వీరిలో వెంకటేశ్‌ మృతదేహాన్ని ఘటన జరిగిన రోజు రాత్రే గుర్తించగా, శుక్రవారం రంజిత్‌, ప్రదీప్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏటికి 500 మీటర్ల దూరంలో ఉదయం 7 గంటలకు రంజిత్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 8 గంటలకు చెక్‌డ్యాం వద్దే ప్రదీప్‌ మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా, సమీప రైతు బొంత గోవిందు వెలికితీశాడు. ప్రదీప్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీపీఎం, ఎమ్మార్పీఎస్‌, కేవీపీఎస్‌ నాయకులు ఆందోళన చేశారు. తన కుమారునికి తెలియని, సంబంధంలేని పనులు అంటగట్టి అతని మృతికి కారణమైన అధికారులు సమాధానం చెప్పాలంటూ మృతుని తల్లి రమాదేవి డిమాండ్‌ చేశారు. రాఖీ రోజు చోటుచేసుకున్న విషాదాన్ని తలచుకుని ప్రదీప్‌ సోదరి విలపించింది. ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీవో శివ, తహసీల్దార్‌ ధార ప్రసాద్‌.. ప్రదీప్‌ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు యత్నించగా అంగీకరించలేదు. మృతదేహాన్ని బలవంతంగా తరలించేందుకు ముదిగొండ ఎస్సై తోట నాగరాజు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సీపీఎం నాయకుల సూచన మేరకు మధ్యాహ్నం 12గంటల సమయంలో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి రాని ఎస్సై: స్థానిక ఎస్సై స్రవంతి శుక్రవారం ఘటనాస్థలానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. ఈమె విధుల్లోనే ఉన్నా సుర్థేపల్లి రాలేదు. మధ్యాహ్నం సమయంలో ఖమ్మం గ్రామీణం సీఐ శ్రీనివాసరావు వచ్చారు. మృతదేహం తరలింపు విషయంలో కేవీపీఎస్‌ నాయకులు పొట్టపెంజర నాగులుతో ఎస్సై నాగరాజు వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా ఘటనా స్థలానికి వచ్చిన ఓ విలేకరిపై(ఈనాడు కాదు) స్థానికులు, ప్రదీప్‌ కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారు. అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు.

ఆసుపత్రిలో కార్మికుల ఆందోళన

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రదీప్‌, వెంకటేశ్‌ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక ఐకాస ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. అనుభవం, సరైన శిక్షణ లేని వారిని ప్రమాదకర పనులకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మృతదేహాలను తరలించేందుకు పోలీసులు యత్నించగా అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. తుదకు పలు పార్టీల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్‌, నున్నా నాగేశ్వరరావు, గోగినేపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేంద్రలు ఆర్‌డీవో రవీంద్రనాథ్‌తో నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో ఆందోళన విరమించారు.

రూ. 7లక్షల పరిహారం.. ఒప్పంద ఉద్యోగం: నగరపాలక మేయర్‌ పునుకొల్లు నీరజ అక్కడకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి నగరపాలకం నుంచి రూ.5లక్షలు, పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి రూ.2లక్షల చొప్పున అందిస్తారని, కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, కార్మిక సంఘాల నాయకులు విష్ణువర్ధన్‌, శ్రీకాంత్‌, వెంకటేశ్వర్లు, రామయ్య, అశోక్‌, క్లెమెంట్‌, రామాంజనేయులు, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

ఖమ్మం గ్రామీణం, చింతకాని, న్యూస్‌టుడే: చింతకాని మండలం నాగులవంచలో బాసెట్టి ప్రదీప్‌, నేలకొండపల్లి మండలం చెన్నారంలో రంజిత్‌, ఖమ్మం గ్రామీణ మండలం ఎంవీపాలెంలో పడిగెల వెంకటేశ్‌లకు అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రదీప్‌కు భార్య నాగ, కుమార్తె రూప ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని